”స్వేచ్ఛకు సంకెళ్లు వేయలేరు. ఎన్ని అడ్డంకులున్నా ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాడుతూనే ఉంటారు. నిరంతరం వాటి కోసం సంఘటితపడుతూనే ఉంటారు. వైఫల్యాలు ఎదురైనా కొత్త ప్రపంచం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. వైఫల్యాల గురించి భయపడేవారు విజయాల ఆనందాన్ని ఆస్వాదించలేరు” -విజయ్ ప్రసాద్ ‘వాషింగ్టన్ బుల్లెట్స్’లో
ఇప్పటిదాకా మోగించిన యుద్ధభేరీలు 2026 ఏప్రిల్ 1 నుండి బాంబుల వర్షంగా మారనున్నాయి. అది ‘ఆల్ ఫూల్స్‌డే’నే కదా అనుకోకుండి! ‘ఆ చట్టం ఉంది కదా, ఈ చట్టం ఉంది కదా’ అనుకునే అమాయక కార్మికులందరిన్నీ మోడీ సాబ్ హోల్ సేల్‌గా ‘ఏప్రిల్ ఫూల్’ అంటాడు. జరపైలం! భారత కార్మికోద్యమంపై లేబర్ కోడ్‌లు అంతిమ దాడి. మూడు చట్టాలు కలిసిపోయి ఐఆర్ కోడ్, 13చట్టాలు కలిసిపోయి ఓఎస్‌హెచ్ కోడ్, నాలుగు చట్టాలు కలిసిపోయి వేజ్‌కోడ్, తొమ్మిది కలిసి ఎస్.ఎస్ కోడ్‌లుగా ఏర్పడ్డాయి. అయితే ఇవి హఠాత్తుగా రాలేదు. వాటిని ‘గుణాత్మకం’గా చూస్తే కుదరదు. వాటి పరిణామాత్మక మార్పులను, పరిమాణంలో వచ్చిన మార్పులను చూసినప్పుడే వాటి రూపంలో వచ్చిన మార్పులే కాదు, సారంలో ఏమి మార్పులు, ఎందుకొచ్చాయో అర్థం అవుతుంది. అందుకు ప్రయత్నం చేద్దాం. ఒక వ్యాసంలో అన్నీ చెప్పలేం. సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన మూడు బుక్‌లెట్లు అనేక వివరాలు తెలియజేస్తాయి. 1929 దాకా తవ్వుకుంటూ వెళ్తే కనపడే విషయాలు, ఆ తర్వాత నల్లదొరలు ప్రయత్నించి విఫలమైన తీరు తెలుసుకోవచ్చు.
దాడీ రాజకీయమే! ప్రతిఘటనా రాజకీయంగానే..!
ఫిబ్రవరి 12 సమ్మె జీతాల కోసమో, బోనస్‌ల కోసమో కాదు. పచ్చిగా కార్పొరేట్ల కోసం మోడీ సర్కార్ సిగ్గూ, బిడియం లేకుండా రంగంలోకి దిగింది. అమెరికా టారిఫ్‌ల యుద్ధం ప్రకటించింది. సాటి నాటో దేశంపై కూడా కాలుదువ్వుతోంది. కొన్ని ఐరోపా దేశాలైనా అమెరికా దుర్మార్గాన్ని ఖండిస్తున్నాయి. బ్రిక్స్‌లోని బ్రెజిల్‌పై టారిఫ్‌లు, రష్యాపై టారిఫ్‌లు, చైనాపై టారిఫ్‌ల దాడి జరుగుతోంటే నోరెత్తడు మోడీసాబ్! ఎన్ని గంభీర ప్రకటనలిచ్చినా చివిరికి ‘రష్యా నుండి ఇండియా డీజిల్ కొనద’నే మాట ట్రంప్ చెప్తే కూడా నోరెత్తడు మన ప్రధాని! రూపాయలు తీసుకుని తక్కువ ధరకు డీజిల్ అమ్మే రష్యా, ఇరాన్, వెనిజులాల నుండి కొనకుండా అధిక ధరలకు డాలర్ల వ్యాపారం చేసేవారి దగ్గర కొంటే భారత ప్రజలపై ఎంత భారం?! అమెరికా తన సంక్షోభాన్ని భారత్‌వంటి తొత్తు దేశాలపై నెడుతూంటే, భారతదేశ పాలకవర్గాలు దాన్ని సామాన్య జనంపైనా, కార్మికులు, కర్షకులపైనా నెడుతున్నాయి. ఈ సమ్మెలో ఇమిడి వున్న సమస్యలన్నీ రాజకీయ పరమైనవే. ఈ సమ్మె ద్వారా మన ప్రతిఘటన సిఐటియు అధ్యక్షులు చెప్పినట్లు పైకి ఒక పోటు పొడవాలి. అంతర్జాతీయ ప్రాధాన్యతున్న సమ్మె ఇది.
ఇక్కడ రెండు వాదనలను ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా ప్రచారంలో పెడ్తున్నారు. దాన్ని కార్మికుల్లో ప్రతిధ్వనింపజేసే వారూ లేకపోలేదు. మొదటిది ఒక రోజు సమ్మెతో ఏమౌతుందని!? ఫిబ్రవరి 13వ తేదీ ఫైనాన్షియల్ పత్రికలు చూస్తే ఎన్ని వందల కోట్లు ఆర్థిక వ్యవస్థకు నష్టం వచ్చిందో రాస్తారు. మనం చూస్తాం కూడా! జనరల్ సమ్మె ఒక ఫ్యాక్టరీలో కార్మికుల సమస్యలమీద ఆ ఫ్యాక్టరీ కార్మికులు చేసేది కాదు. పెట్టుబడిదారీ విధానం రక్తమోడిన రోజు. ఆ డ్రాక్యుల పీల్చేరక్తాన్ని చికాగో ‘మెక్ కార్మిక్’ కర్మాగార కార్మికులు విదిలించి కొట్టిన రోజు. 8 గంటల పని కోసం నాడు వారి రుధిరధారలు అరుణార్ణవ కేతనమై ఎగిరిన రోజుకు చిహ్నం జనరల్ సమ్మె. నయా ఉదార వాద విధాన ప్రస్తుత దశలో నిర్దిష్టంగాఉత్పత్తి కేంద్రాలు స్తంభించిపోవడం, వాటికి మూటలెత్తే సర్వీసు కేంద్రాలు (హమాలీలు) మోటగొట్టే రైతాంగం, వారి వెన్నంటే గ్రామీణ కార్మిక జనం చేసే జనరల్ సమ్మె ఒక రోజైనా ‘పైకి ఒక పోటుపొడిచినట్లే! ఢిల్లీని తన్నే తన్ను ఐరోపా ద్వారా వాషింగ్టన్‌ని తాకాలి. అందుకే సమ్మె ఒకరోజే నైనా దాని ప్రభావం అతి పెద్దది!
ఇక రెండో అంశం ఈ సమ్మె కమ్యూనిస్టుల ‘ఉనికి’ కోసం చేసే రాజకీయ సమ్మె అనే పాచిపాట పాడే పాలకులకు వంతపాడే ఒక ప్రధాన కార్మిక సంఘమూ లేకపోలేదు! కార్మికుల కోసం కమ్యూనిస్టులు నిలబడతారనే ప్రశంశాపత్రం ఇచ్చినందుకు సదరు పాలకులకూ, వారి ప్రాయోజిత కార్మిక సంఘానికీ ధన్యవాదాలు. అయితే ఈ విమర్శ కార్మికుల, ఉద్యోగుల బుర్రల్లో శక్తివంతంగా కూచుంటోందనే విషయం గమనార్హం. అందుకే లాలాలజపతిరాయ్ జోసెఫ్ బాప్టిస్టా, ఎన్‌ఎం జోషి, దివాన్ చమాన్‌లాల్, ఎన్‌డి సావర్కార్ వంటి ఎందరో జాతీయోద్యమ నాయకులు కలిసి 1920లో ఏఐటియుసి ప్రారంభసభ కోసం భారతదేశ కార్మికులకు విడుదల చేసిన ‘మేనిఫెస్టో’ 648 మాటల్లో ఆర్థికాంశాలతోపాటు రాజకీయ విషయాల్ని కూడా రాశారు. ఈ మొదటి పేరా చూడండి.
”భారతదేశ కార్మికులారా! మీ గమ్యానికి మీరే తీర్పరులు. నేటి జాతీయోద్యమం నుండి మీరు దూరంగా ఉండలేరు. భారతదేశంలో నేడు చరిత్ర సృష్టించబోతున్న ఘటనలు మీకు తాకకుండా ఉండవు. రాజకీయ చదరంగంలో జరిగే ప్రతిచర్యా, ఆర్థిక, ఫైనాన్షియల్ విషయాలు మన దేశంలోని యే ఇతరవర్గం కంటే మీకే కీలకమైనవి. మీ బాధ్యతల యెడల మీరు మరింత చైతన్య పూర్వకంగా ఉండాలి. భారతదేశ కార్మికులారా! ఈ భూమికి (భారతదేశానికి) వారసులు మీరు. సిమ్లా బ్యూరోక్రాట్ల కోసమో, మిల్లు యజమానుల కోసమో అది రిజర్వ్ చేయబడిలేదు. మనదేశ రాజకీయ నాయకులు స్వరాజ్యం అడుగుతున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం లేని రాజకీయ స్వాతంత్య్రం ఎందుకని వారిని మీరు ప్రశ్నించాలి. అందుకే, దేశ జాతీయోద్యమాన్ని మీరు అశ్రద్ధ చేయలేరు’ ఇవన్నీ ఇంత స్పష్టంగా రాసిన ఆ మేనిఫెస్టో చివరిపేరా మరింత ‘మీ విముక్తి కోసం ఫ్యాక్టరీ చట్టంవైపు చూడకండి. చట్టంమీలో ఐక్యతను పాదుకొల్పదు. చట్టం మీలో సౌభ్రాతృత్వాన్ని నింపదు. అది మీ పనే! కార్మికుల దోపిడీనే నేటి పెట్టుబడిదారుల వాదం. మీ ఐక్యతే మీ నినాదమవ్వాలి!.. అదే మీకు విముక్తి ప్రదాత.. దేశానికి అదే స్వాతంత్య్రం తెచ్చిపెడుతుంది”.
భారత కార్మికోద్యమ చరిత్రే స్వాతంత్య్ర పోరాటంతో సమ్మిళితమై సాగింది. ఎఐటియుసి ఆవిర్భావ సమావేశానికి ఆనాటి బడా భారత పెట్టుబడిదారులంతా హాజరై బ్రిటిష్‌వారి కంపెనీల్లో యూనియన్లు పెట్టి వారిని ఆర్థికంగా దెబ్బతీయాలని ‘ఆశీర్వది’స్తే నాటి బాంబే ప్రెసిడెన్సీలో సూరత్ నుండి మహారాష్ట్ర వ్యాపితంగా యూనియన్లు పెట్టి పెట్టుబడి, భారతీయులదా, బ్రిటీష్ వారిదా తేడా లేకుండా ఎక్కడ దోపిడీ ఉంటే అక్కడంతా కార్మిక సంఘాలు మొలిచినాయి. విరబూసినాయి. విరగ్గాసినాయి. బెంగాల్, కాన్‌పూర్, మద్రాసు ప్రెసిడెన్సీల్లో పెట్టుబడిపై దాడి చేసినాయి. ఆనాటి ట్రేడ్‌యూనియన్ నాయకులు, కమ్యూనిస్టు నాయకులు కుట్ర కేసులెదుర్కొన్నారు. జైళ్లపాలైనారు. లాలాజీవంటి వారు చెప్పినట్లు ఆర్థిక స్వాతంత్య్రంలేని రాజకీయ స్వాతంత్య్రం నిరుపయోగమని గుర్తెరిగి, అన్నిరకాల దోపిడీ, పీడనలపై తిరగబడ్డారు.
ఎఐటియుసి పుట్టడానికి, కమ్యూనిస్టులు ఆవిర్భావానికి చాలా ముందే 1908లో బంబాయి కార్మికుల ప్రియతమనేత బాలగంగాధర్‌తిలక్‌ను అరెస్టు చేస్తే ఎవరంతటికి వారే రోడ్లపైకొచ్చి బొంబాయి ముట్టడికి ప్రయత్నించారు కార్మికులు. దాదాపు అనేక మంది పోలీసు కాల్పుల్లో అమరులైనారు. రాజకీయ సమ్మెలు చేయడం భారతీయ కార్మికుల నరనరాల్లో జీర్ణించుకున్న అంశం. రేపు ఫిబ్రవరి 12న జరిగేది బరాబర్ రాజకీయ పోరాటమే. పెట్టుబడి పైశాచికంగా రెచ్చిపోతున్న సందర్భంలో కార్మికులు, వారి సంఘాలు లేబర్ కోడ్‌ల ప్రమాదం గమనించాలి. ప్రభుత్వరంగాన్ని దాదాపు ఖతం పట్టించే పనిలో మోడీ సర్కార్ ఉంది. ఒక రోజు సమ్మె చేస్తే ఇన్సెంటివ్ పోతుందని, చాలా జీతం పోతుందని (ఎల్‌ఐసి ఉద్యోగులకు ఒకరోజు జీతం కోత రూ.5,000 – 6,000 ఉంటుంది) బాధపడితే అసలు సంస్థలే మనుగడ లేకుంటే జీతాలేమిటి? ఇన్సెంటివ్‌లేమిటి? తెగించి పోరాడటం తప్ప ఇంకో మార్గంలేదు.
పిడుగుకీ, బియ్యానికి ఒకటే మంత్రం సరిపోదు!
అసంఘటితరంగానికీ, సంఘటితరంగానికి వర్తించే కోడ్‌లలో తేడాలున్నాయి. ఒకే మంత్రాన్ని అన్ని చోట్లా జపిస్తే కుదరదు. జిల్లా, జిల్లాకు కార్యకర్తల ఉపన్యాసాల్లో, ఆయా ప్రాంతాలను బట్టి వేసే కరపత్రాల్లో వైవిధ్యం ఉండాలి. మన వారి పరిశీలన, అధ్యయనం ఉండాలి. భారీ, మధ్యతరహా పరిశ్రమలున్న చోట చెప్పే ఐఆర్ కోడ్, ఫిక్స్‌డ్ టర్మ్ ఉపాధి విశేషాలు భవన నిర్మాణ కార్మికుల అడ్డాల వద్దా, బీడీ కార్మికుల వద్దా చెప్తే కొంగా, నక్కా కథలాగ ఉంటుంది. బీడీ, బీసీడబ్ల్యూ సెస్‌ల చట్టం రద్దయితే ఆ కార్మికుల సంక్షేమం ఏమవుతుంది? అనేక ఫ్యాక్టరీల్లో విస్తరించిన కాంట్రాక్టు కార్మికులకు, వలస కార్మికుల చట్టం గురించి చెప్పాల్సిన చోట ఐఆర్ కోడ్‌లోని సెక్షన్ 2 (జడ్) (ఆర్) (4) గురించి చెప్తే నిరుపయోగం. కొన్ని కామన్‌గా ఉన్న మాట నిజం.
ఉదాహరణకు హైదరాబాద్ సెంట్రల్ సిటీ, మేడ్చెల్ జిల్లా (బాలానగర్)లో ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్‌లో ఫ్యాక్టరీ నిర్వచనం పెరగడం, కాంట్రాక్టు చట్టంలో మార్పులొచ్చిన తీరు చెప్పకుండా వేరే ఏమి చెప్పినా ఉపయోగం నాస్తి, బాలానగర్ వంటి అనేక ప్రాంతాల్లోని ఎంఎస్‌ఎంఇల్లోని కార్మికులకు అసలు ఇపిఎఫ్, ఇఎస్‌ఐలు రావనీ, కనీసం వర్క్‌మెన్స్ కాంపెన్‌సేషన్ కూడా వర్తించదని నిర్దిష్ట అధ్యయనంతో ఎన్నిచోట్ల, ఎంతమదికి ప్రమాదాలు జరిగినాయి, ఏ విధంగా నష్టం జరిగింది, ఎంత పరిహారం వచ్చింది, ఇప్పుడు అది ఎలా రాదు వంటివి చెప్పాలి. అనేక మంది ట్రేడ్ యూనియన్ కార్యకర్తలకు తమ ఏరియాల్లోని ఎంఎస్‌ఎంఈలపై నిర్దిష్ట అధ్యయనం ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. ఎన్నిచోట్ల మహిళలున్నారు? ఎందరికి మెటర్నిటీ బెనిఫిట్స్ వస్తున్నాయి? వంటివి అర్థం చేసుకోవాలి.
భవన నిర్మాణ కార్మికులను దాదాపు అన్ని జిల్లాలూ ఆర్గనైజ్ చేస్తున్నారు. పదిమంది పని చేసే ‘ఎస్టాబ్లిష్‌మెంట్’లకు ఇది వర్తిస్తుందట! ఏ మండలంలో ఏది ‘ఎస్టాబ్లిష్‌మెంటో?’ తెలుసుకోవాలి.
కనీస వేతనం అందరికీ వస్తుందని భజన చేసేవారిని కనీస వేతనం లెక్కించే పద్ధతిలోనే వచ్చిన మార్పులను ప్రశ్నించాలి. జాతీయ కనీస వేతనం (నేషనల్ ఫ్లోర్‌లెవెల్ మినిమమ్ వేజ్) రోజుకి రూ.179/-కి ప్రాతిపదిక ఏమిటి? నెలకు రూ.5370/-తో ఏ కార్మికుడి కుటుంబం నెట్టుకురాగలదు. ఇద్దరూ పనిచేసినా రూ.10740/-తో ఏ కుటుంబం బతగ్గలదు? అందుకే ఎక్కడికక్కడ ఏ కార్మికులతో మాట్లాడుతున్నామో, ఎవరికి ఏ కోడ్‌లు వర్తిస్తాయో చూసి ఆ విషయాలపై టీయూ కేడర్ కేంద్రీకరించడం మంచిది. ”ప్రతి సమ్మె ఒక యుద్ధ పాఠశాలే”నన్న లెనిన్ సూక్తి గమనంలో పెట్టుకుని ఫిబ్రవరి 12 తెలంగాణలో ‘చక్కాజామ్’ జరిగేలా అన్ని కార్మిక సంఘాలు ప్రయత్నించాలి. అందుకు సిఐటియు కమిటీలు కేంద్ర బిందువులవ్వాలి.
ఆర్.సుధాభాస్కర్



