Saturday, May 10, 2025
Homeఆటలుసెమీఫైనల్లో ఉన్నతి, ఆయుష్‌

సెమీఫైనల్లో ఉన్నతి, ఆయుష్‌

- Advertisement -

తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
తైపీ సిటీ (తైవాన్‌) : భారత అగ్రశ్రేణి షట్లర్లు నిలకడగా నిరాశపరిచే ప్రదర్శనలు చేస్తున్నా.. వర్థమాన షట్లర్లు ఉన్నతి హుడా, ఆయుష్‌ శెట్టి అదిరగొట్టారు. తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. 17 ఏండ్ల ఉన్నతి హుడా మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకోగా.. ఆయుష్‌ శెట్టి సైతం మెరుపు విజయంతో టాప్‌-4లో నిలిచాడు. చైనీస్‌ తైపీ షట్లర హంగ్‌ యి టింగ్‌పై ఉన్నతి హుడా 21-8, 19-21, 21-19తో విజయం సాధించింది. 52 నిమిషాల్లో ముగిసిన క్వార్టర్‌ఫైనల్లో ఉన్నతి తొలి గేమ్‌ను అలవోకగా గెల్చుకుంది. 11-5తో విరామ సమయానికి ముందంజ వేసిన ఉన్నతి ఆ తర్వాత సైతం అదే జోరు కొనసాగించింది. రెండో గేమ్‌లో 8-8 వరకు పోటీనిచ్చిన ఉన్నతి నెమ్మదిగా లయ కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 3-3 తర్వాత పుంజుకున్న ఉన్నతి 11-5తో విరామ సమయానికి విలువైన ఆధిక్యం సాధించింది. ఆఖర్లో 20-19తో హంగ్‌ వెంబడించినా.. ఉన్నతి 21-19తో మ్యాచ్‌ను ముగించి సెమీస్‌కు దూసుకెళ్లింది.
పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఏడో సీడ్‌ బ్రయాన్‌ యాంగ్‌ (కెనడా)పై ఆయుష్‌ శెట్టి గెలుపొందాడు. 16-21, 21-19, 21-14తో శెట్టి 71 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పైచేయి సాధించాడు. తొలి గేమ్‌ కోల్పోయిన శెట్టి.. కీలక రెండో గేమ్‌లో 11-10తో బ్రేక్‌ టైమ్‌కు ముందంజ వేశాడు. ఆ తర్వాత సైతం బ్రయాన్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. 18-18, 19-19తో ఉత్కంఠ పోరులో 21-19తో శెట్టి నిలిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం ఆయుష్‌కు ఎదురులేదు. 11-8తో ఆధిక్యంలో నిలిచిన శెట్టి.. ద్వితీయార్థంలో ప్రత్యర్థికి చిక్కలేదు. వరుస పాయింట్లతో ముందంజ వేసిన శెట్టి 21-14తో మంచి ఆధిక్యంతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. నేడు సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌, చైనీస్‌ తైపీ షట్లర్‌ చో చెన్‌తో ఆయుష్‌ శెట్టి తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో టాప్‌ సీడ్‌ జపాన్‌ షట్లర్‌ తొమోక మియజాకితో ఉన్నతి హుడా తాడోపేడో తేల్చుకోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -