Sunday, December 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువిధ్వంసమౌతున్న భిన్నత్వంలో ఏకత్వం

విధ్వంసమౌతున్న భిన్నత్వంలో ఏకత్వం

- Advertisement -

పెట్రేగుతున్న విద్వేషమే కారణం : ‘పుస్తక స్ఫూర్తి’లో వసంత కన్నాభిరాన్‌
పుస్తకం విజ్ఞానాన్ని అందించే ఆయుధం : ప్రముఖ సినీ దర్శకులు బి.నర్సింగరావు
చరిత్రకు సజీవ సాక్ష్యం పుస్తకం : నవతెలంగాణ ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో రోజురోజుకు పెట్రేగుతున్న విద్వేషం వల్ల భిన్నత్వంలో ఏకత్వం విధ్వంసమవు తున్నదని ప్రముఖ రచయిత వసంత కన్నాభిరాన్‌ అన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న 38వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో ”పుస్తక స్ఫూర్తి.. పుస్తకం ఒక దారి దీపం” అనే కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గతంలో హైదరాబాద్‌ నగరంలో ముస్లింలు, హిందువులు, ఆంగ్లో ఇండియన్లు వంటి అనేక మతాలు, వర్గాల ప్రజలు స్వేచ్ఛగా కలిసి మెలిసి జీవించే వారని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ సమగ్రతకు ప్రమాదకరమని హెచ్చరించారు.

పుస్తక రచయితలు తమ రచనలపై వచ్చే విమర్శలను సవాలుగా తీసుకుని కలానికి మరింత పదును పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ‘కఠోర షడ్జమాల’ పుస్తకం విషయంలో తన అనుభవాన్ని గుర్తు చేశారు. ప్రముఖ సినీ దర్శకులు బి.నర్సింగరావు మాట్లాడుతూ పుస్తకం విజ్ఞానాన్ని అందించే ఆయుధమని అన్నారు. ప్రపంచమంతా తిరిగినా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా తాను ఏనాడు పుస్తకాన్ని వీడలేదని గుర్తు చేసుకున్నారు. తన సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాల కోసమే ఖర్చు చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని వ్యాపకంగా చేసుకోవాలని సూచించారు. నవతెలంగాణ ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌ మాట్లాడుతూ విద్వేష భావజాలం మనుషుల్ని విడదీస్తున్న ప్రస్తుత తరుణంలో వారందర్నీ ఏకం చేసే వారధిగా పుస్తకం తనదైన పాత్రను పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. పుస్తకం చరిత్రకు సాక్ష్యం, వర్తమానానికి కర్తవ్యం, భవిష్యత్‌కు మార్గదర్శకమని చెప్పారు.

పాలకులు అభిప్రాయాలు చెప్పడమే దేశ ద్రోహంగా చిత్రీకరించి, ఆలోచనలను అణచి వేస్తున్నారని విమర్శించారు. 75ఏండ్ల స్వతంత్ర భారతంలో కూడా ఓట్లు అమ్ముకునే దుస్థితికి కారణమెవరని ప్రశ్నించారు. ప్రతిరోజూ ట్రిలియన్‌ డాలర్ల కొద్దీ సంపద సృష్టిస్తున్నా, ప్రపంచంలో ప్రజలు ఆర్ధాకలితో ఎందుకు అలమటిస్తున్నారని అడిగారు. డిజిటల్‌ సీన్లు, వేగవంతమైన ఫ్లాష్‌ ఫ్లాష్‌లు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయనీ, నేనేంటి? ఎందుకు జరుగుతోంది? కారణమెవరు? వంటి ఆలోచనలు మస్తిష్కాల్లోకి రాకుండా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. మనుషుల్ని మధ్య యుగాల వైపు తీసుకుపోతున్నారనీ, ప్రశ్నించే ప్రజల్ని విద్వేషాల చట్రంలో బంధిస్తున్నారని చెప్పారు. వీటన్నింటిని పుస్తకం ద్వారానే చేధించగలమని స్పష్టంచేశారు. దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ పుస్తక ప్రదర్శనకే పరిమితం కాకుండా… తనదైన శైలిలో సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నదని తెలిపారు. అనంతరం బుకఫెయిర్‌ అధ్యక్షులు యాకుబ్‌, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి వక్తలను సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -