ప్రతిపక్షాల విజ్ఞప్తులను విస్మరించిన ప్రభుత్వం : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విమర్శ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహిళా రిజర్వేషన్‌పై మోడీ ప్రభుత్వం ‘ఏకపక్ష’ ధోరణి ప్రదర్శిస్తూ ప్రతిపక్షాల విజ్ఞప్తులను విస్మరించిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విమర్శించింది. శుక్రవారం నాడిక్కడ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం (ఇందిరా భవన్)లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన, ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, భారతదేశంపై వాటి ప్రభావం, భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించి, పార్లమెంటరీ సీట్ల సంఖ్యను పెంచాలన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతిపాదిత చర్య ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని విమర్శించారు. ఈ విషయంలో ప్రతిపక్షం ఐక్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
” ఈ సమావేశం అనంతరం, ప్రతిపక్షంలోని సహచరులందరితోనూ ఈ అంశాలపై చర్చించి ఓ సమిష్టి వ్యూహాన్ని రూపొందిస్తాం. అంతా ఐక్యంగా ముందుకు సాగుతాం” అని ఖర్గే అన్నారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సమయంపై కూడా ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రయోజనాలు, రాజకీయ లబ్ది కోసమే ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ”మోడీ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లును అత్యంత తొందరగా ఆమోదింపజేయాలని ఆసక్తిగా ఉంది” అని ఖర్గే విమర్శించారు. ప్రతిపాదిత సవరణలు దేశ ఎన్నికల వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. కావున వాటిపై ‘లోతైన చర్చ’ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ ముందుకు రాలేదని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
”మాకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది. లోక్‌సభలోని సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచాలని కూడా భావిస్తోంది” అని ఖర్గే అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేస్తూ ”ఈ పునర్విభజన ప్రతిపాదన తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. అందువల్ల, పునర్విభజనపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ముగిసిన తరువాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదని ఖర్గే ఆరోపించారు. ”ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే.
ఈ ఉల్లంఘనలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటుందని మేము ఆశించడం లేదు” అని అన్నారు. ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అనారోగ్య కారణాల దృష్టా సోనియా గాంధీ, సీనియర్ నేత పి. చిదంబరం వర్చువల్‌గా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ, సచిన్ పైలట్, భూపేశ్ బగేల్ తదితరులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీసిఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ్ పాల్గొని ఈ సమావేశంలో తమ రాష్ట్రాల నివేదికలను సమర్పించారు.



