ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి
టెట్ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలి
పాఠశాలల మూసివేత, విలీనాన్ని వెంటనే నిలిపివేయాలి
కదంతొక్కిన ఉపాధ్యాయులు
జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైమరీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..దేశ రాజధాని ఢిల్లీలో ఉపాధ్యాయులు కదంతొక్కారు. ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఏఐజేఏసీటీవో) ఆధ్వర్యంలో గురువారం నాడిక్కడ జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. టెట్ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని, ఓపీఎస్ పునరుద్ధరించాలని, పాఠశాలల మూసివేత, విలీనాన్ని వెంటనే నిలిపివేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైమరీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యమంలో ఈ ధర్నా ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని సంఘం నేతలు తెలిపారు. పాఠశాల విద్యా రంగంలోని పలు జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘాలు మొదటిసారిగా ఒకే వేదికపైకి వచ్చి, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని సామూహిక పోరాటాన్ని ప్రారంభించాయి.
ఈ సందర్భంగా ఉత్తేజకరమైన ప్రసంగంలో ఏఐజేఏసీటీఓ ఏర్పాటును ఓ ముందడుగుగా నేతలు పేర్కొన్నారు. విభిన్న ఉపాధ్యాయ సంఘాల మధ్య సాధించిన ఐక్యతను ప్రశంసించారు. ఈ ఐక్య వేదిక దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల సమిష్టి స్వరం, సంకల్పాన్ని సూచిస్తుందని తెలిపారు. టెట్ సమస్య, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ సమాజాన్ని అనుకోకుండా ఏకం చేసిందని అన్నారు. విద్యలో నాణ్యతా ప్రమాణాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని అంగీకరిస్తూనే, ఉపాధ్యాయులు ఈ తీర్పునకు సంబంధించి కఠినమైన చిక్కులను ఖండించారు. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న (ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు) ఉపాధ్యాయులు రెండేండ్లలోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు తీర్పు నిర్దేశిస్తుందని, అలా చేయకపోతే వారు సర్వీస్ నుంచి తొలగించబడతారని పేర్కొనడం దారుణమని అన్నారు.
అదే విధంగా ఉద్యోగ విరమణ చేసే వరకు అంటే ఐదు లేదా అంతకంటే తక్కువ సంవత్సరాలు ఉన్న ఉపాధ్యాయులు సర్వీస్‌లో కొనసాగడానికి టెట్ నుంచి మినహాయింపు పొందుతారని, అయితే అర్హత లేకుంటే పదోన్నతులకు అనర్హులుగా ఉంటారని కూడా సుప్రీం పేర్కొనడం అన్యాయమని తెలిపారు. ఇది విద్యా హక్కు చట్టం అమలు తరువాత జారీ చేయబడిన 2010 ఆగస్టు 23 నాటి అసలు ఎన్సీటీఈ నోటిఫికేషన్‌కు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇది ఆ తేదీ తరువాత నియమించబడిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్‌ని తప్పనిసరి చేసిందని, అన్ని సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరించాయని, గత 15 ఏండ్లుగా సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ కి హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను సుప్రీంకోర్టు ముందు సమర్పించడంలో ఎన్సీటీఈ విఫలమైందని విమర్శించారు.
దీని ఫలితంగా ప్రతికూల పరిణామాలు సంభవించాయని పేర్కొన్నారు. ఈ ధర్నాకు సి.ఎన్ భారతి (ఎస్‌టీఎఫ్‌ఐ), కె నరసింహారెడ్డి (ఏఐఎస్‌టీఎఫ్), బసవరాజ్ గురికార్ (ఏఐపీటీఎఫ్), సి.ఎల్ రోజ్ (ఏఐఎఫ్‌టీఓ)లతో కూడిన అధ్యక్షవర్గం అధ్యక్షత వహించింది. ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి. శివదాసన్ (సీపీఐ(ఎం), సెల్వరాజ్ (సీపీఐ), కుమార్ నాయక్ (కాంగ్రెస్), రాజారాం సింగ్ (సీపీఐ(ఎంఎల్)) సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులకు తమ మద్దతు ప్రకటించారు. పార్లమెంటులో ఈ సమస్యలను లేవనెత్తుతామని హామీ ఇచ్చారు.
సీపీఐ జాతీయ నాయకులు కె. నారాయణ, తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ పి. శ్రీపాల్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, ఏఐజేఏసీటీఓ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి (ఎస్‌టీఎఫ్‌ఐ),జి. సదానందం గౌడ్ (ఏఐఎస్‌టీఎఫ్), కమల కాంత్ త్రిపాఠి (ఏఐపీటీఎఫ్), రామ్మూర్తి స్వామి (ఏఐఎఫ్‌టీఓ), పి. దామోదర్ రెడ్డి (ఏఐఎఫ్‌టీఓ), ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు అమియాకుమార్ మొహంతి, ఏఐఎఫ్‌యూసీటీఓ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ కుమార్, ఏఐఎఫ్‌ఆర్ టీఈ కార్యదర్శి ప్రొఫెసర్ వికాస్ గుప్తా, ఏఐఎస్‌ఈసీ కార్యదర్శి శారద దీక్షిత్, ఏఐఐటీఏ అధ్యక్షుడు రిజ్వాన్ , ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపీమూర్తి, తదితరులు ప్రసంగించారు.
ఈ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఏఐజేఏసీటీఓ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైతే, ఈ ఉపాధ్యాయ ఐక్య ఫ్రంట్‌ను మరింత బలోపేతం చేస్తామని, రాబోయే రోజుల్లో మరింత శక్తివంతమైన చర్యలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఏఐజేఏసీటీఓ ఉపాధ్యాయులు, విద్యా కార్యకర్తలు, మద్దతు దారులను ఐక్య ఉద్యమంలో చేరాలని పిలుపునిచ్చింది. ధర్నాలో టీఆర్‌టీఎఫ్ అధ్యక్షులు కటకం రమేశ్, ఆర్‌యూపీపీటీఎస్ అధ్యక్షుడు సి.జగదీశ్, పీఆర్‌టీయూ తెలగాణ అధ్యక్షులు మహమ్మద్ అబ్దులా తదితరులు పాల్గోన్నారు.
డిమాండ్లు
-ఆర్‌టీఈ చట్టాన్ని సవరించడంతో, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల పక్షాన ఉండే బాధ్యతను నెరవేర్చాలి.
-కొత్త పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్)కు వ్యతిరేకంగా 22 ఏండ్ల పోరాటం తరువాత ఇటీవల ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్)ను తిరస్కరించాలి. పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలి.
-కేంద్రీకరణను వేగవంతం చేస్తూ పేదలకు విద్యను అందుబాటులో లేకుండా చేస్తున్న ఎన్‌ఈపీ-2020 అన్ని ప్రజా వ్యతిరేక, వాణిజ్యీకరణ అంశాలను ఉపసంహరించుకోవాలి.
-పాఠశాలల మూసివేత, విలీనాన్ని వెంటనే నిలిపివేయాలి (గత ఐదేండ్లలో లక్షకుపైగా పాఠశాలలు మూసివేశారు)
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలి.
-జీతం పొందే ఉద్యోగులపై ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించాలి.
-తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వారికి కనీస వేతనాలను అమలు చేయాలి.



