Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ చట్టంపై అవగాహన

ఉపాధి హామీ చట్టంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని మేనూరు, మద్నూర్, సీమ రహదారిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజిఎన్ఆర్ఇజిఎ కు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గార్లతో పాటు ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోటలక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్’ గా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. వీబీ జీ రామ్ జీను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలు, విలువల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు.

మొదటి నుంచే ఈ పథకం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దశలవారీగా బలహీనపరిచే కుట్రలకు తెరలేపుతోందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, ప్రజలకు ఉపాధి హక్కును, గ్రామ పంచాయతీలకు పాలనా హక్కులను తిరిగి కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తూ, గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎం జి ఎన్  ఆర్ ఈ జి ఏ స్థానంలో తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టం గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. గతంలో ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల పని హక్కు ఉండేదని, ప్రస్తుతం వీబీ జీ రామ్ జీ చట్టం వల్ల కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి బడ్జెట్ కేటాయించినప్పుడే పని లభించే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే తెలిపారు.

ఇది ప్రమాదకరమైన విధాన మార్పు అని స్పష్టం చేశారు. ఇది గ్రామీణ పేదల సంక్షేమాన్ని దెబ్బతీసే తిరోగమన చర్య అని అభివర్ణించారు. ముఖ్యంగా పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం పేరు మార్పు కాదని గాంధీజీ స్ఫూర్తితో వచ్చిన ఈ పథకం తాత్విక పునాదులపై చేసిన దాడి అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, మండల నాయకులు దరాస్ సాయిలు, అధికారులు, ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -