మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావ ఫలితం
వాషింగ్టన్ : మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితుల కారణంగా అమెరికాలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మధ్యప్రాచ్య యుద్ధం, పెరిగిన చమురు ధరలు, విధాన అనిశ్చితి కారణంగా ఉద్యోగ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అమెరికా ఉద్యోగ మార్కెట్‌లో కొంత పునరుద్ధరణ కనిపించవచ్చని అంచనా. ఫిబ్రవరిలో ఉద్యోగాల్లో భారీ తగ్గుదల నమోదైంది. 92వేల ఉద్యోగాలు తగ్గాయి. అయితే మార్చిలో సుమారు 60 వేల కొత్త ఉద్యోగాలు సృష్టించబడవచ్చని రాయిటర్స్ సర్వేలో ఆర్థికవేత్తలు తెలిపారు. ఫిబ్రవరిలో కైసర్ పెర్మనెంటేకు చెందిన వేలాది నర్సులు సమ్మె చేసిన కారణంగా ఆరోగ్యరంగంలో ఉద్యోగాలు తగ్గాయి. అయితే వారు తిరిగి పనిలో చేరడంతో మార్చిలో ఆరోగ్యరంగంలో ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్పారు.
అలాగే కఠినమైన శీతాకాలం తగ్గడంతో నిర్మాణ రంగం, వినోదం, ఆతిథ్య రంగాల్లో కూడా ఉద్యోగాలు పెరిగే అవకాశముందని అంటున్నారు. అయితే ఈ సానుకూల సంకేతాల మధ్య అనేక ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అమెరికాపై మధ్యప్రాచ్య యుద్ధం ప్రభావం చూపుతోంది. అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇరాన్‌పై దాడులు చేయడంతో చమురు ధరలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. దీంతో పెట్రోల్ ధరలు ఎగబాకాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. వ్యాపారంలో అనిశ్చితి పెరిగింది. యుద్ధం కారణంగా వ్యాపార సంస్థలు నియామకాలను తగ్గించవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో తీవ్ర నష్టాలు ఏర్పడ్డాయి. ఈ యుద్ధం కారణంగా మార్కెట్ విలువలో సుమారు 3.2 ట్రిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ప్రభావం చూపుతున్నాయి.
భారీ దిగుమతి సుంకాలు విధించడం, సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసిన తర్వాత కూడా కొత్త సుంకాలు అమలు చేయడం, పెద్ద ఎత్తున విదేశీయుల డిపోర్టేషన్ వంటి చర్యల వల్ల కార్మికుల సరఫరా తగ్గింది. డిమాండ్‌పై కూడా ప్రభావం పడుతోంది. నిరుద్యోగ రేటు 4.4 శాతం వద్ద స్థిరంగా ఉండొచ్చని అంచనా ఉన్నప్పటికీ.. కొంత మంది ఆర్థికవేత్తలు అది 4.5 శాతానికి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగ మార్కెట్ ప్రస్తుతం ‘తక్కువ నియామకాలు-తక్కువ తొలగింపులు’ స్థితిలో ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇది తాత్కాలికంగా నిలబడగలిగినా, దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి ప్రమాదం కలిగించవచ్చని అంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రస్తుతం 3.50 శాతం నుంచి 3.75 శాతం మధ్య ఉంచింది. ఈ పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు కూడా పడిపోయాయి. మార్చిలో ఉద్యోగాల పెరుగుదల కనిపించినప్పటికీ.. మధ్యప్రాచ్య యుద్ధం, పెరుగుతున్న చమురు ధరలు, ప్రభుత్వ విధానాల వల్ల అమెరికా ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. ఏప్రిల్, మే నెలలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.



