Wednesday, November 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిస్వేచ్ఛ లేని భావప్రకటన!

స్వేచ్ఛ లేని భావప్రకటన!

- Advertisement -

”నువ్వు చెప్పే విషయం పట్ల నాకు ఏకీభావం లేకపోవచ్చు. కానీ దాన్ని వ్యక్తీకరించే నీ స్వేచ్ఛ కోసం నేను ప్రాణాలను పణంగా పెట్టి అయినా సరే పోరాడుతాను” అన్నాడు వోల్టేర్‌. ఈ విషయం వ్యక్తి భావప్రకటనా స్వేచ్చ గొప్పతనాన్ని చాటుతుంది. అదే సందర్భంలో దాని అవసరాన్ని కూడా విప్పి చెప్పుతుంది. ఏ దేశంలో అయినా భవప్రకటనాస్వేచ్ఛ మనిషిని మనిషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అదే లేకపోతే ఆదిమ సమాజంలో లాగా మనిషి బానిసగా మారుతాడు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కుల అధ్యాయంలో అధికరణం 19(1ఎ)ద్వారా భారత పౌరులకు భావప్రకటనా స్వేచ్ఛను కల్పించారు. నిజానికి ప్రజాస్వామ్యానికి ఇది ఊపిరి. స్వేచ్ఛగా తనకు నచ్చిన భావాలను వ్యక్తీకరించే క్రమంలో మాట్లాడటమైనా, రాయటమైనా దానిలో భాగమే. ఇటీవలి కాలంలో దేశంలో సంభవిస్తున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే ఈ మాట్లాడే స్వేచ్ఛపై పాలకులు అనేక ఆంక్షలు పెడుతున్నారు. కొందరైతే తమకు నచ్చని అభిప్రాయాన్ని ఎవరు వ్యక్తం చేసినా వాళ్ల మీద విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు .ఆ దాడులు కొన్ని సందర్భాల్లో మాటలతో చేస్తే, కొన్ని సందర్భాల్లో చేతల్లోనూ చూపిస్తున్నారు. తమకు ఒకరు చెప్పిన అభిప్రాయం నచ్చనప్పుడు ప్రజాస్వామికంగా దానిమీద చర్చచేసి నిజమేమిటో నిగ్గు తేల్చవచ్చు. చర్చల ద్వారా మాత్రమే సత్యం వెల్లడవుతుందన్న ప్రజాస్వామిక సూత్రాన్ని తుంగలో తొక్కి దాడులకు పాల్పడటం నేరం. ఇది ఇటీవలి ఒక దుష్పరిణామం.

ఒక వ్యక్తి ఏం తింటాడో, ఎలా జీవితాన్ని గడుపుతాడో, ఎవరిని ఆరాదిస్తాడో అన్నది పూర్తిగా వ్యక్తిగతం. ఫలానా తిండి తిన్నాడనో, ఫలానాది తినటం లేదనో దాడులు చేయటం దాన్ని సమర్థించుకోవటం నియంతృత్వానికి సంకేతం. దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవటం కూడా అలంటిదే. దేవుణ్ణి నమ్మేవాళ్లకు ఈ దేశంలో ఎన్ని హక్కులున్నాయో నమ్మని వాళ్లకు కూడా అన్నే హక్కులను రాజ్యాంగం ఇచ్చింది. నమ్మడం, నమ్మకపోవటమన్నది పూర్తిగా వ్యక్తిగతం. ఏ దేవుణ్ణి నమ్మకుండా బతికేవాళ్లు ఈ దేశంతో పాటు బయటిదేశాల్లో చాలామంది ఉన్నారు. అక్కడ వీళ్లమీద ఎలాంటి వ్యతిరేకత ఉండదు.మనదేశంలో దేవుణ్ణి నమ్మకపోవటమే ఒక దేశభక్తి లేని విషయంగా మారిపోతుంది. నిజానికి దేశభక్తికి దైవభక్తికి సంబంధం లేదు. దీన్ని పనిగటుకుని ప్రచారం చేస్తూ కొందరు అనేక ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం.దేవుని పట్ల కించపరిచే వ్యాఖ్యలు చేస్తే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఇటీవల సినీదర్శకుడు రాజమౌళి ‘నాకు దేవునిపై నమ్మకం లేదు’ అన్నాడు. దేవుణ్ణి నమ్మకుండా బతికే హక్కు ఈ దేశపౌరునిగా ఆయనకుంది. దీన్ని సహించలేనివారు సోషల్‌ మీడియా వేదికల మీద ఆయన మీద యుద్ధపర్వానికి తెరలేపారు.నోటితో ఉచ్ఛరించటానికి కూడా వీలు లేని బూతులతో విరుచుకుపడుతున్నారు. ఇది ఏ భావప్రకటనా స్వేచ్ఛకు సంకేతం? ఇదే అదునుగా భావించిన కొందరు మేధావులైతే భావవ్యక్తీకరణ పట్ల ఆంక్షలు ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. ఏ భావవ్యక్తీకరణ స్వేచ్ఛపట్ల వీళ్లు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారో వీళ్ల ప్రత్యర్థులను కించపరిచే క్రమంలో అదే భావప్రకటనాస్వేచ్ఛను ఆశ్రయిస్తున్నామన్న సంగతిని వీళ్లు గుర్తించటం లేదు.నిజానికి ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చూస్తున్నది ఈ మేధావులే!

మతం గురించి మరీ ముఖ్యంగా దేవుడు అనే భావన గురించి ఎవరు స్వతంత్రంగా మాట్లాడినా సహించే రీతిలో కొందరులేరు. ఇలాంటిదే దేశభక్తి కూడా. ఒక గీత గీచి ఇదే దేశభక్తి అని, దీన్ని దాటి ఎవరు ఏం మాట్లాడినా దేశద్రోహులే అనేవిధంగా వాదించేవాళ్లను ఏం అనాలి? ఇదే తిండి అందరూ తినాలని వాదించే వాళ్లను ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే భాషను అందరూ గౌరవించాలని అరిచే వాళ్లను చూసి ఏం నేర్చుకోవాలి? చాలామంది అపోహ పడుతున్నట్లు ఇది అఖండ దేశం కాదు, ఉపఖండ దేశం. ఇక్కడ అనేక సంస్కృతులున్నాయి, అనేక భాషలున్నాయి, మతాలున్నాయి.ఒకరి వైవిధ్యాన్ని ఇంకొకరు అర్థం చేసుకొని గౌరవించడం మన సమిష్టి బాధ్యత. అందుకోసం రాజ్యాం గం మనకు దిశానిర్దేశం చేసింది కూడా. భారతీయు లుగా ప్రజలందరూ సుఖసంతోషాలతో కలిసి మెలిసి ఉండటానికి కులాలైనా, మతాలైనా ఎందుకు అడ్డుపడాలి? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ మహాశయుడు చెప్పినట్లు మనము మొదటనైనా, చివరగానైనా భారతీయులుగానే బతకాలి.
-తోకల రాజేశం,9676761415

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -