25 రోజుల క్రితమే మార్కెట్ యార్డ్‌కు వచ్చిన మక్కలు
ఏర్పాటు చేయని కొనుగోలు కేంద్రం
అక్కడే పోసి పడిగాపులు కాస్తున్న రైతాంగం
నవతెలంగాణ-సిద్దిపేట
సిద్దిపేట పట్టణంలో బుధవారం రాత్రి ఒంటిగంట సమయంలో కురిసిన అకాల వర్షంతో మార్కెట్‌యార్డులోని వేల క్వింటాళ్ల మక్కలు తడిసిపోయాయి. అక్కడే కాపలా కాస్తున్న రైతులు ధాన్యం పైన కవర్లు కప్పి జాగ్రత్త పడినా.. కొంత మేరకు కొట్టుకుపోయింది. గురువారం తెల్లవారు జాము నుండే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టే ప్రయత్నం చేశారు. ఓ మహిళా రైతు తమ మక్కల వద్ద నిలిచిన నీటిని బట్ట సహాయంతో తొలగించడం చూసిన వారిని ఆవేదనకు గురిచేసింది. మరో రైతు తడిసిన మక్కలను తట్టల్లో ఎత్తి దూరంగా ఆరబోశారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
సుమారుగా 25 రోజుల నుంచి మొక్కజొన్న ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చామని, అయినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని వాపోయారు. దాంతో కొంతమంది రైతులు ప్రయివేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించుకున్నారు. మరికొంత మంది రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే అమ్ముకుంటామంటూ మార్కెట్ యార్డుకు మక్కలను తరలించి ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వర్షం కురవడంతో మొక్కజొన్న తడిసి ముద్దయిపోయింది. ఈ నష్టాన్ని ఎవరు భరించాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.