అడుగు ముందుకు పడని స్థానికం
నెలన్నరపాటు ఎదురుచూపులే..!
లోకల్ బాడీ ఎన్నికలపై సర్కారు మల్లగుల్లాలు
స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు
జూబ్లీహిల్స్‌పైనే ప్రస్తుతానికి ఫోకస్
క్యాబినెట్‌ను సమావేశపరిచే యోచనలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. న్యాయస్థానం నుంచి తీర్పునకు సంబంధించిన పూర్తి స్థాయి కాపీ వచ్చిన తర్వాత స్పందిస్తాం.. ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…’ గురువారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన వివరణిది. కానీ శుక్రవారం ఎలాంటి కాపీ తమకు అందకపోవటంతో ముఖ్యమంత్రి కార్యాలయం, పంచాయతీరాజ్‌శాఖ, ఎస్‌ఈసీ మల్లగుల్లాలు పడుతున్నాయి. నిన్నటిదాకా ఎన్నికలు పెడదాం.. స్థానికంలో పాగా వేద్దాం.. అంటూ హడావుడి చేసిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు సందిగ్దంలో పడ్డారు. ‘హైకోర్టు కేసును వాయిదా వేసిన నేపథ్యంలో నెలన్నరపాటు ఎదురు చూపులు తప్పేట్టు లేదు…’ అని ప్రభుత్వం భావిస్తోంది.
వాస్తవానికి హైకోర్టు తీర్పుకు సంబంధించిన పూర్తి కాపీ శుక్రవారమే ప్రభుత్వానికి అందాల్సి ఉంది. అయితే దాన్ని నేరుగా ముఖ్యమంత్రికే అందిస్తారని తెలిసింది. మంత్రులకు కూడా దాన్ని ఇవ్వబోరని సమాచారం. కాగా సీఎం రేవంత్ శుక్రవారం నిజామాబాద్ పర్యటనకు వెళ్లొచ్చారు. ఆయన అందుబాటులో లేకపోవటంతోనే కాపీని అందించలేదని హైకోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కారణం రీత్యానే ఇటు ముఖ్యమంత్రి కార్యాలయంగానీ, అటు పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులుగానీ, ఎస్‌ఈసీ గానీ దీనిపై స్పందించలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి …లోకల్ ఫైట్‌పై అందుబాటులో ఉన్న మంత్రులు, కాంగ్రెస్ సీనియర్లు, తన సన్నిహితులతో సమాలోచనలు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన ‘యూనియన్ ఆఫ్ ఇండియా (కేంద్ర ప్రభుత్వం)-ఇంద్రసహానీ’ కేసును ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహారాష్ట్రలో బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చినప్పుడు ఈ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. కేవలం విద్య, ఉద్యోగావకాశాలకు సంబంధించి మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చంటూ సుప్రీం ఉటంకించిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయ నిపుణులు సీఎం దృష్టికి తీసుకుపోయారు.
స్థానిక సంస్థలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న 27 శాతం రిజర్వేషన్లను కోర్టు కొట్టివేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళదామంటూ సీఎం రేవంత్ న్యాయ నిపుణులను అడిగినట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైకోర్టు చెప్పినట్టు ఆరు వారాల వరకూ ఆగటం తప్ప వేరే మార్గం కనబడటం లేదని వారు వివరణిచ్చారు. ఈ అంశాలన్నింటిపై చర్చించి, ఒక నిర్ణయానికి రావటానికి వీలుగా త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. ఏదేమై నా హైకోర్టు తీర్పు పూర్తి కాపీ ప్రభుత్వానికి చేరిన తర్వాతేగానీ దీనిపై మరింత స్పష్టత రానుంది. కాగా ప్రస్తుతానికి అధికార పార్టీ దృష్టంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతు న్నాయి. ఆ ఉప ఎన్నిక ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్… ప్రతీరోజూ దీనిపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయా వర్గాలు వివరించాయి.