నీట్ 2025 కటాఫ్ మార్కులు తగ్గింపు
న్యూఢిల్లీ : రెండు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భర్తీ కాలేదు. దీంతో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (పోస్టు గ్రాడ్యుయేట్) (నీట్-పీజీ)2025 అడ్మిషన్‌కు సంబంధించిన కటాఫ్ మార్కులను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) తగ్గించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మూడో రౌండ్‌లో రిజర్వ్డ్ కేటగిరిలకు కటాఫ్ మార్కులను 45వ శాతం నుంచి సున్నాకు ఎన్‌బీఈఎంఎస్ తగ్గించినట్టు తెలిపింది. అంటే ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలకు చెందిన అభ్యర్థులు, నెగెటివ్ మార్కులు వచ్చిన వారితో సహా పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా కౌన్సిలింగ్‌లో పాల్గొనడానికి అర్హులు అని తెలిపింది. వికలాంగుల అభ్యర్థులకు కటాఫ్‌లను 45వ శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అలాగే, సాధారణ, ఆర్థికంగా బలహీన పడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్)కు చెందిన అభ్యర్థులకు కటాఫ్‌ను 50 శాతం నుంచి 7 శాతానికి తగ్గించారు. కటాఫ్‌లను తగ్గించడంపై వస్తున్న విమర్శలను కేంద్రం తిరస్కరించింది. దేశంలో శిక్షణ పొందిన వైద్య నిపుణుల సమూహాన్ని విస్తరించడానికి, అందుబాటులో ఉన్న సీట్లను సరైన రీతిలో ఉపయోగించుకోవడమే ఈ కటాఫ్ ఉద్దేశమని, సీట్లను ఖాళీగా ఉంచడం వల్ల ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చడానికి చేసే జాతీయ ప్రయత్నాలు దెబ్బతింటాయని, విలువైన విద్యా వనరులను కోల్పోతామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే నీట్-పీజీ అభ్యర్థులంతా ఎబిబిఎస్ పూర్తి చేసిన వైద్యులని గుర్తి చేసింది. వీరు డిగ్రీలను, ఇంటర్న్‌షిప్‌లను పూర్తి చేశారని తెలిపింది.
కాగా, 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం కోసం గతేడాది ఆగష్టులో నీట్-పీజీ 2025 పరీక్షను నిర్వహించారు. సుమారు 2.42 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయిన తరువాత కూడా దేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో 9 వేలకు పైగా మెడికల్ పీజీ సీట్లు భర్తీ కాలేదని సమాచారం. దీంతో మూడో రౌండ్ కౌన్సిలింగ్ కోసం కటాఫ్‌లను తగ్గించారు.
భర్తీకానీ పీజీ మెడికల్ సీట్లు
- Advertisement -
- Advertisement -



