Wednesday, December 10, 2025
E-PAPER
Homeఎడిట్ పేజియూనివర్సిటీలు-తెలంగాణ భవిష్యత్తు కేంద్రాలు

యూనివర్సిటీలు-తెలంగాణ భవిష్యత్తు కేంద్రాలు

- Advertisement -

ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య – నెల్సన్‌ మండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు ఉస్మానియా యూని వర్సిటీకి వస్తున్న సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులుగా ఆయన రాకను స్వాగతిస్తూనే కొన్ని ప్రధాన అంశాలపై దృష్టి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి హోదాలో ఆగస్టు ఇరవై ఐదున ఆయన మొదటిసారి ఓయూకు వచ్చిన సందర్భంగా చాలాబాగా మాట్లాడారు. ”తెలంగాణ రాష్ట్రానికి పర్యాయపదం ఉస్మానియా యూనివర్సిటీ, నాటి పాలకుల వల్లనే ఓయూకి ఈ దుస్థితి నెలకొన్నది. ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాలుగా మన విశ్వవిద్యాలయాలు మారాలి. యూనివర్సిటీల సమగ్ర అభివృద్ధి జరగాలి” అని అన్నారు. అయితే వందేండ్ల ఘనమైన చరిత్ర నింపుకున్న ఉస్మానియా నేడు ”పేరు గొప్ప ఊరు దిబ్బ” అన్న చందంగా తయారైంది. ఉన్నత విద్యావ్యవస్థకు పునాదిరాళ్లుగా నిలిచిన ఓయూ, గ్రామీణ, పేద, మధ్యతరగతి విద్యార్థుల, జీవితాలలో వెలుగులు నింపింది.కానీ, నేడు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. పాలకుల నిర్లక్ష్యం, నిధుల కొరత, ఖాళీ పోస్టులు, ప్రయివేటు యూనివర్సిటీల పోటీ, పెరుగుతున్న ఫీజులు -మౌలిక సమస్యలు యూనివర్సిటీని పట్టి పీడిస్తున్నా యి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మాటలు యూనివర్సిటీ భవిష్యత్‌పై కొత్త ఆశలు చిగురించాయి.
అభివృద్ధికి రూ.1500 కోట్లు ఇవ్వాలి
ఉస్మానియాకు గత పాలకులు నిధుల కేటాయింపులో తీవ్రమైన నిర్లక్ష్యం చేశారు. బడ్జెట్‌లో ఇచ్చే నిధులు కేవలం యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికే సరిపోయేది. ఇతరత్రా ఖర్చులకోసం విద్యార్థుల మీద యూనివర్సిటీ అధికారులు ఫీజుల భారం మోపారు. పురాతనమైన నిజాం కాలం నాటి గుర్రపుశాలల్లో విద్యార్థులు వసతి పొందుతున్న దుస్థితి. ఇలాంటి పరిస్థితిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్‌ వసతులను కల్పించాలి. మరిన్ని కొత్త హాస్టల్‌ భవనాలు నిర్మించాలి. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులుగా మార్చాలి. మారు తున్న పరిస్థితుల కనుగుణంగా కొత్త కోర్సులను ఏర్పాటు చేయాలి. పెంచిన కోర్స్‌ ఫీజులను తగ్గించే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థుల రియంబర్స్‌మెంట్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలు సుమారుగా రూ.వంద కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి విడుదల కాకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్‌ తీసుకోవడం గగనమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు కూడా విడుదల చేయాలి. దీనితో పాటు క్యాంపస్‌ విద్యార్థులకు ఉచితంగా మెస్‌ సౌకర్యం కల్పించాలి. ఆధునిక ప్రయోగశాలలు నిర్మించాలి. లైబ్రరీ వసతులు మెరుగుపరచాలి. యూనివర్సిటీ భూమి కబ్జా కాకుండా చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయాలి. ఓయూలో 75శాతం బోధనా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. స్థిరమైన అధ్యాపకులు లేకుండా కాంట్రాక్ట్‌, పార్టీ టైమ్‌ ప్రొఫెసర్స్‌తో ఆధారపడి బోధన సాగించడం ద్వారా విద్యా వ్యవస్థనే అనిశ్చితిలోకి నెట్టుతున్నారు. ఇది విద్యార్థుల మేధస్సుపై, పరిశోధనపై తీవ్రమైన ప్రభా వం పడుతుంది. గత టీఆర్‌ఎస్‌ పాలనలో కామన్‌ రిక్రూమెంట్‌ బోర్డు పేరు మీద కాలయాపన చేశారు. కానీ ఒక్క ఆచార్య పోస్టులు కూడా భర్తీ చేయలేక పోయారు. చరిత్ర కలిగిన ఆర్ట్స్‌ కాలేజీలో ఆర్కియాలజీ, ఫ్రెంచ్‌, జర్మన్‌, కన్నడ మరాఠీ డిపార్ట్మెంట్స్‌ రెగ్యులర్‌ ఫ్యాకల్టీ సమస్యతో సతమతమవుతున్నాయి. ఇతర విశ్వవిద్యాలయంలో కూడా కాంట్రాక్టు పార్ట్‌ టైం టీచర్లే అడ్మినిస్ట్రేషన్‌, అకాడమిక్‌ పదవులు కూడా నిర్వహించే పరిస్థితి నెలకొన్నది.

పరిశోధనను ప్రోత్సహించాలి
రాష్ట్ర యూనివర్సిటీల్లో పరిశోధన రంగం క్రమంగా కుదేలవుతోంది. యూజీసీ నుండి రావాల్సిన ఫెలోషిప్‌ స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందడం లేదు. రీసెర్చ్‌ గ్రాంట్లు తగ్గుతున్నాయి. ఫెలోషిప్‌ కేటాయింపులో తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫలితంగా ప్రతిభావంతులైన పరిశోధకులు రీసెర్చ్‌ చేయడానికి భయపడు తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెలోషిప్‌ పథకాన్ని ప్రారంభించినా నేటికీ అది ఆచరణకు నోచుకోలేదు. ఫెలోషిప్‌ అంటే కేవలం ఐదు, పదివేలుకాకుండా నేటి పరిశోధనకు అనుగుణంగా కనీసం 25 వేల రూపాయలు ఫెలోషిప్‌ సౌకర్యాన్ని కల్పించాలి. రీసెర్చ్‌ ల్యాబ్‌లను ఆధునీకరించాలి. ఉత్తమ రీసెర్చ్‌అవార్డ్‌ నెలకొ ల్పాలి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పరిశోధనను చూడాలి, ప్రోత్సహించాలి.
ఎన్‌ఈపీని వ్యతిరేకించాలి
చరిత్ర కలిగిన ఉస్మానియా, కాకతీయ జేఎన్టీయూ మొదలగు యూనివర్సిటీల అభివృద్ధి బాధ్యతలను విస్మరించి ప్రయివేటు విశ్వవిద్యా లయాలను ప్రోత్సహించడమంటే తమ బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకోవడమే అవుతుంది. అయితే విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చే ఈ ప్రయివేటు విధానం ద్వారా సమాన విద్యా అవకాశాలనే భావనే నిర్వీర్యమవుతోంది. డబ్బున్న వారికే నాణ్యమైన విద్య, మిగిలిన వారికి నాసిరకం విద్య అనే ఆర్థిక విభజన బలపడుతోంది. ఇప్పటికే మన రాష్ట్రంలో పది ప్రయివేటు విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు ఐదు డీమ్డ్‌ యూనివర్సిటీలు నెలకొల్పారు. నేడు విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో ఒప్పందం చేస్తున్నారు. ఇది నూతన జాతీయ విద్యావిధానంలో భాగమే అవుతుంది. ప్రభుత్వం ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా మన రాష్ట్ర పరిస్థితులకు ఉన్నత విద్యా విధానాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ ప్రశ్నిస్తూ విద్యార్థులు సమస్యల పై ఉద్యమించి నప్పుడు, వారి మీద కేసులు, అణచివేతలు, క్యాంపస్‌ డెమోక్రసీ కాలరాయడం జరుగుతుంది. యూనివర్సిటీలు ప్రజాస్వామ్యానికిభిన్న సంఘర్షణలకు అనుకూలంగా ఉండాలి. కానీ నేడు నిర్బంధాలకు వేదికలుగా మారుతున్నాయి.

ప్రభుత్వాలు మేల్కొవాలి
రాష్ట్ర యూనివర్సిటీలను బలహీనపరిస్తే, బలహీనపడేది కేవలం విద్యార్థులు కాదు – సమాజమంతా అని ప్రభుత్వం గ్రహించాలి.పేదల చదువు దెబ్బతింటే, సామాజిక చలనం ఆగిపోతుంది. విద్య దూరమైతే ప్రజాస్వామ్యమే కుదేలవుతుంది. ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొవాలి. ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమంటే కేవలం ప్రకటనలివ్వడం కాదు -బడ్జెట్‌లో స్పష్టమైన కేటాయింపులు చేయడం, ఖాళీ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయడం, ఫీజులను నియంత్రించడం, హాస్టళ్లను అభివృద్ధి చేయడం, పరిశోధనకు తగిన నిధులు ఇవ్వడం. విదేశీ విశ్వ విద్యాలయాలకు అనుమతి నిరాకరించడం. ఎన్‌ఈపిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర పరిస్థితులకను గుణంగా ఉన్నతవిద్య నిర్మాణం చేయడం. ఇవన్నీ జరిగితేనే రాష్ట్ర యూనివర్సిటీల ప్రాణం నిలబడు తుంది. వాటిని కాపాడటమంటే తెలంగాణ భవిష్యత్తును కాపాడటమే. ఈ పరిస్థితులను ఓయూ విద్యార్థుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారని ఆశిస్తున్నాము.
అర్‌ఎల్‌.మూర్తి
8247672658

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -