Saturday, January 31, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతెగని పంచాయితీ

తెగని పంచాయితీ

- Advertisement -

ఎజెండాలో పోలవరం – నల్లమల సాగర్‌ మినహా 12 అంశాలు చేర్చాలి
కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీకి తెలంగాణ ప్రతిపాదన
ఎజెండా లేకుండానే హాజరైన ఏపీ
వారంలో ప్రతిపాదనలు ఇవ్వాలని ఏపీకి సీడబ్ల్యూసీ చైర్మెన్‌ సూచన
అంశాలు ఖరారయ్యాకే తదుపరి భేటీ అని తేల్చిన కమిటీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) చైర్మెన్‌ అనుపమ్‌ ప్రసాద్‌ అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలో రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఎజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం, నల్లమల సాగర్‌ ప్రాజెక్టును ఎజెండాలో చేర్చొద్దని కోరింది. కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రిబ్యూనల్‌-2(కేడబ్ల్యూ డీటీ) తీర్పు వచ్చే వరకు కృష్ణా నీటిలో 50 శాతం నిటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలకు సంబంధించి అనేక సమస్యలు, వివాదాలు కొనసాగుతున్నాయనీ, వాటన్నింటిని ఎజెండాలో లిఖిత పూర్వకంగా కమిటీలో ప్రస్తావించామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జ మీడియాకు తెలిపారు. అయితే ఏపీ అధికారులు ఎలాంటి ఎజెండా లేకుండా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ చేసిన ప్రతిపాదనలకు సైతం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న సీడబ్ల్యూ సీ చైర్మెన్‌ వారంలోగా ఎజెండా అంశాలు ఖరారు చేసి లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఏపీకి సూచించారు. అంశాలు ఖరారయ్యాక భేటీ తేదీని నిర్ణయిస్తామని ఆయన ఇరు రాష్ట్రాలకు తెలియజేశారు.

పోలవరం-నల్లమల సాగర్‌ అంశాన్ని ఎజెండాలో పెట్టొద్దు : తెలంగాణ తెలంగాణ జలవనరుల శాఖ
ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జ మాట్లాడుతూ ఏపీ నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్‌ అంశాన్ని కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ ఎజెండాలో చేర్చొద్దని స్పష్టం చేశామన్నారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు సంబంధించి చర్చించే ఎజెండాను నిర్ణయించేందుకే మొదటి సమావేశం జరిగిందన్నారు. కేవలం గోదావరి, కృష్ణా నీటి వివాదాలకు సంబంధించి అంతర్రాష్ట్ర అంశాలపై ఈ సమావేశం జరిగిందని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ తరపున తొలి సమావేశంలో ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని, వారంలో సమర్పిస్తామని ఏపీ అధికారులు చెప్పినట్టు రాహుల్‌ బొజ్జ తెలిపారు.

అయితే ఏపీ ప్రతిపాదనలు ఇచ్చాకే సీడబ్ల్యూసీ అంశాల వారీగా ఎజెండా నిర్ణయిస్తుందని, వాటి ఆధారంగా కమిటీ రెండో సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నది జలాలకు సంబంధించి మొత్తం కేటాయింపులపై ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయని రాహుల్‌ బొజ్జా తెలిపారు. ఒకవేళ కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీలో ఈ సమస్యలను పరిష్కరించుకోగలిగితే, సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్‌ నుంచి అభ్యంతరాలను వెనక్కి తీసుకోవచ్చన్నారు. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ అధికారులు, కష్ణానది యాజమాన్య మండలి (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్య మండలి (జీఆర్‌ఎంబీ), నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ చైర్మెన్లు, కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్‌, తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌, ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ అంజద్‌ హుస్సేన్‌, కేంద్ర రాష్ట్ర సమన్వయ అధికారి గౌరవ్‌ ఉప్పల్‌, ఏపీ జలవనరుల శాఖ అడ్వైజర్‌ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -