ఐసీఈయూ సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణల మూలంగా దెబ్బతింటున్న ఎల్‌ఐసీని బలోపేతం చేయడం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్‌ఎస్ రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని ఎస్‌ఎస్‌ఎల్‌వీ కళ్యాణ మండపంలో ఐసీఈయూ వరంగల్ డివిజన్ ప్రెసిడెంట్ బి. శ్రీహరి అధ్యక్షతన ఐసీఈయూ వరంగల్ డివిజన్ 39వ వార్షిక మహాసభ జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి ఫంక్షన్ హాల్ వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో రవీంద్రనాథ్ మాట్లాడుతూ. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు. ప్లాటినం జూబ్లీ జరుపుకుంటున్న ఐసీఈయూ.. తన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించి ఎన్నో పోరాటాలు నిర్వహించి ఉద్యోగుల హక్కులు సాధించిందని గుర్తు చేశారు. 2004 నుంచి సర్వీస్ టాక్స్‌కు వ్యతిరేకంగా, ఆ తరువాత జీఎస్టీకి వ్యతిరేకంగా యూనియన్ చేసిన పోరాట ఫలితంగా ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేశారని ఇది గొప్ప విజయమని అన్నారు.
2019 తర్వాత చేసిన నిరంత పోరాట ఫలితంగా అతి త్వరలో ఎల్‌ఐసీలో అసిస్టెంట్ల నియామకం జరగబోతున్నదని తెలిపారు. కాబట్టి పోరాటాల ద్వారా మాత్రమే ఫలితాలు సాధిస్తామని, దానికి సభ్యులందరూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పదకొండేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా ఉందని, ఎల్‌ఐసీని ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించాలంటే పోరాటం తప్పదని స్పష్టంచేశారు. ఇందులో బావ సారూప్యత కలిగిన ఉద్యోగులను, సామాన్య ప్రజలను కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు. జోనల్ సంయుక్త కార్యదర్శి తిరుపతయ్య మాట్లాడుతూ.. మనం అద్భుతమైన వేతన సవరణ పొందగలిగామంటే అందుకు కారణం ఎల్‌ఐసీ బలంగా ఉండటమే అని, మరి సంస్థ అలా బలంగా ఉండాలంటే దాని వెనుక వెన్నుదన్నుగా నిలిచే యూనియన్ కూడా బలంగా ఉండాలని అన్నారు. ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీలో వడ్డించి వార్చుతున్న అసత్యాలు, అర్థసత్యాలను మనం ఉద్యోగుల దృక్పథాన్ని, దృష్టిని అనుసరించి అర్థం చేసుకోవాలని తెలిపారు. లేదంటే అసత్యాలని నిజమైన చరిత్రగా భ్రమపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి : ఎమ్మెల్యే మురళి నాయక్
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీని బలోపేతం చేయడం ద్వారానే ప్రజలకు ఉపయోగం ఉంటుందని, దానికోసం అందరూ కృషి చేయాలని మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళినాయక్ అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎల్‌ఐసీ ఎంతో ఉపయోగంగా ఉందని, వంద శాతం క్లెయిమ్స్ ఎల్‌ఐసీ ద్వారా అందుతున్నాయని తెలిపారు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని అన్నారు. ఉద్యోగులు కూడా ఆ రకమైన సేవలను ప్రజలకు అందివ్వాలని కోరారు. ఈ సభలో.. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, యూనియన్ వరంగల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం ప్రభాకర్, కోశాధికారి రేష్మ, సంయుక్త కార్యదర్శి ఏ చంద్రశేఖర్, మహిళా విభాగ కన్వీనర్ కె.అమ్మాజీ, ఎల్‌ఐసీ ఏవోఐ నాయకులు కమటం స్వామి, బానోత్ సేవియా, మీగడ లింగన్న, ఎల్‌ఐసి ఎల్‌ఐఏఎఫ్‌ఐ నాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.