కుల్మాన్ ఘీజింగ్ వైపు మొగ్గు ?
నేపాల్ సంక్షోభ పరిష్కారానికి
చర్చలే శరణ్యమన్న నేతలు
ఖాట్మండు : అరాచక పరిస్థితులను, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌కు తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టే విషయమై అనిశ్చితి కొనసాగుతోంది. సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల్ కర్కి పేరును తొలుత జెన్ జడ్ యువత ప్రతిపాదించారు. కానీ ఆమె వయస్సు, అర్హతల ప్రాతిపదికన ఆందోళనకారులు ఆమె పేరును పక్కకు పెట్టి కుల్మాన్ ఘీజింగ్ పేరును ప్రతిపాదించారని కాంతిపూర్ టివి పేర్కొంది.
అయితే ఆందోళనకా రుల్లోనే మరో వర్గం ఇంకా కర్కిని బలపరుస్తోంది. కర్కి కూడా చర్చల్లో పాల్గొంటున్నారు, నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఆమె సంసిద్ధంగా కూడా వున్నారని వార్తలు వెలువడుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ డిస్కార్డ్ ద్వారా ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించగా, మెజారిటీ ప్రజలు సుశీలా కర్కి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఎవరీ కుల్మాన్ ఘీజింగ్ ?
తాను రేస్‌లో లేనని ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా స్పష్టం చేయడంతో తెరపైకి వచ్చిన మరో పేరు కుల్మాన్ ఘీజింగ్. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఘీజింగ్ ఈ ఏడాది మార్చిలో వివాదాస్పద రీతిలో పదవీచ్యుతుడయ్యారు. ఏళ్ళ తరబడి నేపాల్‌లో కొనసాగిన విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించిన ఘనత ఆయనకు దక్కుతుంది.
శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి
ఆందోళనల నేపథ్యంలో ప్రధాని ఓలి రాజీనామాతో దేశంలో నెలకొన్న పరిస్థితులను చక్కబరచాలంటే చర్చలే శరణ్యమని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు చర్చల కోసం వారు పిలుపిచ్చారు. ఈ మేరకు నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్), సిపిఎన్(మావోయిస్టు సెంటర్) నేతలు వేర్వేరుగా ప్రకటనలు చేశారు. రాజ్యాంగ చట్రపరిధిలో శాంతియుతంగా సంక్షోభాన్ని పరిష్కరిం చుకోవాల్సిన అవసరం వుందని వారు నొక్కి చెప్పారు. యువత చేసిన డిమాండ్లను రాజ్యాంగ మార్గాల ద్వారా పరిష్కరించాలని కోరారు. ఈ పరిస్థి తుల్లో జెన్ జడ్ కార్యకర్తలు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ఆర్మీచీఫ్ జనరల్ అశోక్ సిగ్దల్‌కు అధికారమిచ్చారు.
34కి పెరిగిన మృతులు
ఇదిలావుండగా నేపాల్ ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 34కి చేరింది. భద్రతా సిబ్బందితో జైల్లో ఖైదీలు ఘర్షణలకు దిగగా ముగ్గురు మరణించారు. దీంతో మరణించిన ఖైదీల సంఖ్య 8కి చేరింది. దేశవ్యాప్తంగా 1368 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మృతి చెందినవారిలో 25మందిని గుర్తించినట్లు ఖాట్మండు పోస్ట్ పేర్కొంది. అంతర్జాతీయ ప్రొటొకాల్ మేరకు పోస్టుమార్టం నిర్వహించామని, అయితే వివరాలు వెల్లడించలేమని, కానీ మృతదేహాన్ని పరిరక్షించాల్సిందిగా కోరారని త్రిభువన్ యూనివర్శిటీ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగ అధికారులు తెలిపారు.
పారిపోయిన 15వేల మంది ఖైదీలు
కాగా నిరసనలు, అల్లర్లు చెలరేగిన ఆ రెండు రోజుల సమయంలో దేశవ్యాప్తంగా రెండు డజన్లకు పైగా జైళ్ళ నుండి 15వేల మందికి పైగా ఖైదీలు పారిపోయారు. ఖాట్మండు లోయలోని మూడు జిల్లాల్లో నిషేధాజ్ఞలను సైన్యం పొడిగించింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంపై ఆర్మీ దృష్టి పెట్టి అందుకు తగిన చర్యలు తీసుకుంటుండగా తాత్కాలిక ప్రభుత్వ నేతలపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నిరసనకారుల డిమాండ్ల పరిష్కారానికి కృషి
ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడల్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగపరిధిలోనే వుంటూ సాధ్యమైనంత త్వరగా నిరసనకారుల డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించాలంటూ అభ్యర్ధనలు వెలువడుతున్న తరుణంలో పౌడల్ గురువారం ఒక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.
తాత్కాలిక నాయకత్వంపై అనిశ్చితి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES