– వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు
– పలు జిల్లాల్లో ప్రజావాణిలో వినతిపత్రాలు
నవతెలంగాణ-విలేకరులు
సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, నిరసనలు తెలిపారు. హనుమకొండలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు బొట్ల చక్రపాణి ఆధ్వర్యంలో భగత్ సింగ్ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో కార్పొరేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. నెల రోజుల్లో పరిష్కారం చేయకపోతే మున్సిపాలిటీ ముట్టడిస్తామని హెచ్చరించారు.
పెండింగ్ స్కాలర్‌షిప్స్ కోసం ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రియంబర్స్‌మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలోకామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కలెక్టరేట్‌లను ముట్టడించారు. కామారెడ్డి జిల్లాలో పోలీసులు ముట్టడిని అడ్డుకోవడంతో నాయకులు రోడ్డుపై బైటాయించి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజినీకాంత్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సుమారు 8 వేల కోట్లకుపైగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో పెట్టి విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు.
కల్లుగీత కార్మికుల సమస్యలపై..
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో నిషేదిత మత్తు పదార్థాలతో కల్తీ తెల్ల కల్లు తయారీ చేసి విక్రయిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. కల్తీ కల్లు తయారీని అడ్డుకుని, కల్లు కాంపౌండ్‌ను మూసివేయాలని ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షిషాకు వినతిపత్రం అందజేశారు. సంగారెడి,్డ సిద్దిపేట జిల్లాల్లో కల్లు గీత వృత్తిలో ప్రమాదానికి గురైన వారికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులు కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం కలెక్టర్లు ప్రావీణ్య, కె.హైమావతికి ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేశారు. హనుమకొండ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. జనగామలో కల్లుగీత కార్మికులు నిరాహార దీక్ష చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్ల సమస్యలపై..
సీఐటీయూ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలపై ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈఎస్‌ఐ కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరారు.
గెస్ట్ లెక్చరర్స్ సమస్యలపై..
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న గెస్ట్ లెక్చరర్స్‌ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (డీజీఎల్‌ఏ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బి.రాహుల్, శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.