Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేవంత్‌రెడ్డి పాలనలో అన్నీ బంద్‌

రేవంత్‌రెడ్డి పాలనలో అన్నీ బంద్‌

- Advertisement -

– ప్రశ్నిస్తే బూతుపురాణం: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-పటాన్‌చెరు, జిన్నారం

సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో పథకాలు అన్నీ బంద్‌ అని, ప్రశ్నిస్తే బూతు పురాణమే సమాధానం వస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో, జిన్నారం మండలంలో శుక్రవారం హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని ఇప్పుడు అందరూ బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ బంద్‌ పెట్టారు.. కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ఆశపెట్టి కేసీఆర్‌ ఇచ్చే లక్ష రూపాయల చెక్కును కూడా నెలల తరబడి ఆపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ వచ్చాక ఇస్నాపూర్‌లో 24 గంటల కరెంట్‌ ఇవ్వడంతో ఇక్కడ పరిశ్రమల్లో ఓటీలు దొరికి నాలుగు రూపాయలు సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ కరెంట్‌ కోతలు మొదలయ్యాయి. అసెంబ్లీలో పెన్షన్‌ ఎప్పుడు ఇస్తావ్‌ అని అడిగితే, నీ లాగుల తొండలు తీస్తా అంటాడు.. మహిళలకు ఇవ్వాల్సిన రూ.2500 అడిగితే.. పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటాడు.. తులం బంగారం ఏదీ అంటే.. గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటాడు.. ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష అని ప్రశ్నించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మీకు అందుబాటులో ఉండే వాళ్లకు, మీ భవిష్యత్‌ను బాగా చూసుకునే వాళ్లకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. మనల్ని మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం జిన్నారం మున్సిపల్‌ కేంద్రంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మెన్‌ వెన్నవరం భూపాల్‌ రెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఆదర్శ్‌రెడ్డి, గూడెం మధుసూదన్‌ రెడ్డి, గడీల శ్రీకాంత్‌ గౌడ్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, వెంకట్‌ రెడ్డి, గూడెం విక్రమ్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -