Wednesday, May 7, 2025
Homeజాతీయంఫలితమివ్వని ప్రసూతి పథకం

ఫలితమివ్వని ప్రసూతి పథకం

- Advertisement -

నానాటికీ తగ్గుతున్న లబ్దిదారుల సంఖ్య
కేటాయింపులూ అంతంతే
ని’బంధనాల’తో గర్భిణులకు అందని సాయం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రసూతి ప్రయోజన పథకం ఆశించిన ఫలితాలను అందించడం లేదు. ఈ పథకం ఏటా కేవలం ఇరవై శాతం శిశు జననాలకే ప్రయోజనం చేకూరుస్తోంది. 2013వ సంవత్సరపు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద దేశంలోని గర్బిణీ స్త్రీలు అందరికీ ఆరు వేల రూపాయలు అందించాల్సి ఉంటుంది. అయితే దానికి స్వస్తి చెప్పిన కేంద్ర ప్రభుత్వం…ప్రసూతి ప్రయోజన పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం మార్చిలో రాజ్యసభకు అందజేసిన వివరాల ప్రకారం ఈ పథకం కింద 2024-25లో కేవలం 54 లక్షల మంది లబ్దిదారులకు మాత్రమే నగదు చెల్లించారు. 2022-23లో 73 లక్షల మంది లబ్దిదారులకు నగదు అందజేశారు. 2023-24లో మాత్రం కేవలం 22.5 లక్షల మంది మాత్రమే ప్రయోజనం పొందారు. దేశంలో ఏటా 270 లక్షల శిశు జననాలు జరుగుతున్నాయని అంచనా.
పెరగని కేటాయింపులు
సంవత్సరానికి 270 శిశు జననాలు జరుగుతుంటే అందులో 90 శాతం మంది శిశువుల తల్లులకు ఆరు వేల రూపాయల చొప్పున నగదు అందజేయాలంటే ప్రభుత్వానికి రూ.14,500 కోట్లు ఖర్చవుతుంది. అయితే ప్రసూతి ప్రయోజన పథకమైన ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై)కు గత కొన్ని సంవత్సరాలగా కేటాయింపులు రెండు వేల కోట్ల రూపాయలు దాటడం లేదు. లబ్దిదారులకు అందజేస్తున్న నగదు మొత్తాన్ని 2013 నుండి పెంచడం లేదు. వాస్తవానికి ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేస్తే అది మరింత తగ్గింది. ప్రసూతి ప్రయోజనాన్ని కనీసం రూ.12,000కు పెంచాలని ఆహార హక్కు కార్యకర్తలు కోరుతున్నారు.
సవాలక్ష నిబంధనలతో…
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద గర్భిణీ స్త్రీలు అందరూ ఆరు వేల రూపాయల చొప్పున ప్రయోజనం పొందుతారని 2017 ఏప్రిల్‌లో మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే కేంద్రం దీనికి బదులు పీఎంఎంవీవైని అమలు చేసి ఆర్థిక ప్రయోజనాన్ని ఐదు లక్షల రూపాయలకు తగ్గించింది. అది కూడా మొదటి బిడ్డకే. రెండో బిడ్డ బాలిక అయితేనే సాయం లభిస్తుంది. పథకం అమలుకు ప్రభుత్వం అనేక షరతులు విధించింది. మొదటి విడత సాయంగా మూడు వేల రూపాయలు పొందాలంటే ప్రెగెన్సీ నమోదు కావాల్సి ఉంటుంది. ఆరు నెలల లోపు గర్భ పరీక్ష చేయించుకోవాలి. రెండో విడత సాయంగా రెండు వేల రూపాయలు పొందాలంటే శిశు జననాన్ని నమోదు చేయించాలి. శిశువుకు వాక్సినేషన్‌ కూడా చేయించాల్సి ఉంటుంది. పైగా రేషన్‌ లేదా బీపీఎల్‌ కార్డు ఉన్న వారికే పథకం వర్తిస్తుంది. 18 సంవత్సరాల 7 నెలల కంటే తక్కువ వయసున్న మహిళకు ఈ పథకం వర్తించదు. ఆధార్‌ కార్డు, దానితో అనుసంధానించిన బ్యాంక్‌ లేదా పోస్టాఫీసు ఖాతా వివరాలు, మొబైల్‌ నెంబరు, అర్హతకు సంబంధించిన రుజువు వంటి అనేక పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఇలాంటి సవాలక్ష షరతుల కారణంగా అనేక మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందలేకపోతున్నారు. 2023-24లో కేవలం 2.7 లక్షల మంది మహిళలు (ఒక శాతం) మాత్రమే రెండో విడత ఆర్థిక సాయం పొందారు. తమిళనాడు, ఒడిషా ప్రభుత్వాలు గర్భిణులకు వరుసగా రూ.18,000, రూ.10,000 అందజేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -