నవతెలంగాణ – మాక్లూర్
ఆలూరు మండలంలోని గుత్పా గ్రామంలోని కమ్యూనిటీ భవనంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి పంటలో నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం బుదవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి కమ్యూనిటీ ఫెసిలిటేటర్ (సీఎఫ్) మధు మాట్లాడుతూ రైతులకు డిఎస్ఆర్ పద్ధతి, తడి–పొడి విధానం, డ్రమ్ సీడర్ పద్ధతి గురించి వివరించారు. ఈ పద్ధతుల ద్వారా వరి సాగులో కూలీల కొరతను అధిగమించి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందవచ్చని అన్నారు. అలాగే వరి సాగులో నీటిని ఆదా చేసుకునే పద్ధతులను రైతులు అలవాటు చేసుకోవాలని సూచించారు. వరిలో కలుపు తొలగించిన తర్వాత “పొట్ట దశ” వచ్చే వరకు ఎక్కువ నీరు అవసరం ఉండదని, కేవలం 45 తడులతో తడి–పొడి విధానం పాటించి సాగు చేయవచ్చని చెప్పారు.
నీరు వృథా కాకుండా పంట చివరి దశ వరకు పొలాలకు సరిపడా సాగునీరు అందించుకోవచ్చని, ఈ విధానంలో 30 సెంటీమీటర్ల ఏడబ్యూడీ పైపును భూమిలో 15 సెంటీమీటర్ల లోతు వరకు అమర్చి ప్రతి రెండు సెంటీమీటర్ల దూరంలో రంధ్రాలు చేసి జల్లెడ మాదిరిగా ఉపయోగించుకోవాలని సూచించారు. భూ ఉపరితలం నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు నీరు తగ్గినప్పుడు మళ్లీ ఐదు సెంటీమీటర్ల నీటిని మాత్రమే అందించాలని రైతులకు తెలియజేశారు. ఈ పద్ధతి పాటిస్తే నీటి వృథాను అరికట్టడమే కాకుండా, వరి పంట నుండి వెలువడే మీథేన్ వాయువు ఉద్గారాలను తగ్గించి గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించవచ్చని తెలిపారు.
అదనంగా రైతులు సుమారు 15 శాతం అధిక దిగుబడిని పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి రైతు తమ భూమిలో మట్టి పరీక్షలు చేయించుకోవడం ద్వారా భూమిలో ఏ పోషకాలు లోపిస్తున్నాయి, ఎరువులు ఎంత మోతాదులో వేయాలి అనే దాని పై రైతులు అవగాహన పొందవచ్చని వివరించారు. మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే పంట ఉత్పాదకత పెరుగుతుందని, రైతులు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా ఏడబ్యూడీ పైపులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు సిబి సురేష్, రాజన్న, మహేష్, భూమేష్, రాఘవేంద్ర, భూమన్న, మురళి, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.