నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణాలు ఆగడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. వెంటనే నాణ్యమైన ఆహారం అందించేందుకు, ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యల నిరోధానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో 93 మంది విద్యార్థులు మరణించారని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో దేశానికి దిక్సూచిగా నిలిచిన వాటిని దిక్కుమాలిన స్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా పర్యవేక్షిస్తానన్న ముఖ్యమంత్రి మాటలు నీటిమూటలు కావడంతో గురుకులాలు దీనస్థితిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో విద్యార్థి మరణించగా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్‌పేట బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినీ ఆత్మహత్య చేసుకుందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా నల్లగొండ జిల్లా దేవరకొండ ఎస్టీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరగ్గా 15 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారనీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం బీసీ గురుకులంలో పురుగులన్నం మాకొద్దు అంటూ విద్యార్థులు రోడ్డెక్కారని గుర్తుచేశారు. గురుకులాల్లో జరుగుతున్న మరణాలకు, వాటి ఖ్యాతి నానాటికి దిగజారడానికి కారకులు ఎవరు? విద్యార్థులకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, రేవంత్ పాలనా వైఫల్యంతో నిర్వీర్యం అవుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరితో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పి నెలలు గడుస్తున్నా గురుకులాల దుస్థితిలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు బడికి వెళ్లి చదువుకుంటారని సంతోషించాల్సిన తల్లిదండ్రులు వారి ప్రాణాల గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ భావి తెలంగాణ భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం బలిపెడుతున్నదని ఆయన విమర్శించారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతో ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రిపాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు మెస్ చార్జీలను చెల్లించేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికి ఏడాది గడిచిందే తప్ప అమలు జరగలేదని ఆయన గుర్తుచేశారు. ఉడకని అన్నం, నీళ్ళ చారు, నాణ్యత లేని పప్పు తినలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక గుడ్లు, పండ్లు విద్యార్థులకు అందించని పరిస్థితి గురుకులాల్లో నెలకొందని గుర్తుచేశారు. ఇంకెన్ని రోజులు విద్యార్థులు పస్తులుండాలి, ఇంకెన్ని రోజులు గొడ్డు కారం అన్నం తిని కడుపు నింపుకోవాలి? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
గురుకులాల్లో ఆగని మరణాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES