Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబృందావన్‌ ప్రాజెక్టు మరమ్మతు చేపట్టండి

బృందావన్‌ ప్రాజెక్టు మరమ్మతు చేపట్టండి

- Advertisement -

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి
సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తమ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బృందావన్‌ ప్రాజెక్టు గేట్లు, కాలువలు, బ్రిడ్జీలు మరమత్తు చేపట్టాలని సీపీఐ(ఎం) మాజీ కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్‌, విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్రమణ్య శర్మ, సురోజు బాస్కరాచారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి వుప్పునూతుల పురుషోత్తమరెడ్డి నీటి పారుదల శాఖమంత్రిగా ఉన్నప్పుడు బృందావన్‌ ఆనకట్టను నిర్మించారని తెలిపారు. దాని ద్వారా మోత్కూర్‌, కొండగడప, సదర్‌ షాపూర్‌, పాటిమట్ల, కంచన పల్లి, అడ్డగూడూర్‌, దాచారం గ్రామాలలోని చెరువుల ద్వారా రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో మోత్కూర్‌ లో ఆత్మకూర్‌ నుండి వచ్చే వాగుపై అడ్డంగా బృందావన్‌ ఆనకట్ట నిర్మించారని పేర్కొన్నారు.

దానిపై ఉన్న నాలుగు గేట్లు బిగించి కాలువలు తవ్వించారని తెలిపారు. అయిదు దశాబ్దాల కింద ఆనకట్టపై నిర్మించిన నాలుగు గేట్లు తుప్పు పట్టి పనిచేయకుండా ఉన్నాయనీ, కాలువలో కంప చెట్లు చెత్త చేదారంతో నిండి వరద కోతకు గురయ్యాయని పేర్కొన్నారు. కాలువలు పూడుకు పోయాయనీ, అక్కడక్కడ బ్రిడ్జిలు కూలిపోయి నీటి ప్రవాహంనకు అడ్డంకిగా ఉందని తెలిపారు. ప్రాజెక్ట్‌ ఎత్తు పెంచి, కాలువల మరమత్తులు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మరమ్మతులు చేయించేందుకు అధికారులను ఆదేశాలిచ్చారు. ఈ విషయమై గత వారమే సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతి కుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, గుండు వెంకట నర్సు, జిల్లా రైతు సంఘం నాయకులు పైళ్ల యాదిరెడ్డితో కూడిన ప్రతినిధి బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -