వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్8
నవతెలంగాణ-అహ్మదాబాద్
దక్షిణాఫ్రికా దంచికొట్టింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అజేయ జోరు కొనసాగిస్తోంది. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన సూపర్8 గ్రూప్-1 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఓపెనర్ ఎడెన్ మార్‌క్రామ్ (82 నాటౌట్, 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీకి తోడు క్వింటన్ డికాక్ (47, 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రియాన్ రికెల్టన్ (45 నాటౌట్, 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో 177 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 16.1 ఓవర్లలోనే ఊదేసింది. మరో 23 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
సూపర్8 దశలో వరుసగా రెండో విజయం సాధించిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్ బెర్త్ లాంఛనం చేసుకుంది. అంతకముందు, తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. రొమారియో షెఫర్డ్ (52 నాటౌట్, 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), జేసన్ హోల్డర్ (49, 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కరీబియన్లను ఆదుకున్నారు. సఫారీ పేసర్లు లుంగి ఎంగిడి (3/30), కగిసో రబాడ (2/22), కార్బిన్ బాష్ (2/31) రాణించారు. ఛేదనలో అజేయ అర్థ సెంచరీ సాధించిన ఎడెన్ మార్‌క్రామ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సూపర్8 దశ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది.
పేసర్ల ప్రతాపం
తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన కరీబియన్లకు సఫారీ పేసర్లు కోలుకోలేని దెబ్బకొట్టారు. బ్రాండన్ కింగ్ (21), షారు హోప్ (16) తొలి వికెట్‌కు 2.2 ఓవర్లలోనే 29 పరుగులు జోడించినా.. లుంగిసాని ఎంగిడి, కగిసో రబాడ వరుస వికెట్లతో బ్యాటింగ్ లైనప్‌ను పడగొట్టారు. షిమ్రోన్ హెట్‌మయర్ (2), రోవ్‌మాన్ పావెల్ (9), రూథర్‌ఫోర్డ్ (12), మాథ్యూ ఫోర్డె (11) తేలిపోవటంతో 83/7తో వెస్టిండీస్ వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఈ దశలో జేసన్ హోల్డర్ (49), షెఫర్డ్ (52 నాటౌట్) ఎనిమిదో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. విండీస్‌కు గౌరవప్రద స్కోరు అందించారు.
ముగ్గురే కొట్టేశారు
విండీస్ పడుతూ లేస్తూ 176 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు మార్‌క్రామ్ (82 నాటౌట్), డికాక్ (47) 8 ఓవర్లలోనే 95 పరుగులు జోడించి అదిరే ఆరంభం అందించారు. అర్థ సెంచరీ ముంగిట డికాక్ అవుటైనా.. రికెల్టన్‌తో కలిసి మార్‌క్రామ్ లాంఛనం ముగించాడు. 27 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన మార్‌క్రామ్ దక్షిణాఫ్రికాకు అలవోక విజయం అందించాడు.



