ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అనిల్ అంబానీ
అమెరికా రాజకీయ వర్గాలకు చేరువైన అనిల్?
న్యూఢిల్లీ : అమెరికన్ ఫైనాన్షియర్, లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు చెందిన స్వాధీనం చేసుకున్న డివైసుల్లో లభించిన సందేశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. భారత ప్రధాని మోడీకి సంబంధించిన అంశాల్లో వ్యాపారవేత్త అనిల్ అంబానీ కీలక పాత్ర పోషించినట్టు అవి సూచిస్తున్నాయి. 2017 నుంచి 2019 మధ్య జరిగిన ఈ సందేశాల్లో.. మోడీ ఎజెండాను అమెరికా రాజకీయ వర్గాలకు చేరవేయడంలో అనిల్ అంబానీ.. ఎప్‌స్టీన్‌ను మధ్యవర్తిగా ఉపయోగించుకున్నట్టు వెల్లడైంది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ‘ఎప్‌స్టీన్ లైబ్రరీ’ పత్రాల్లో అనిల్ అంబానీ-జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య జరిగిన టెక్స్ట్ సందేశాలు, ఈమెయిల్స్ బయట పడ్డాయి. ఇందులో భారత ప్రధాని మోడీ విదేశాంగ వ్యూహాలు, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ అంశాలు, అలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సన్నిహితులతో సంప్రదింపుల యత్నాలు ఉన్నట్టు ‘ది వైర్’ వెల్లడించింది.
ఈ డాక్యుమెంట్స్ ప్రకారం.. 2019 మేలో, భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఎప్‌స్టీన్ న్యూయార్క్‌లోని తన నివాసంలో అనిల్ అంబానీతో సమావేశమయ్యాడు. ఈ రోజే ఎప్‌స్టీన్… ట్రంప్ మాజీ ప్రధాన వ్యూహకర్త స్టీవ్ బ్యానన్‌కు పంపిన సందేశంలో ‘మోడీ పంపిన వ్యక్తితో ఆసక్తికర సమావేశం జరిగింది’ అని పేర్కొన్నాడు. అయితే మోడీ నిజంగా ఎవరినైనా పంపారా?ఆ వ్యక్తి అనిల్ అంబానీయేనా? లేక మూడో వ్యక్తి ఉన్నాడా? అనే విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. ఎప్‌స్టీన్ సందేశాల్లో మోడీకి ప్రధాన శత్రువు చైనా అని, పాకిస్తాన్ చైనా ప్రాక్సీగా వ్యవహరిస్తోందని ఆ ప్రతినిధి చెప్పినట్టు ఉంది. అలాగే ‘మోడీ పూర్తిగా మీ దృష్టికోణాన్ని అంగీకరిస్తున్నారు’ అనే వ్యాఖ్య కూడా అందులో ఉంది. అయితే అది ఎవరి దృష్టి కోణమో అన్నదానిపై స్పష్టత లేదు. ఆ సమయంలో వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటికీ.. చైనా వ్యతిరేక విధానాలతో స్టీవ్ బ్యానన్ అమెరికా కట్టుదిట్టమైన రాజకీయ వర్గాల్లో ప్రభావం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో మోడీ-బ్యాననల్‌ను కలిపే ప్రయత్నం జరిగినట్టు సందేశాలు సూచిస్తున్నాయి.
ఇజ్రాయిల్ పర్యటన ట్రంప్‌ను మెప్పించేందుకా?
2017లో మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ప్రస్తావిస్తూ.. ఎప్‌స్టీన్ ఒక ఈమెయిల్‌లో ”అది అమెరికా అధ్యక్షుడిని మెప్పించేందుకు చేసిన రాజకీయ చర్య” అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై భారత విదేశాంగా మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పందిస్తూ… ”ఇవి ఒక నేరస్తుడి ఊహాగానాలే తప్ప.. వాటికి ఎలాంటి ప్రామాణికతా లేదు” అని కొట్టి పారేసింది.అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనిల్ దీరూభారు అంబానీ (ఏడీఏ) గ్రూప్.. మోడీ పాలనలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భాగస్వామిగా మారడం వివాదాస్పదమైంది. అంతేగాక 2024లో సెబీ అనిల్ అంబానీపై ఐదేండ్ల నిషేధం విధించింది. 2025-26లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. రుణ మోసాల కేసుల్లో మాజీ డైరెక్టర్ కూడా అరెస్టయ్యాడు. కాగా తాజా ఆరోపణలపై అనిల్ అంబానీ నుంచి ఇప్పటి వరకూ అధికారిక స్పందన రాలేదు. ప్రధాని కార్యాలయం లేదా కేంద్రం కూడా ఎప్‌స్టీన్ సందేశాలను ‘నిరాధారమైన ఆరోపణలు’గా కొట్టిపారేసే ధోరణినే కొనసాగిస్తోంది.
2017 నుంచే మొదలైన సంబంధం
అనిల్ అంబానీ-ఎప్‌స్టీన్ మధ్య సంబంధం 2017 ఫిబ్రవరిలో మొదలైనట్టు రికార్డులు చెప్తున్నాయి. అదే ఏడాది మార్చిలో అంబానీ ”భారత్-అమెరికా సంబంధాలు, రక్షణ సహకారం విషయంలో వైట్ హౌస్‌ను ఎలా ఎదుర్కోవాలి?” అని ఎప్‌స్టీన్‌ను సలహా కోరాడు. ఎప్‌స్టీన్ స్పందిస్తూ.. ఇది సిద్ధాంతాల విషయం కాదు, లావాదేవీ పద్దతి (టిట్ ఫర్ టాట్) అని పేర్కొన్నాడు. దీనికి అంబానీ.. ”భారత మార్కెట్ ఏది పని చేస్తే అది” అని సమాధానం ఇచ్చాడు. అదే సమయంలో జారెడ్ కుష్నర్, స్టీవ్ బ్యానన్‌లతో భేటీ ఏర్పాటు చేయాలని అంబానీ కోరినట్టు సందేశాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఏర్పాట్లలో కూడా ఎప్‌స్టీన్ పాత్ర ఉందని ఈ పత్రాలు సూచిస్తున్నాయి.



