మూడు బ్యారేజీలను వినియోగంలోకి తేవాలి
పనుల పర్యవేక్షణకు మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచనల మేరకు పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మరమ్మతులకు సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్లతో టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సభ్యులు ఉండేలా చూడాలన్నారు.
మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజీని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వాల్సి ఉందనీ, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకుని వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలన్నారు. డిసెంబరు వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగడానికి వీలు లేదన్న ముఖ్యమంత్రి నిధుల విషయంలో ఇబ్బంది కల్గనివ్వమని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభం అయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సీఎం కార్యదర్శి మానిక్ రాజ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



