సీపీఐ(ఎం) డిమాండ్
న్యూఢిల్లీ :భారత్-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే ఉప సంహరించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. అంతర్జాతీయంగా పలు దేశాలపై ఇష్టం వచ్చిన రీతిలో సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు లేదంటూ ఆ దేశ సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రక తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ డిమాండ్ వెలువడింది. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. సుంకాలను సాకుగా చూపే భారత్‌తో అమెరికా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుందని, తక్షణమే ఆ ఒప్పందం నుంచి బయటకు రావాలని పేర్కొంది. ట్రంప్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతేడాది కాలంగా అమెరికా అధ్యక్షుడు సాగించిన ఈ బెదిరింపుల పర్వానికి గల చట్టపరమైన పునాదిని ఈ రూలింగ్ నాశనం చేసింది. ఈనేపథ్యంలో..భారత ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెడుతూ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి మోడీ ప్రభుత్వం ఎందుకు తొందర పడిందని సీపీఐ(ఎం) ప్రశ్నించింది. మోడీ ప్రభుత్వం తక్షణమే ఏకపక్షంగా ఉన్న ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేసింది.



