Tuesday, December 16, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఐక్యతే ఆయుధం… పోరాటమే మార్గం

ఐక్యతే ఆయుధం… పోరాటమే మార్గం

- Advertisement -

ఉరుములు, మెరుపులే కాదు. జడివానతో పాటు పిడుగులూ మిస్సైల్స్‌లా దూసుకొస్తున్నాయి. దాక్కునే చోటులేదు. తప్పుకునే మార్గం లేదు. వీరతిలకం దిద్దే వారెవరూ లేరు. ఆడా, మగా చంకలో తుపా కుల్తో పుట్టిన పాలస్తీనా వారిలా పిల్లా, జెల్లా ముసలీముతకా తామెత్త గలిగే కత్తులూ కటార్లు పట్టుకుని రణరంగంలోనే ఉన్నారు. శత్రువు వేయి తలల విషనాగు. కార్పొరేట్ల సేవకోసం మతాన్ని అవలీలగా వాడుతున్నాడు. లేబర్‌ కోడ్‌ల కు మను ధర్మం, శుక్రనీతి వంటి మారణాయుధాలను తొడిగాడు. దానికి ‘శ్రమశక్తి నీతి-2025’ అని నామకరణం చేశాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్మికవర్గాన్ని ఏకతాటిపై నిలబెట్టే కర్తవ్యాన్ని సీఐటీయూ తలకెత్తుకుంది. మెదక్‌ పట్టణంలో డిసెంబరు 7నుండి 9వరకు జరిగిన రాష్ట్ర ఐదవ మహాసభ ఈ కర్తవ్యసాధనకై పునరంకిత మయ్యింది. రాష్ట్ర కార్మిక వర్గానికి దిశానిర్దేశం చేసింది.

ప్రపంచ వ్యాపితంగా తిరోగమన శక్తులు పైచేయి సాధిస్తున్న ప్రస్తుత తరుణంలో మతోన్మాదమే ప్రధాన ఆయుధంగా మోడీ సర్కారు 2024లో మూడోసారి అధికారపగ్గాలు చేపట్టింది. ‘మనం’, ‘వారు’ రాజకీయాలు దాన్ని అందలమెక్కించాయి. రాజకీయాలకు, కార్మికోద్యమంపై దాడికీ వున్న ప్రత్యక్ష సంబంధం నేడు మన దేశంలో గతంలో ఎప్పటికన్నా స్పష్టంగా కనపడుతున్నది. దీన్ని కార్మికులకు స్పష్టం చేయడంలో సీఐటీయూ శ్రేణులు వెనకపడరాదని రాష్ట్ర మహాసభ హెచ్చరించింది. బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు మోడీసర్కార్‌ మరింత పైశాచికంగా కార్మికులపై విరుచుకు పడటానికి దారితీసిందనేది స్పష్టం. దాదాపు ఐదేండ్లు కార్మికోద్యమం ఎదురు తిరుగుతుందని వెనక్కి తగ్గిన మోడీ సర్కార్‌ బీహార్‌ విజయంతో రెచ్చిపోయి లేబర్‌ కోడ్స్‌ నోటిఫై చేసేసింది.

నేడు వర్గపాలన దేశంలో మరింత సుస్పష్టమవుతోంది. లేబర్‌ కోడ్‌లపై ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ స్పందించదు. ఎనిమిది గంటల పనిదినాన్ని అపహాస్యం చేస్తూ కర్నాటక, తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు జీవోలిస్తాయి. మోడీ సూట్‌ లక్షల ఖరీదు చేస్తుందని ‘సూట్‌ బూట్‌ సర్కార్‌’ అంటూ ధ్వజమెత్తే రాహుల్‌ గాంధీకి లేబర్‌ కోడ్‌లు అసలు సమస్యే కాదన్నట్లుంది. పనిగంటలపై దాడికి తెగబడ్డ వారు ‘మేడే’పై దాడి చేయకుండా ఆగుతారా? ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి, ఎల్‌అండ్‌టి సుబ్రమణియన్‌ల వ్యవహారమను కుంటే పొరపాటు. 2026కి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ పండుగ దినాల లిస్టులో నుండి మేడే ఎగిరిపోయింది. ‘నేను మీ బడిలోనే చదువుకున్నాన’ని రేవంత్‌రెడ్డి తన పాత జీవితాన్ని గుర్తు చేసుకున్న ఫలితమా ఇది!? అంతకుముందు త్రిపురలో బీజేపీ ప్రభుత్వం మేడేని సెలవు దినంగా తొలగించింది.

మేడేపై దాడంటే యావత్‌ కార్మికోద్యమంపై దాడి. మేడేపై దాడంటే ఎర్రజెండా వారసత్వంపై దాడి. ఆ నెత్తుటిచారలు కార్మికుల పుట్టుమచ్చలు. చెరిపితే చెరిగిపోవు. ఈ విషయాన్ని నారాయణమూర్తికీ, రేవంత్‌ రెడ్డికి, మోడీకి జ్ఞాపకం చేయాలనుకుంది తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభ. పోరాడుతూ..ఉద్యమిస్తూ.. రవంత సేదదీరి.. రీచార్జీ అయి.. పోరాటాల్లో తలమునకలై నిర్మించుకున్న ఉద్యమం గత మూడేండ్ల కాలంలో విస్తరించింది. కార్యకర్తల సంఖ్యా పెరిగింది. సభ్యత్వం మూడు లక్షలు దాటింది. రాష్ట్రంలోని 612 మండ లాలకుగాను, 519 మండలాల్లో మండల సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. తాజాగా నాచారంలోని షాహి ఎక్స్‌పోర్ట్స్‌లో 1,600 మంది మహిళా కార్మికుల స్పాంటేనియస్‌ సమ్మెతో సహా ఈ మూడేండ్ల కాలంలో ప్రతి జిల్లాలోని ప్రతి రంగంలో జరిగిన సమ్మెల్లో సీఐటీయూ కార్యకర్తల పాత్ర గణనీయమైంది.

ఇవి గాకుండా 2024 సెక్టోరల్‌ సమ్మెలో, 2025 జులై 9 సార్వత్రిక సమ్మెలో మండల సమన్వయ కమిటీ నుండి రాష్ట్ర కమిటీ వరకు తమ శక్తి కొలదీ క్యాంపెయిన్‌ నిర్వహించారు. రెండు మినహా అన్ని జిల్లాలు స్థానిక యూనియన్ల రిజిస్ట్రేషన్‌ చేయించడంలో విజయవంత మయ్యాయి. మెదక్‌ జిల్లాలోని మొత్తం 492 గ్రామ పంచాయతీలకు గాను, 45రోజుల్లో 492 గ్రామ పంచాయతీల్లో వివిధ యూనియన్‌లతో గ్రామ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం, అదీ నిధి సేకరణలో నిమగమైన కార్యకర్తలు చేయగలగడం రాష్ట్రానికి కొత్త అనుభవాన్నిచ్చింది. అన్ని గ్రామాలకు ‘మన వర్కర్‌’ చందాలు చేర్పించడం మరో అనుభవం. మొత్తం ఎనిమిది మంది సీఐటీయూ పూర్తికాలం కార్యకర్తలు, ఒక వ్య.కా.స. కార్యకర్త ఈ పనిని పూర్తిచేశారు. అన్ని జిల్లాలో గ్రామకమిటీలు వేయొచ్చని, కార్మిక, కర్షక ఐక్యతకు, వివిధ క్యాంపెయిన్లు ముందుకుపోవడానికి ఈ గ్రామ సమన్వయ కమిటీలు ఉపయోగపడతాయని రాష్ట్రానికి ఒక అనుభవాన్నిచ్చింది మెతుకుసీమ.

భవిష్యత్‌ నాయకత్వానికి కొదవ లేకుండా…
పెరుగుతున్న పెట్టుబడిదారీ విధానాన్ని ధీటుగా ఎదుర్కొవాలంటే తయారీ రంగంపై ముఖ్యంగా భారీ, మధ్య తరహా పరిశ్రమలపై కేంద్రీకరణ కీలక కర్తవ్యంగా పెట్టుకుని కృషి సాగింది. రాష్ట్రంలో గుర్తించిన 63 క్లస్టర్లకుగానూ 55 పారిశ్రామిక క్లస్టర్లకు బాధ్యులున్నారు. నూటయాభై పరిశ్రమల్లో సీఐటీయూ అనుబంధ యూనియన్లున్నాయి. ఈ క్లస్టర్లలో కాంట్రాక్టు కార్మికులపై కేంద్రీకరించాలన్న నిర్ణయం, ముఖ్యంగా శాశ్వత కార్మికుల యూనియన్‌లున్న అన్ని పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులకు విడిగా యూనియన్లు రిజిస్టర్‌ చేయించి పోరాడాలన్న నిర్ణయం మంచి ఫలితాలనిచ్చింది. అత్యాధునిక పరిశ్రమలపై ప్రత్యేక కేంద్రీకరణ చేసింది.

అన్ని జిల్లాలు, రాష్ట్ర వ్యాపిత రంగాలు భవిష్యత్‌ నాయకత్వానికి కొదవలేకుండా ముప్ఫయి యేండ్ల లోపుండే యువ కార్మికులపై ప్రత్యేక కృషి చేస్తున్నారు. అసంఘటిత రంగంలో కూడా కమిటీల దృష్టి చెదిరిపోకుండా, నాలుగు రంగాలనెంచుకుని, భవన నిర్మాణం, హమాలీ, ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు, బీడీ రంగాలపై ప్రత్యేక కేంద్రీకరణ వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ‘కార్యకర్తలే అన్నీ నిర్ణయిస్తార’న్న స్టాలిన్‌ సూక్తికి అనుగుణంగా గత దశాబ్దాల్లాగే కేంద్రీకరణ సాగింది. టీయూ రంగ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ అవసరం. ట్రేడ్‌ యూనియన్‌ నైపుణ్యం, అంటే యాజమాన్యాలతో మాట్లాడటం, పోట్లాడటమే కాదు, లేబర్‌ డిపార్టుమెంటులో డీల్‌ చేయడంతోపాటు యూనియన్లను ప్రజా తంత్రయుతంగా నడపడం కీలకంగా తెలిసుండాలి. కార్మిక సంఘాలకు ప్రత్యక్ష బాధ్యత వహించకుండా ఇవన్నీ పట్టుబడవు. ఇందుకు తగిన రాజకీయ శిక్షణ తక్షణావసరం.

వివిధ స్థాయిల్లోని నాయకులను ఉద్యమాల్లో రాపాడిస్తేగాని తయారు కారు. రాష్ట్రంలో 182 మంది పూర్తికాలం కార్యకర్తలకు గాను 132 మందికే యూనియన్‌ల ప్రత్యక్ష బాధ్యతలున్నాయి. కార్మికుల ముఖచిత్రం మారుతున్న నేటిస్థితిలో కార్యకర్తలు మరింత సృజనాత్మకంగా పనిచేయడం అవసరమని రాష్ట్ర మహాసభ అభిప్రాయపడింది. వీరికి అదనంగా తమ వృత్తి చేసుకుంటూ ఉద్యమానికి సహకరించే పార్ట్‌టైమ్‌ కార్యకర్తలు 1142 మంది ఉన్నారు. వీరు బహుళజాతి కంపెనీలకు నాయకత్వం వహించడం మొదలు, స్కీమ్‌ వర్కర్లకు నాయకత్వం వహించడం వరకు చేస్తున్నారు. ఎక్కడికక్కడ యూనియన్‌లలో క్రియాశీలంగా పనిచేసే అంతర్గత కార్యకర్తలు 2035 మంది ఉన్నారు. ఈ 4159 మంది సీఐటీయూ నిర్వహించిన ఉద్యమాల మధనంలో నుండి పుట్టిన ‘కామధేనువులు, కల్పవృక్షాలు’. వీరందరి సమిష్టి కృషి లేకుంటే సీఐటీయూ నేడీ స్థితిలో ఉండేది కాదు.

అటు యాజమాన్యాలు, ఇటు పాలకపార్టీలు కార్మికుల్ని రాజకీయ రహితంగా చేసేందుకు ప్రయత్ని స్తున్నాయి. కొంత విజయం కూడా సాధించాయి. కార్పొరేట్లు, వారి మీడియా అస్తిత్వ రాజకీయాలను ప్రోత్స హిస్తున్నది. వర్గ పోరాటాన్ని తిరస్కరిస్తున్నది. కార్మికవర్గంలో అనైక్యతకు ఇవి కారణమవు తున్నాయి. వర్గ పోరా టం నుండి మహిళల్ని దూరం చేస్తున్నాయి. అయితే ఈ నివేదికను రాష్ట్ర మహాసభ చర్చించే సందర్భంలోనే షాహీ ఎక్స్‌పోర్ట్స్‌లోని పదహారు వందల మంది మహిళా కార్మికులు తమ వేతనాల కోసం రోడ్డెక్కిన ఘటన రాష్ట్ర రాజధానిలోనే బయటికొచ్చింది. ఈనెల ఏడో తేదీ నుండి పగలూ, రాత్రి ఎముకలు కొరకే చలిలో రోడ్లపైనే బైటాయించారు. యాజమాన్యం, పోలీసులు బెదిరింపులకు వెరవకుండా ఈ ఆందోళన సాగుతున్నది. పదవ తేదీ నుండి ఇద్దరు సీఐటీయూ రాష్ట్ర ఆఫీసు బేరర్లు ఈ ఉద్యమంలో మమేకమై వున్నారు. అక్కడ యూనియన్‌ లేకున్నా సాగుతున్న ఆందోళనను చూస్తే లేబర్‌కోడ్‌ల అమలు ఎంత అసాధ్యమో అర్థమవుతుంది.

కోజికోడ్‌ నిర్మాణ నివేదిక వెలుగులో..!
సభ్యులను చైతన్యపరచడానికి, కార్యకలాపాలను విస్తరింపచేయడానికి, కార్మికవర్గ ఐక్యతను సాధించడానికి ప్రజాతంత్ర పనివిధానం అత్యంత కీలకం. ప్రజాతంత్ర పని విధానం అమలు క్రమంలో కార్మికవర్గం తన వర్గచైతన్యాన్ని పెంపొందించుకుని తన వర్గ శత్రువులను, వర్గ మిత్రులను గుర్తించడానికి దోహదం చేస్తుందని కోజికోడ్‌ నిర్మాణ నివేదిక పేర్కొంది. దేశవ్యాపితసమ్మెలు, క్యాంపెయిన్స్‌ సందర్భంగా పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగిన జనరల్‌ బాడీల్లో కార్మికుల మూడ్‌కు అనుగుణంగా ఏ విధంగా కార్యక్రమాల రూపకల్పన జరిగిందో నివేదిక తేల్చింది. క్షేత్ర స్థాయి వరకు కార్మికుల్లో కెళ్లిన తీరు, దాని ఫలితాలు చర్చించిన మహాసభ స్థూలంగా రాష్ట్రంలో ప్రజాతంత్ర పనివిధానం అమలవుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే రాష్ట్రంలో కార్మికుల సంఖ్య, మన ఆందోళనలు, పోరాటాలు, మన సభ్యత్వంతో పోలిస్తే ఈ కృషిలో బాగా వెనకబడి వున్నామని మహాసభ నివేదిక ఆత్మవిమర్శనా పూర్వకంగా సమీక్షించుకుంది. సభ్యత్వాన్ని విశ్లేషించుకున్న నివేదిక దానిలో కొనసాగుతున్న అసమానతల గురించి చర్చించింది.

”ఆల్‌ ఈజ్‌ వెల్‌ దట్‌ ఎన్డ్స్‌ వెల్‌” అన్న ఆంగ్ల సామెత ప్రకారం మహాసభ ఏకగ్రీవంగా నాయకత్వాన్ని, కమిటీ, కౌన్సిల్స్‌ను ఎన్నుకుని అంతర్జాతీయ గీతం పాడుకుంటూ ముగిసింది.
శ్రమశక్తినీతి 2025, లేబర్‌కోడ్స్‌పై అన్ని స్థాయిల్లోని నాయకులు పట్టుసాధించాలని, ఆధునిక పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాంతాలు, కీలకరంగాల్లో ప్రత్యేకించి కేంద్రీకరించాలని, కనీస వేతనాల సమస్యపై నిర్దిష్టంగా ఆందోళనా పోరాటాలు చేయాలని, కార్పొరేట్‌, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కార్మికవర్గాన్ని చైతన్యపరచాలని తదితర పద్నాలుగు ఉద్యమ కర్తవ్యాలను, పంతొమ్మిది నిర్మాణ కర్తవ్యాలను మహాసభ చేపట్టింది. ఏమైనా కార్మిక, కర్షక ఐక్యతను సాధించడం రానున్నకాలంలో కీలకాంశం. క్షేత్రస్థాయిలో ఆ ఐక్యతను సాధించడానికి సీఐటీయూ మండల, గ్రామ సమన్వయ కమిటీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని మహాసభ ప్రణాళిక సిద్ధం చేసింది. మహాసభ ఖర్చంతా కేవలం కార్మికుల వద్ద నుండే సేకరించడం, భోజన పదార్థాలన్నీ వస్తురూపంలో దాతల నుండి సేకరణతో పరిమిత వనరులతో మహాసభ విజయవంతంగా ముగిసింది.

ఆర్‌.సుధాభాస్కర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -