ఈదురుగాలుల ధాటికి
నేలకొరిగిన వరి, మొక్కజొన్న
మామిడి రైతులకు తీవ్ర నష్టం
నిజామాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన పసుపు కుప్పలు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/ఆదిలాబాద్/ కరీంనగర్
పంటలు చేతికి వస్తున్న తరుణంలో రైతుల ఆశలను అకాల వర్షం ‘తుంచేసింది’. సోమవారం అర్ధరాత్రి వేళ..ఒక్కసారిగా వేగంగా వీచిన ఈదురుగా లులు, వర్షం, వడగండ్లతో పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొట్టదశలో, కోతకు సిద్ధమై ఉన్న వరి నేలవాలడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. దీంతోపాటు ఈదురుగాలుల ధాటికి మామిడి కాయ లు రాలిపోయాయి. మొక్కజొన్న, నువ్వు పంటపై సైతం వర్షం ప్రభావం చూపింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో కొంత మేర పసుపు నీటమునిగింది. రాశులుగా పోసి ఉండగా.. అడుగు భాగంలో నీళ్లు చేరడంతో రైతులు కుప్ప నుంచి తడిచిన దాన్ని వేరు చేసి ఆరబెట్టారు. ఇప్పటికే ధర తక్కువ వస్తున్న తరుణంలో అకాల వర్షంతో ఇంకేమి కొర్రీలు పెడతారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వేళ 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచగా.. అనంతరం వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి పంటలకు నష్టం వాటిల్లగా.. చెట్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగాయి. ప్రస్తుతం వరి పొట్టదశలో, కోత దశకు సిద్ధంగా ఉండగా.. నేలకొరిగింది. ఇదివరకే పలు చోట్ల కోతలు పూర్తయి ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లోని 76 గ్రామాల్లో వర్షం వల్ల మొత్తం 2557 ఎకరాల మేర వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో అంతకు ఎక్కువే నష్టపోయినట్టు రైతులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల్లో జొన్న పంట నేలకొరిగింది. రాజంపేట్ మండల కేంద్రంలోని పశు వైద్యశాలలోకి వర్షపు నీరు చేరింది.
రాలిన మామిడి
జగిత్యాల జిల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులు, మోస్తరు వర్షం కురిసింది. ముఖ్యంగా మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాయికల్ మండలంలో అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. సుమారు 3,180 ఎకరాల్లో మామిడి పంట నష్టపోయింది. గాలుల తీవ్రతకు మామిడి కాయలు రాలిపోవడంత పాటు కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అదే విధంగా 75 ఎకరాల్లో నువ్వుల పంట, 18 ఎకరాల్లో వరి, 202 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. భీమారం, పెగడపల్లి, ధర్మపురి మండలాల్లో మామిడి తోటలు, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మంగళవారం వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలంలోని మంగళపల్లి, చిట్యాలపెళ్లి, దేశాయిపేట, గుమ్లాపూర్, ఆర్నకొండ, కాట్నపల్లిలో సోమవారం అర్ధరాత్రి గాలివానకు మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంతోపాటు మల్యాల గ్రామంలో వడగండ్ల వాన కురిసింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి, ఎలిగేడు, ముత్తారం మండలాల్లో ఈదురు గాలులకు మొక్కజొన్న పంట నేలకొరిగింది.
గాలివాన బీభత్సం
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన మామిడి పంట నేలరాలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మందమర్రిలో సింగరేణి క్వార్టర్‌పై చెట్టు కూలడంతో నిద్రలో ఉన్న వారు స్వల్పంగా గాయపడ్డారు. చెన్నూర్, భీమారం, జైపూర్, కోటపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులు మామిడి రైతులను నిలువునా ముంచాయి. జన్నారం, దండేపల్లిలోనూ ఈదురుగాలుల ధాటికి మామిడి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. దండేపల్లి మండలం తాళ్లపేటలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. సుమారు 60 ఎకరాల్లో పంట నేలకొరిగినట్టు వ్యవసాయాధికారులు ధ్రువీకరించారు. జన్నారం మండలం రోటిగూడలో అకాల వర్షం కౌలు రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. లక్షెట్టిపేట మండలంలోని జెండావెంకటాపూర్, ఎల్లారం, వెంకట్రావుపేట్, బలరావుపేట్, ఇటిక్యాల, దౌడపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో మొక్కజొన్న పంటను జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బొరిగామ పంచాయతీ పరిధిలోని దూడగండి, వాంకిడి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి ప్రధాన రహదారిపై బారీ వృక్షాలు పడిపోయాయి. ఇంద్రవెల్లి మండలంలోని ధనోర(కె), శంకర్‌గూడ గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటల నేలకొరిగాయి. తలమడుగు మండలోని భరంపూర్ గ్రామంలో సుమారు 20 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు రైతులు తెలిపారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలో సోమవారం అర్ధరాత్రి కురిసిన ఈదురు గాలులకు భారీ వృక్షాలు, చేతికి వచ్చిన నువ్వు పంట నేలకొరిగాయి. ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్, మస్కాపూర్, ఖానాపూర్ గ్రామాల్లో భారీ వర్షానికి మొక్కజొన్నతోపాటు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సారంగాపూర్ మండలంలో సోమవారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. చేతికొచ్చిన మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి.
ఆశలు తుంచిన అకాల వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



