మూడవ ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నాకు తెలియదు కానీ, నాలుగవ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్లతో, కర్రలతో జరుగుతుంది!
-ఆల్బర్ట్ ఐన్ స్టీయిన్; ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త.
పై మాటలో – అర్థం చేసుకుంటే చాలా విషయముంది. కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలలో జరుగుతున్న యుద్ధాల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఏళ్లకేళ్లుగా ఇవి జరుగుతూ ఉండడం అవసరమా? రష్యా-ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఇజ్రాయిల్ పాలస్తీనాను ధ్వంసం చేసింది. ఇటీవల ఇజ్రాయిల్ అమెరికాను వెంటేసుకుని వచ్చి, ఇరాన్‌పై దాడి చేసింది. ఆ మధ్య పాకిస్తాన్-ఇండియా మధ్య కూడా యుద్ధం జరిగింది. ఏమైనా, ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయీ? ఆయా దేశాల ప్రజల మధ్య విద్వేషాలేవైనా ఉన్నాయా? లేదే? మరెందుకు జరుగుతున్నాయి? అంటే పాలకుల మూర్ఖ నిర్ణయాల వల్ల జరుగుతున్నాయి. ఒక రకంగా ఈ యుద్ధాలు ప్రజల మధ్య కాదు, పాలకుల మధ్య- ప్రజల డబ్బును వృధా చేస్తున్న అంతర్జాతీయ గూండాల ఆలోచనా విధానాల వల్ల జరుగుతున్న యుద్ధాలివి! అందరికందరూ ప్రపంచశాంతి గురించి ఉపన్యసిస్తారు. ఒకాయన నోబెల్ శాంతి బహుమతి గురించి గుక్కపట్టి ఏడుస్తుంటాడు కూడా! చివరకు దురాక్రమణల యుద్ధవీరుడిగా నిలిచిపోయాడు.
ప్రపంచమంతా ఒక్కటి. మనుషులంతా ఒక్కటి. అని సైన్సు చెపుతూ ఉన్నా, బలవంతంగా సైన్సును ఇరుకు భావాల్లోకి ఇరికించి, తమ ఆధిపత్య అవసరాలకు లేదా వ్యాపార అవసరాలకు నేటి మన దేశ అనాగరికా పాలకులు వాడుకుంటున్నారు. సూడో సైన్స్ ప్రచారం చేస్తున్నారు. పాఠ్య గ్రంథాలలో సిలబస్‌లు మార్చి పిల్లల మెదళ్లలో విషం నింపుతున్నారు. ప్రపంచ జ్ఞానం తెలుసుకోకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. ఈవిషయం మీదే ఆల్బర్ట్ ఐన్ స్టీయిన్ ఓ మాట చెప్పారు. ”మన పాఠ్యగ్రంథాలు యుద్ధాల్ని కీర్తిస్తాయి. వాటి వెనక ఉన్న దుర్మార్గాల్ని దాచిపెడతాయి. అలాంటి పాఠ్యాంశాలు పిల్లల మనసుల్ని విద్వేషమయం చేస్తాయి. నేనైతే యుద్ధాన్ని కాదు, శాంతిని బోధిస్తాను- ద్వేషాన్ని కాదు, ప్రేమను నింపుతాను.” అని! చదువుకున్నవారి ఆలోచన, మహాజ్ఞాని అయిన వారి ఆలోచన అలా ఉంటుంది.
చదువూ, నైతికతా మచ్చుకైనా లేని దేశాధినేతలకు ఇలాంటి విషయాలు ఎలా అర్థమవుతాయి? ఒకసారి ఒక పెద్దాయన జోక్ చేశాడు. ”క్షమించాలి! మాకు ప్రధాని అంటూ ఎవరూ లేరండి. టెలిప్రాప్టరే మా ప్రధాని. అయితే, అది చదవడానికి ఒక రీడర్ ఉన్నాడు లెండి!” అని. బయట జరుగుతున్న యుద్ధాలు అలా ఉంచి, అంతర్గతంగా దేశంలో జరుగుతున్న అల్లకల్లోలం గూర్చి, సరైన విదేశాంగ విధానం లేక బయట కూడా పోగొట్టుకున్న పరువు గూర్చి ఈ దేశ పౌరులు ఆలోచించుకోవాలి! గత పన్నెండేళ్లుగా మన దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి వెన్నెముక ఆరెస్సెస్ కదా? ఆ ఆరెస్సెస్ ఘన చరిత్ర ఏమిటో అందరూ తెలుసుకోవాలి. వారి దేశభక్తి ఏపాటిదో, వారిలో స్వాతంత్య్ర పటిమ ఎంత ఉండేదో తెలుసుకుంటే గానీ, వారు ఈ రోజు తీసుకుంటున్న నిర్ణయాల గూర్చి అర్థం కాదు.
1925 సెప్టెంబర్‌లో ఆరెస్సెస్ స్థాపన జరిగింది.
1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహంలో ఆరెస్సెన్ పాల్గొనదని హెడ్గేవార్ తేల్చి చెప్పాడు.
1940 డిసెంబర్‌లో బ్రిటీషు వారి ఇంపీరియల్ సివిల్ గార్డుల్లో చేరి బ్రిటీష్‌కు మద్దతు తెలిపిన దేశభక్త సంస్థ ఆరెస్సెస్. పైగా, సుభాష్ చంద్రబోస్ రూపొందించిన ఆజాద్ హింద్ ఫౌజ్(ఇండియన్ నేషనల్ ఆర్మీ) పై కాల్పులు జరపడానికి వెనుకాడ లేదు.
1942 ఆగష్టులో జరిగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొనబోమని తెగేసి చెప్పిన దేశభక్త సంస్థ ఆరెస్సెస్.
1947 ఆగష్టు స్వాతంత్య్రం లభించిన తర్వాత కూడా మన త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా గౌరవించం- అని తేల్చి చెప్పిన దేశభక్తి సంస్థ ఆరెస్సెస్. అంతేకాదు, స్వాతంత్య్రానంతరం యాభై ఏళ్లు వారి ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేయని దేశభక్త సంస్థ ఆరెస్సెస్. ఒకతను జాతీయ జెండా తీసుకుపోయి వారి కార్యాలయ ప్రాంగణంలో ఎగురేస్తే – అతనిపై ఎఫ్.ఐ.ఆర్ రాయించిన దేశభక్త సంస్థ ఆరెస్సెస్.
1948 జనవరి గాంధీని చంపిన ఆరెస్సెస్ కార్యకర్త గాడ్సే-వారి దృష్టిలో గొప్ప దేశభక్తుడు!
1948 ఫిబ్రవరి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థగా గుర్తించి ఆరెస్సెస్‌ను నిషేధించిన నాటి నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్దార్ పటేల్ అప్పుడు హోమ్ మంత్రి. చాలాకాలం గడిచాక, వారికి చెప్పుకోవడానికి నాయకుడు లేక, తమ గుజరాత్ రాష్ట్రం వాడైనందుకు పటేల్ విగ్రహం మానస సరోవర్ పక్కన తయారు చేయించి పెట్టారు. నెహ్రూ స్థాయి తగ్గించాలని కష్టపడ్డారేగానీ, ఆ మానస సరోవర్ నెహ్రూ నెలకొల్పిందన్న విషయం కప్పిపెట్టారు. ‘మేకిన్ ఇండియా’ గూర్చి గొప్పలు చెప్పుకునే బీజేపీ- ఆరెస్సెస్ ప్రభుత్వం రూ.3500 కోట్లు చైనా సాంకేతిక నిపుణులకు సమర్పించి సర్దార్ పటేల్ విగ్రహం అక్కడ నెలకొల్పారు. ”స్టాచ్యు ఆఫ్ యూనిట్”గా దానికి నామకరణమైతే చేశారు గానీ, దేశవ్యాప్తంగా వారు చేస్తున్నవి విద్వేష ప్రసంగాలే కదా? ఇంకా యూనిటీ ఎక్కడా? ఇవన్నీ ఒక ఎత్తయితే, మరొక విషయంలో వీరి దేశభక్తి తేటతెల్లమయ్యింది. 1949 నవంబర్ మనుస్మృతిని తప్పితే అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఒప్పుకునేది లేదని ఈ దేశభక్తి సంస్థే ప్రకటించింది.
1951లో మహిళలకు సమానహక్కులు ప్రసాదించే ‘హిందూ కోడ్ బిల్‌ను తీవ్రంగా నిరసించి దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించిన దేశభక్త సంస్థ ఆరెస్సెస్. ఇక ఇప్పుడు ఈ బీజేపీ – ఆరెస్సెస్‌ల దేశభక్తి ప్రసంగాలు వినడం ఈ దేశ ప్రజలకు అవసరమా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకుని కార్యోన్ముఖులు కావాలి!
నేడు దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ దేశ సేవకు ఎంతగా కట్టుబడి ఉందో తెలుసుకోవాలంటే ఈ వివరాలపై దృష్టి పెట్టాలి. యాభై నాలుగేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ బాలెన్స్ రూ.133 కోట్లు. పదహారేళ్లు మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ బ్యాంక్ బాలెన్స్ 10,107 కోట్లు. అంటే – కాంగ్రెస్ పార్టీ కన్నా 75 రెట్లు ఎక్కువ! ఇది కాకుండా ఇక్కడ మరొక విషయం గమనించాలి. రిజిస్టర్ కాని ఆరెస్సెస్ అనే సంస్థ కొత్తగా తన ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకుంది. అందుకు అయిన ఖర్చు 150 కోట్లు. సుమారు మూడున్నర ఎకరాల స్థలంలో పన్నెండు అంతస్తుల టవర్లు మూడున్నాయి. అందులో సుమారు మూడు వందల గదులున్నాయి. రెండు వందల కార్లు పార్కు చేసుకునే వసతి ఉంది. ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లు, ఎటియంలు వగైరాలతో అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో నిర్మాణం జరిగింది.
అంతా బాగానే ఉంది కానీ, ఈ డబ్బు ఎవరిది? అని ప్రతిపక్ష నాయకులతో పాటు సామాన్య పారులు కూడా ప్రశ్నిస్తున్నారు. పన్నులు కట్టే సామాన్యులు మాత్రం దేశంలో బతకలేక పోతున్నారు. రిజిస్టరే కాలేదు కాబట్టి అడిగే వాడే ఉండదు. దేశమంతా ఒకటే టాక్స్-దేశమంతా ఒకటే మతం, ఒకటే భాష కావాలనే వారు – భారతీయులంతా ఒకటే అని-మాత్రం అనలేక పోతున్నారు. అందరికీ సమానమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉంటాయని మాత్రం చెప్పలేకపోతున్నారు. విద్య పట్ల, విదార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయో చూడండి. సిలబస్‌లు మారి విద్యను కాషాయీకరణ చేయడం, కార్పొరేటీకరణ చేసి చేతులు దులుపుకోవడం చేస్తోంది. ఆందోళన పడాల్సిన విషయం మరొకటి ఏమిటంటే – గత ఏదేళ్లలో బడి మానేసిన పిల్లలు(స్కూల్ డ్రాపౌట్స్) సుమారు 65.7 లక్షలని లెక్కతేలింది. ఇందులో దేశంలోని ముఖ్య నాయకుల రాష్ట్రమైన గుజరాత్‌లోనే 2.4 లక్షలు. అంటే అది 341 శాతం. భావి భారత పౌరుల్ని, ఈ దేశాన్నీ ఈ నాయకులు ఏం చేయదలుచుకున్నారో ఆలోచిస్తే భయమేస్తోంది.
పైగా మూఢనమ్మకాల్ని పెంచడం. దొంగ బాబాల్ని వెనకేసుకొస్తూ, రక్షిస్తూ ఉండడం. వీటికి తోడు ఆలయ నిర్మాణాలు, దేవాలయ పునరుద్దరణలు, ఇతర మతాల ప్రార్థనా స్థలాలు కూలగొట్టడం వగైరా ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. పనిలో పనిగా నూటా డెబ్బయి ఏళ్ల క్రితం జ్వోతిబాఫూలే దంపతులు పూణేలో స్థాపించిన తొలి పాఠశాల భవనాన్ని చారిత్రిక కట్టడంగా సంరక్షించాల్సింది పోయి- దుర్మార్గంగా కూల్చేశారు! మహారాష్ట్ర లోనూ, కేంద్రంలోనూ ఉన్నది ఒకే బీజేపీ పార్టీ. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఆపనిచేశాయి. అంటే విద్యకు, వారసత్వ సంపదకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో తేటతెల్లమయ్యింది కదా? ఇకపోతే రేప్ కేసుల్లో, డ్రగ్స్ కేసుల్లో తమ బీజేపీ నాయకులే దొరుకుతున్నారు గనక, వారికి అరెస్టులు, శిక్షలూ ఏవీ ఉండవు. మధ్యప్రదేశ్ బీజేపీ నేత, అనిల్ బాగ్రి, మంత్రి ప్రతిమ బాగ్రి తమ్ముడు 10 లక్షల గంజాయి స్మగ్లింగ్‌లో దొరికాడు. అయినా, శిక్షలేదు. త నౌ జమ్ బృందా అనే మణిపూర్ మహిళా పోలీసు ఆఫీసర్ తనకు లభించిన ‘బ్రేవరీ అవార్డు’ కేంద్ర ప్రభుత్వానికి తిప్పికొట్టింది.
కారణం, డ్రగ్స్ కేసులో బీజేపీ నేతతో పాటు మరో ఆరుగురు దోషులకు సరైన విచారణ జరపకుండా కోర్టు ‘క్లీన్ చిట్’ ఇచ్చిందని-తన నిరసన తెలియజేస్తూ ఆమె ఆపని చేసింది. మన పాలకుల పరిపాలనా నిర్వహణకు అద్దం పట్టే సంఘటన వారి స్వంత రాష్ట్రం గుజరాత్‌లోనే జరిగింది. సూరత్ ప్రాంతంలో ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. తాగునీటి సరఫరా కోసం ప్రతిష్టాత్మకంగా 21 కోట్లతో నిర్మించారు. అయితే టెస్టింగ్ కోసం మొదటిసారి ఆ ట్యాంక్‌లోకి నీళ్లు ఎక్కించారు. అంతే గుజరాత్ ఇంజనీర్ల అద్భుత పనితనం బయటపడింది. పగిలిన కుండలాగా ట్యాంక్ అసాంతం కుప్పగూలింది! దాంతో పరిపాలకుల నిజాయితీ కూడా దేశవ్యాప్తమైంది. ”దేశమంతా బాంబులు రవాణా చేయడం, బాంబులు పేల్చడంలో ఆరెస్సెస్ ఈ దేశంలోని హిందువులకు శిక్షణనిస్తోంది. నేరం ముస్లింలపైకి నెడుతూ కాలక్షేపం చేస్తోంది” అని ఒక ఆరెస్సెస్ మాజీ కార్యకర్త యశ్వంత్ శిండే కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్‌లో విషయం వెల్లడించాడు.
గత ఐదేళ్లలో తొమ్మిది లక్షల మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకుని, ఇతర దేశాలలో స్థిరపడడానికి వెళ్లిపోయారు. కారణాలు అనేకం. ఆర్థిక మాంద్యం, పన్నుల వాత, భద్రత లేకపోవడం, శాంతి భద్రతలు కుప్పగూలడం, సామాన్యులకు ప్రోత్సాహకాలు లేకపోవడం, కార్పోరేట్లకు లక్షల కోట్ల రుణమాఫీలు అవుతూ ఉండడం, అన్నింటికీ పేర్లు మార్చడం మినహా వాస్తవంగా ఏ అభివృద్ధీ లేకపోవడం వగైరా – చివరగా మనం అర్ధం చేసుకోవాల్సిన విషయమేమంటే- మనిషిని మనిషిగా చేయడానికి బుద్ధుడు రాజ్యం వదిలేశాడు. అశోకుడు ఆయుధాల్ని, యుద్ధాన్నీ వదిలేశాడు. ఫూలే ఇల్లు వదిలేశాడు. అంబేద్కర్ మతాన్ని వదిలేశాడు. మరిప్పుడు అధికారంలో ఉన్నవారేం చేశారూ? అంటే- ”నైతికత వదిలేశారు. చివరకు సిగ్గూ ఎగ్గూ వదిలేశారు” అని జనం అనుకుంటున్న మాట!!
-వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని జాతీయ పురస్కార తొలిగ్రహీత, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు



