Thursday, February 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికేంద్ర బడ్జెట్‌: సంపన్నులకే 'అచ్ఛేదిన్‌'

కేంద్ర బడ్జెట్‌: సంపన్నులకే ‘అచ్ఛేదిన్‌’

- Advertisement -

అచ్చేదిన్‌ వారి కలర్‌ ఫుల్‌ బడ్జెట్‌-(2026-2027) ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ 53,47,315 కోట్ల రూపాయలతో ఘనంగా ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే కార్పొరేట్లకు, కోటీశ్వరులకు రాయితీలు, వరాల జల్లులు కురిపించారు. కార్మికులు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, మధ్య తరగతి, సాధారణ పేద ప్రజలకు మొండిచేయి చూపించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం లాంటి సామాన్య ప్రజలకు ఉపయోగపడే కీలక రంగాలకు సంబంధించిన పథకాల కేటాయింపుల్లో కోతలు విధించారు. చివరకు మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం కేటాయించే ‘జెండర్‌ బడ్జెట్‌’ నిధుల్లోనూ కోతలు పెట్టారు. ఇక ‘అచ్ఛేదిన్‌’ సంపన్నులకే అంటూ మరోసారి చాటి చెప్పారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం నీరుగార్చారు. దీంతో రానున్న రోజుల్లో నిరుద్యోగం, అధిక ధరలు, జీవన వ్యయం పెరగటం, ఉపాధి లేమితో ప్రజలు బాగా ఇబ్బంది పడతారు.

ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయాల పట్టిక బడ్జెట్‌. సర్కారు ఆర్థిక విధాన పత్రం. దేశ వార్షిక నివేదిక. రూపాయి రాక, పోకల చిట్టాపద్దునే బడ్జెట్‌ అంటారు. ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు, ఇతర రూపంలో వసూలు చేసిన ధనాన్ని వారి కోసం ఎలా వినియోగించబోతున్నదో వివరించే వార్షిక నివేదిక. ప్రతియేడూ బడ్జెట్‌ తంతూ ఎలా ఉంటుందంటే ”మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్టవిప్పి చూడు పురుగులుండును” అన్న చందంగా ఉంటుంది. ఆర్భాటాలు, ఉత్తర కుమార ప్రగల్బాలతో కూడిన బడ్జెట్‌ కేటాయింపులు ఉంటాయి. అయితే కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే బడ్జెట్లో చెప్పే అంకెలు వేరు, తర్వాత కేటాయించి ఖర్చు పెట్టే అంకెలు వేరు. అంతా మాయల ఫకీరు, టక్కు టమారా గారడీ విద్యలు తప్ప ఇందులో వాస్తవం ఉండదు. ఇంకా ఎన్నాళ్లు ఈ మోసం…? 1947లో స్వాతంత్రం వచ్చినప్పటినుండి ప్రతియేటా బడ్జెట్లు వస్తున్నాయి. పోతున్నాయి. ‘సింగడు అద్దంకి రానే వచ్చాడు, పోనే పోయాడు’ అన్న సామెత చందంగా ఉంటుంది బడ్జెట్‌ వ్యవహారం.

ఇన్నేళ్లలో డెబ్బయి తొమ్మిది బడ్జెట్‌లలో కేటాయించిన కేటాయింపులకు ఖర్చులు, సాధించిన ప్రగతి అంచనా లెక్కలు ఏనాడైనా ప్రజల ముందు పెట్టారా? పాలకులు చెప్పే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయా? కనీసం సమీక్షలు ఉన్నాయా? దేశ ఆర్థిక వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, పారదర్శకంగా ఉండాల్సింది పోయి, అంకెల గారడీలు, తప్పుడు చిట్టా పద్దులతో, ముద్దు ముద్దుమాటలతో ప్రజల్ని ఏడాదికి ఒకసారి మోసపుచ్చే తంతే బడ్జెట్‌. 1991లో నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ మొదలైనప్పటి నుంచి బడ్జెట్‌ అర్థం పూర్తిగా మారిపోయింది. కడుపులో చల్ల కదలకుండా, సంపన్నులకు ఎర్రతివాచీ పరచి మరి వారిపై వరాల జల్లులు, అనేక రాయితీలు కల్పిస్తూ బడ్జెట్లు తయారవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బడ్జెట్లు మొత్తం ప్రపంచ బ్యాంకు, దేశ విదేశీ కార్పొరేట్‌ల కనుసన్నల్లోనే రూపుదిద్దుకుంటున్నాయి. లాంచనంగా తెచ్చి పార్లమెంట్‌లో చదవటమే ఆర్థిక మంత్రుల పని. ఇందులో సంపన్నుల ప్రయోజనాలే ఉంటాయి. ‘నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా’? కాబట్టి ఈ బడ్జెట్ల వలన సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.

వాస్తవానికి భారతదేశము పేద దేశం కాదు, అపార సహజ వనరులు, కష్టించి పని చేసే మానవ వనరులు కలిగిన సంపన్న దేశం. కానీ తీరని దారిద్రం అనుభవిస్తున్న పేద ప్రజల దేశం మనది. దాదాపు మూడు శతాబ్దాలు బ్రిటిష్‌ వలస పాలకులు మన దేశ వనరులను దోచుకు వెళ్లారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చినా, దేశ పునర్‌ నిర్మాణం ఏదో కొద్దిగా తప్పితే సరిగా జరగలేదు. దీనికి కారణం సంకుచిత రాజకీయ నిర్మాణమే. ఇప్పటికీ ప్రజల ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, విద్య ఆరోగ్యం ఉపాది దక్కలేదు. 79 సంవత్సరాల స్వాతంత్రానంతరం కూడా ఇప్పటికీ ఇవే ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఆకలి, ఆరోగ్యం, విద్య, వైద్యం, న్యాయం ,చట్టంతో సహా అన్నింటిలో అంతరాలు, అసమానతలు పెరిగిపోతున్నాయి. అంటే సరైన ప్రజా ఆర్థిక విధానాలు అనుసరించడం లేదని తేలిపోయింది. దేశ ప్రజల దుర్భర జీవితాలను, అసమానతలను అనేక అంతర్జాతీయ నివేదికలు చెబుతూనే ఉన్నాయి.

ఆక్స్‌ఫామ్‌ నివేదిక-2025 ప్రకారం దేశంలో అత్యంత ధనవంతులైన కొద్దిమంది వద్దే దేశ సంపదలో 90శాతం పోగుపడి ఉంది. ఇందులో ఐదు శాతంగా ఉన్న అపర కుబేరుల వద్ద 62 శాతం సంపద కేంద్రీకృతమై ఉంది. ఒక శాతంగా ఉన్న ఆదానీ, అంబానీల వద్ద 40.6శాతం సంపద పోగుపడి ఉంది. మిగతా దేశంలోని అశేష ప్రజానీకం వద్ద కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉందని నివేదిక ప్రకటించింది. దీన్నిబట్టి ఆర్థిక అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి, భారత్‌ అభివృద్ధి సాధించిందని, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని, ‘అచ్చేదిన్‌, వికసితభారత్‌, సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, డబులింజన్‌ సర్కార్‌ అంటూ గోది మీడియా పెద్దఎత్తున గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నది.

కానీ వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రపంచ ఆకలి ,సంతోష, మానవ అభివృద్ధి సూచికల్లో మన దేశ స్థానం గత పదేళ్లుగా మరింత దిగజారిందని నివేదికలు చెబుతున్నాయి. సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక-2024 ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు 7.8శాతం గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ నిరుద్యోగిత 8.06శాతంగా ఉంది. పని చేయగలిగిన సత్తా ఉన్న తగిన ఉపాధి దొరకక, పొట్టకూటికోసం దేశ యువత అల్లాడిపోతున్నారు. ఈ పదేళ్లలో 24 కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 7.5 లక్షల మందికి ఉపాధి దొరికింది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యేటా ఇస్తానన్న రెండుకోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో మోడీజీ జవాబు చెప్పాలి. ఇలా ఉపాధి కల్పనలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దేశంలో గత ఇరవై ఏళ్లుగా ఉపాధి రహిత అభివృద్ధి జరిగి ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిల్చింది. ఈ బడ్జెట్‌ల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. గనుక, తమ మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకోవడమే ప్రజల కర్తవ్యం కావాలి.

షేక్‌ కరిముల్లా
9705450705

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -