అదో పెద్ద అడవి. అక్కడ మగరాజు లేడు. అయినా జంతువులన్నీ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా కలిసిమెలిసి జీవించేవి. క్రూరమగాలు సైతం స్నేహంగా మెలిగేవి. ఒకరోజు ఎక్కడ నుంచో సింహం వచ్చింది. తనను తాను మగరాజుగా ప్రకటించుకుంది. అడవి మీద ఆధిపత్యం సాధించింది. కనపడిన జంతువునల్లా వెంటాడి .. వేటాడి ఆహారం చేసుకునేది. దీంతో జంతువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మిగిలినవి సింహం బారిన పడకుండా తప్పించుకు తిరిగేవి. ఒకరోజు జంతువులన్నీ సమావేశం అయ్యాయి. సింహం మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాయి. ఆ బాధ్యతను తెలివైన కుందేలుకు అప్పగించాయి. అది మొదట తటపటాయించినా చివరకు అంగీకరించింది.
మనసులో పథకం వేసుకుంది. సింహం దగ్గరకు బయలుదేరింది. మగరాజు కనపడగానే వినయంగా నిలబడింది.
ఎందుకొచ్చావని ప్రశ్నించింది సింహం. అడవిలో మరో సింహం కనపడింది అన్నది కుందేలు.
తనను చంపాలనుకున్నా తప్పించుకున్నట్లు చెప్పింది కుందేలు.
నీ మాటలు నేను నమ్మను అన్నది సింహం.
నాతో వస్తే చూపిస్తాను అన్నది కుందేలు.
ఎక్కడ చూశావు ? గద్దించింది మగరాజు.
అడవి మధ్య బావి దగ్గర చూశాను అన్నది కుందేలు.
నీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. మా జాతి సింహాన్ని మీ జాతి కుందేలు బావిలో దూకి చచ్చేలా చేసిన కథ గుర్తుకు వస్తుంది అన్నది సింహం.
కుందేలుకు మనసులో ఒక ఆలోచన వచ్చింది.
మగరాజా ! మీరు నాతో వస్తే సింహం జాడ చూపిస్తాను. లేకపోతే నన్ను చంపి తినేయండి అన్నది.
మగరాజు ఒక్క క్షణం ఆలోచించింది. సరే ! వస్తా .. అక్కడ సింహం లేకపోతే నీ అంతు చూస్తా అన్నది.
సింహం రావటానికి అంగీకరించటంతో కుందేలు మనసులో తనను తాను అభినందించుకుంది. కుందేలు తప్పించుకోకుండా సింహం తన పైన ఎక్కించుకుని, వేగంగా పరుగుతీసి, కొత్త సింహం ఉన్న ప్రదేశానికి చేరుకుంది.
కొత్త సింహాన్ని చూపించమంది సింహం.
కుందేలు సింహం పై నుంచి దిగబోయింది.
దిగవద్దని గర్జించింది సింహం.
మగరాజా! ఆ బావి లోపలి నుంచి సింహగర్జన వచ్చిందని అన్నది. ఇప్పుడు గర్జించింది నేనే అన్నది మగరాజు.
కాదు మగరాజా! మీ గర్జన విని అది కూడా గర్జించింది. నేను స్వయంగా విన్నాను.. నమ్మకం కలిగేలా అన్నది కుందేలు.
మగరాజు బావి దగ్గరకు వెళ్లి, లోపలికి తొంగిచూసింది. సింహం కనపడింది. మగరాజు పకపకా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు మగరాజా ! అన్నది కుందేలు.
బావి నీళ్ళలో కనపడేది నా నీడే అన్నది సింహం.
మగరాజా! కనపడేది మీ నీడైతే మీ మీద కూర్చొన్న నేను కనపడాలిగా! అన్నది. మగరాజుకు కూడా అనుమానం వచ్చింది. మళ్లీ చూసింది. మగరాజు నీటిలోకి చూసినప్పుడల్లా కుందేలు తన నీడ బావిలో పడకుండా జూలు మాటున నక్కేది. కుందేలు లేకపోవటంతో మగరాజు ఆలోచనలో పడింది. బావిలో ఉన్నది నిజమైన సింహమని భావించి, తనకు పోటీ లేకుండా చేసుకోవాలనుకుంది. దానిని అంతం చేయాలని నిర్ణయించుకుని, బావిలోకి దూకడానికి సిద్ధమైంది సింహం. మగరాజు ఆలోచన గమనించిన కుందేలు ఒక్క ఉదుటన నేల మీదకు దూకింది. మగరాజు బావిలో దూకి ప్రాణాలు పోగొట్టుకుంది. సింహం చావుతో అడవి జంతువులు ఊపిరి పీల్చుకున్నాయి. ఆనందంతో కుందేలును అభినందించాయి.
- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100



