– రైతులు వాత పెడతారనే
– సహకార సంఘం ఎన్నికలు రద్దు
– దమ్ముంటే ఆ ఎన్నికలు జరపాలి
– నదీజలాలపై ముఖ్యమంత్రికి అవగాహన శూన్యం
– కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నోటీసుల డ్రామా : నల్లగొండలో సర్పంచుల సన్మాన సభలో కేటీఆర్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
”రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే క్షేత్రస్థాయిలో ప్రజలు పట్టం కడతారు.. ఇది సహజం.. కానీ ప్రస్తుత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం చెందడంతో 35 నుంచి 40 శాతం బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించారు. ఇక గ్రామాల్లో నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క ఉండబోతుంది..” అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లకు మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్రకుమార్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో కేటీఆర్ ప్రసంగించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకున్నంత మెజార్టీ రాలేదన్నారు. ఈ క్రమంలో సహకార ఎన్నికలు నిర్వహిస్తే రైతులు కర్రు కాల్చి వాతపెడతారన్న భయంతో సహకార ఎన్నికలను రద్దు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్‌ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. సీఎంకు దమ్ముంటే.. వెనుక నుంచి లీకులు ఇవ్వడం మానేసి, నేరుగా కెమెరా ముందుకొచ్చి ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నోటీసుల డ్రామా ఆడుతున్నారని అన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ రైతాంగానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. జిల్లా మంత్రులకు సాగునీటిపై కనీస అవగాహన లేదని, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నదీ జలాలపై ముఖ్యమంత్రికి అవగాహన శూన్యమన్నారు. సాగునీటి శాఖ మంత్రికి నీళ్లపై కనీస అవగాహన లేదని, ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో నీళ్ల గురించి అడిగిన ప్రశ్నలకు ”నేను ప్రిపేర్ అయి రాలేదు, రేపు వచ్చి సమాధానం చెప్తాను’ అని తప్పించుకోవడాన్ని తప్పుబట్టారు. మరో మంత్రిని ఉద్దేశించి ‘వాటర్‌లో నీళ్లు’ అని మాట్లాడే అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ అడుగుతుంటే.. దానికి సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందన్నారు.
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్ నాయక్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నిన్నటి వరకు ఓ లెక్క.. రేపటి నుంచి మరో లెక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



