Wednesday, November 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅతీగతీ లేని ఫీజు రీయంబర్స్‌మెంట్‌

అతీగతీ లేని ఫీజు రీయంబర్స్‌మెంట్‌

- Advertisement -

సామాజిక సేవగా అందాల్సిన విద్య సరళీకర ఆర్థిక విధానాల పుణ్యమా అని పూర్తిగా ప్రయివేటీకరించబడింది. ఫలితంగా తెలుగు నాట అనేక ప్రయివేటు విద్యాసంస్థలు కుప్పలుతెప్పలుగా వెలిశాయి.విద్య పెట్టుబడి లేని చిన్న వ్యాపారం కనుక కాస్తా కూస్తో ఆస్తులు ఉన్నవారు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వాలు కూడా అప్పటివరకు ఉన్న ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల స్థానంలో ప్రయివేటు యాజమాన్యాలను ప్రొత్సహించి, విచ్ఛలవిడిగా అనుమతులిచ్చింది. ప్రభుత్వ విద్యారంరంగానికి ఇచ్చే గ్రాంట్లు, నియామకాలు తగ్గించి వేశాయి. ఒకరకంగా ప్రభుత్వం ఉన్నత విద్యాబాధ్యతల నుండి క్రమంగా వైదొలగుతూ వచ్చాయని చెప్పవచ్చును. అంతేకాదు, ఒకప్పుడు అన్నీ డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలలు ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉంటే, ప్రభుత్వ వైఖరి మూలంగానే ప్రయివేటు విద్యావ్యవస్థ వేళ్లూనుకుంది. అందుకు ఉదాహరణ తెలంగాణా రాష్ట్రంలో 696 డిగ్రీకళాశాలలు ఉంటే అందులో 578 ప్రయివేటు కళాశాలలు. 256 ఇంజ నీరింగ్‌ కళాశాలల్లో 202 ప్రయివేటు యాజమాన్యంలోనే ఉన్నాయి.123 పార్మసీ కళాశాలలుంటే వాటిలో 103 ప్రయివేటు యాజమాన్యం లోనివే.ఈ గణాంకాలు దేన్ని సూచిస్తున్నాయి? దీంతో ప్రయివేటు, ప్రభుత్వ విద్యానాణ్యత, సౌకర్యాల మధ్య అంతరం పెరిగింది. దీంతో ప్రభు త్వ విద్యాలయాల్లో నమోదు తగ్గి, ప్రయివేటు విద్యాసంస్థల్లో నమోదు శాతం పెరిగింది.

ఈదశలో అధికారంలోకి వచ్చిన వైయస్‌ రాజశేఖరరెడ్డి తిరిగి ప్రభుత్వ కళాశాలలకు ప్రాణప్రతిష్ట చేయడానికి బదులు అప్పటికప్పుడు ఓట్ల ప్రయోజనం చేకూరే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకం వైపు మోగ్గుచూపారు. ఫలితంగా ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలలు పూర్తిగా దివాళా తీయగా, పోటీలో కునారిల్లే దశలో ఉన్న ప్రయివేటు ఇంజనీరింగ్‌తో పాటు డిగ్రీ కళాశాలలకు తిరిగి ప్రాణప్రతిష్ట చేసినట్లయింది. ప్రభుత్వ ఉన్నత విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన కోట్లాది రూపాయలు ప్రజాధనం ఫీజురీయంబర్స్‌మెంట్‌ పేరుతో ప్రయివేటు విద్యాసంస్థల ధారాదత్తం చేసి పడేశాడు.అయితే ఇందులో చదువకున్న కొంతమంది పేద విద్యార్థులకు ఇది మేలు కూర్చిన మాట వాస్తవం. కానీ పేదల ఆస్తిగా అభివృద్ధి చెందాల్సిన ప్రభుత్వ కళాశాలల్ని గాలికి వదిలిన ఫలితంగా ఫీజురీయంబర్సమెంట్‌ సంక్షోభం దశకు చేరుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం 2015లో ”తెలంగాణా రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఫీజు రీయంబర్స్‌ మెంట్‌” అనే వ్యవస్థను దీనికోసం ఏర్పాటు చేసింది.అయితే మూతపడ్డ ఇంజనీరింగ్‌ కళాశాలలను అద్దెకు తీసుకుని ఈయన గురుకులాలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు మందగించింది. వైఎస్సార్‌ ఉన్నత విద్యావ్యవస్థను, కేసీఆర్‌ ప్రాథóమిక విద్యావ్యవస్థ మనుగడను తమ అనాలోచిత నిర్ణయాల వలన దెబ్బతీసినట్లయింది. కేసీఆర్‌ రెండవసారి అధికారంలోకి వచ్చిన కాలంలోనే ఒక్కో ప్రయివేటు కళాశాలకు కోట్లాది రూపాయల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు పోగుపడ్డాయి. తప్పనిసరి పరిస్థితుల్లో 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పథకం కొనసాగించాల్సిన అనివార్యత చోటుచేసుకుంది. అయితే ఇక్కడ కొనసాగించ డమంటే బంద్‌ చేయాలని ఉద్దేశం కాదు, దాన్ని అమలును పూర్తిగా పట్టించు కోకపోవడం వల్ల పథకమే పతానవస్తకు చేరింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ”కన్నతల్లికి కూడు పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా” అన్న చందంగా ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం విదేశీ యూనివర్సిటీల్లో చదివేవారి ఫీజు బకాయిలు విడుదల చేసింది. కానీ, ఇక్కడ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ నిధులు మాత్రం విడుదల చేయకపోవడం శోచనీయం.

ఇప్పటికే 10వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ప్రయివేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని సమాచారం. ఏడాదిన్నర కాలంగా ప్రయివేటు విద్యా సంస్థలని సర్కార్‌ ఏదోవిధంగా బుజ్జగిస్తూ వస్తున్నది. అయినప్పటికీ తమ బకాయిలు చెల్లించకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో ప్రయివేటు కళాశాలల యాజమాన్యం బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్థుల పరీక్షల ముందు ప్రతియేటా ఇలా చేయడం కూడా సరైంది కాదు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాలపై ఉంది. ఎందుకంటే, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో హాల్‌టిక్కెట్లు, పై చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఆ భారమంతా ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు మోయాల్సి వస్తున్నది. ఇది కూడా సర్కార్‌ గమనించి పరిష్కరించాల్సిన అంశం. కార్పోరేట్‌ స్థాయి సంస్థలు తప్ప, చిన్న చిన్న ప్రయివేటు విద్యాసంస్థలకు రూ.ఐదు కోట్లు, పెద్ద సంస్థలైతే పది కోట్ల ఫీజురీయంబర్స్‌మెంట్‌ బకాయిలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బకాయిలు చెల్లించడం తలకు మించిన భారమే కావచ్చు! కానీ ఇచ్చిన హామీ ప్రకారం విడతల వారిగా రూ.600కోట్లు చెల్లిస్తామని చెప్పి విస్మరించడం బాధ్యతారహిత్యం. దాంతోనే యాజమాన్యాలు మళ్లీ సమ్మెబాట పట్టాయనడంలో సందేహం లేదు. అలాగే గతంలో ఉన్నవి చెల్లించబోమని, కొత్త బకాయిలకే తమ బాధ్యత అని చెప్పడం కూడా సరైందికాదు. ప్రభుత్వమంటే నే మంచీచెడులు అన్ని చూడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ నేతలో అది లోపించందని అర్థమవుతున్నది.

ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం కూడా విషమపరిస్థితులనే ఏదుర్కొంటున్నాయి. తమవద్ద ఉన్న వందలాది మంది బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వేతనాల చెల్లింపునకు స్థిరాస్తులు తెగనమ్ముకుంటున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఫీజురీయంబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం ఇచ్చే ఉపశమనంపై లేపనం లాంటిదే గాని పూర్తిగా స్వాంతన చేకూర్చే చర్య కూడా కాదు!? దీర్ఘకాలిక సామాజిక అభివృద్ధి ప్రణాళిక లేని ఇలాంటి డొల్ల పథకాల డొల్లతనాన్ని, పాలకుల ఆలోచనల్లోని అవిటితనాన్ని బహిర్గత పరుస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎప్పుడో దెబ్బతిన్నా ఈ ఫీజురీయంబర్స్‌మెంట్‌ బకాయిలతో ప్రయివేటు విద్యావ్యవస్థ పతనం అంచుపై వేలాడుతోంది.అటు ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం కాకపోవడం, ఇటు ప్రయివేటు విద్యావ్యవస్థ కూడా దెబ్బతింటుండంతో ఇక ప్రభుత్వం సాధించేదేమిటి? భావి భారత విద్యార్థులకు గాలికొదిలేయటమే కదా! ఇప్పటికైనా ప్రయివేట విద్యా వ్యవస్థ స్థానంలో ప్రభుత్వ ఉన్నత విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దీంతోపాటు, ప్రభుత్వ కళాశాలలను అన్ని సౌకర్యాలు, ఆధునిక కోర్సులు, పూర్తి ప్యాకాల్టీతో పునరుద్ధరణ చేయాలి.పేదలకు అవసరమైన నాణ్యమైన, ఉన్నత విద్యా అవకాశాలు ప్రభుత్వ రంగంలో నే ఉచితంగా అందుబాటులోకి తేవాలి. ఇకనైనా ఫీజురీయంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీలాంటి కార్పోరేట్‌ సంస్థలను బలోపేతం చేసే విధానాలకు బదులు, అవే నిధులతో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ బడులు ఆధునీకరణ చేయడం ద్వారా దీర్ఘకాలిక నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందే అవకాశం ఉంటుంది.
ఎన్‌.తిర్మల్‌
9441864514

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -