– నార్లపూర్ వద్ద రూ.2.50 కోట్లతో కొత్త సబ్‌స్టేషన్
– రూ.5 కోట్లతో పనులు, 440 విద్యుత్ స్తంభాలు
– 193 ట్రాన్స్‌ఫార్మర్లు.. 350 మందితో విధులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతరలో నిరంతర విద్యుత్తునందించడానికి నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) రూ.5 కోట్లతో పనులను చేపట్టగా .. చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మేడారం జాతరలో రెండుచోట్లా రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్లను అమర్చగా, కొత్తగా నార్లపూర్ వద్ద రూ.2.50 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. మేడారం గద్దెల వద్ద సమ్మక్క సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయగా, కొత్తూరు వద్ద మరో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. నార్లపూర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి పలు గ్రామాలతోపాటు పార్కింగ్ స్థలాలు, పరిసర ప్రాంతాల్లోని దుకాణాలకు విద్యుత్ సౌకర్యం అందించనున్నారు. మేడారం జాతరలో ఏర్పాటు చేసిన ఈ మూడు సబ్‌స్టేషన్‌లను పస్రా 132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు అను సంధానం చేశారు. ఎమర్జెన్సీలో ములుగు 132/33 కేవీ సబ్‌స్టేషన్, కమలాపూర్ ఈహెచ్‌టీఎస్‌ఎస్ నుంచి కూడా విద్యుత్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగ కుండా, విద్యుత్ ట్రిప్ కాకుండా మేడారంలో గద్దెలు, ప్రాకారం, పరిసర ప్రాంతాలే కాకుండా పరిసర గ్రామాల్లో సైతం ఎల్‌టీ లైన్‌లకు పెద్ద ఎత్తున ‘స్పేసర్స్’ను ఏర్పాటు చేశారు.
440 విద్యుత్ స్తంభాలు, 193 ట్రాన్స్‌ఫార్మర్లు
మేడారం జాతర యావత్తు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి 440 విద్యుత్ స్తంభాలను, 193 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వాటి పర్యవేక్షణకు 50 బృందాలను నియమించారు. జాతర పరిసర ప్రాంతాల్లో, పార్కింగ్ స్థలాలు, షాపులకు నిరంతరం విద్యుత్ అందించడానికి వీలవుతుంది. వీటిని నడపటానికి ఇద్దరు ఆపరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఇద్దరు సీజీఎంలు, ఏడుగురు డీఈలు, 20 మంది ఏడీఈలు, 150 మంది ఇంజ నీర్లు, ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది మొత్తంగా 350 మంది విధులు నిర్వహి స్తున్నారు. అలాగే, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసు కోవడానికి నియమించాల్లో బృందాల్లో.. ఒక ఏఈ నేతృత్వంలో ముగ్గురు ఆపరేషన్ సిబ్బంది బృందంగా ఉంటారు. ఒక్కో బృందం 4 ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో విధులను నిర్వహిస్తున్నారు. 33 కేవీ లైన్స్ పర్యవేక్షణకుగాను పస్రా, గోవింద రావుపేట, తాడ్వాయి, ములుగు, ఏటూర్‌నాగారం, కమలాపూర్ సబ్‌స్టేషన్‌ల పరిధిలో పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. పస్రా, ములుగు, కమలాపూర్, చెల్పూర్, వరంగల్ ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌ల వద్ద విద్యుత్ సరఫరాను పర్యవేక్షించ డానికి 20 మంది ఇంజనీర్లు, ఆపరేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఎమర్జెన్సీ పనులకు 30 వాహనాలను ఏర్పాటుచేశారు.
ఎన్పీడీసీఎల్ నుంచి ‘స్కాడా’ పర్యవేక్షణ
వొల్టేజీ, విద్యుత్, ఫీడర్ లోడ్, అంతరాయాలను ఎప్పటికప్పుడు తెలుకోవడానికి రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ ఫీడర్ సిస్టమ్‌తో (ఆర్‌టీఎఫ్‌ఎంఎస్) వరంగల్ ఎన్పీడీసీఎల్ కార్యాలయంలోని ‘స్కాడా’తో ఎప్పటికప్పుడు తెలుసుకుని సరిచేసేలా ఏర్పాట్లు చేశారు.
విద్యుత్ ప్రమాదాల నిరోధానికి ‘స్పేసర్స్’ ఏర్పాటు
మేడారం జాతరలో ఎల్‌టీ లైన్స్‌పై ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా పెద్ద మొత్తంలో ఈసారి ‘స్పేసర్స్’ను ఏర్పాటు చేశారు. గతంలో ఏ జాతరలో ఏర్పాటు చేయనన్నీ ‘స్పేసర్స్’ను ఈసారి అధికారులు ఏర్పాటు చేశారు. దుకాణ యజమానులు కొక్కీలు వేసినా ఫ్యూజ్ కొట్టేయకుండా ఈ చర్యలు ఉపకరించనున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ ట్రిప్ కాకుండా, విద్యుత్ ప్రమాదాలు రాకుండా మేడారం, సమ్మక్క సబ్‌స్టేషన్‌ల పరిధిలో 26 కిలోమీటర్ల 11 కేవీ లైన్స్ పరిధిలో, 15 కిలోమీటర్ల మేరకు 33 కేవీ లైన్స్ పరిధిలో ఓపెన్ కండక్టర్ స్థానంలో కవర్డ్ కండక్టర్‌ను ఏర్పాటు చేశారు.
మేడారం జాతరలో నిరంతర విద్యుత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



