Thursday, May 22, 2025
Homeప్రధాన వార్తలుఅకాల వర్షం… తడిసిన ధాన్యం

అకాల వర్షం… తడిసిన ధాన్యం

- Advertisement -

– పిడుగుల మోత.. ముగ్గురు మృతి
– మేకలు మృత్యువాత
– హైదరాబాద్‌ జలమయం
నవతెలంగాణ-కోదాడటౌన్‌/ సూర్యాపేట/ మహబూబాబాద్‌ / విలేకరులు

అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. దీంతో ముగ్గురు చనిపోయారు. మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలంలో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్ఫాలిన్లు లేక అకాల వర్షానికి ధాన్యం తడిసింది. తొర్రూర్‌ మండలం అమ్మాపురం గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, లారీల కొరత, మరోపక్క ఎప్పుడు వర్షం వస్తుందోనని భయంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కొనుగోళు కేంద్రాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఒకేసారి వర్షం రావడంతో రైతులు పంటను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. మెదక్‌ జిల్లా శివ్వంపేటలో దాన్యం తడిసింది. దౌల్తాబాద్‌లో తడిసిన ధాన్యంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజాంపేటలో వడ్లు తడిశాయి. నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కల్లాల్లోనే ధాన్యం తడిసింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురవగా.. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం హెచ్చ రికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, హైడ్రా, ట్రాఫిక్‌, విద్యుత్తు శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాన్‌హౌల్స్‌, కరెంట్‌ పోల్స్‌ విషయంలో జాగ్ర త్తగా ఉండాలని నగర వాసులను అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థి తులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆయా బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు.
మూగజీవాల మృత్యువాత
సూర్యాపేట జిల్లా కోదాడ, సూర్యాపేట మండలాల్లో పిడుగులు పడి 48 మేకలు, గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కోదాడలో 34 మేకలు, నాలుగు గొర్రెలు, సూర్యాపేట మండలంలో 10 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కోదాడ రూరల్‌ పరిధిలోని నల్లబండగూడెం, కాపుగల్లు, కూచిపూడి గ్రామాల్లో 38 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. స్థానికులు, తహసీల్దార్‌ వాజిద్‌అలీ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ రూరల్‌ పరిధిలోని నల్లబండగూడెం గ్రామానికి చెందిన బడుగుల లక్ష్మణ్‌ మేకలను పొలాలకు తోలుకెళ్లాడు. ఆ సమయంలో వర్షం పడటంతో గ్రామ శివారులోని ముండ్ర వెంకట్రావు పొలంలో వేప చెట్టు కింద మేకలను తోలి ఆయన కూడా అక్కడే ఉన్నాడు. అదే సమయంలో పిడుగు పడటంతో 34 మేకలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. వీటి విలువ రూ.4.92 లక్షలు ఉంటుంది. నారాయణపేట జిల్లా దువ్వాడ గ్రామానికి చెందిన కారంభాయి ఎల్లేష్‌ కాపుగల్లు గ్రామంలోని ముత్తవరపు మురళి పొలంలో మేకలు మేపుతుండగా పిడుగు పడింది. దాంతో నాలుగు మేకలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనలో రూ.68 వేల నష్టం వాటిల్లింది. అలాగే, కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన శెట్టి గోవిందస్వామి ఇంటి దాబాపై పిడుగుపడింది. దాంతో ఇంట్లోని ఎలక్ట్రికల్‌ వస్తువులు టీవీ, లాప్టాప్‌, ఫ్రిడ్జ్‌, వాషింగ్‌ మిషన్‌, కూలర్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. సూర్యాపేటలోని 8వ వార్డు సీతారాంపురంలో మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో మేడుదుల మల్లయ్య నల్లచెరువుతండాలో గొర్రెలు మేపుతుండగా పిడుగు పడి 10 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వాటి విలువ సుమారు రూ.1.5లక్షలుంటుందని గొర్రెల కాపరి తెలిపారు.
ముగ్గురు మృతి
మహబూబాబాద్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పిడుగులు పడి ఇద్దరు మృతిచెందారు. గూడూరు మండలం గుండెంగలో మైదం ప్రభు(38), కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఏషబోయిన చేరాలు యాదవ్‌(46) పిడుగుపాటుకు గురై మృతిచెందారు. మరోవైపు వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసింది. నల్లగొండ మండలం అప్పాజిపేట పరిధిలోని బంటుగూడెంలో పిడుగుపడి మహిళా రైతు జాల బిక్షమమ్మ(46) మృతిచెందారు. వ్యవసాయ బావి వద్ద తోటలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో ఆమెపై పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆమెకు భర్త, కుమార్తె,
కుమారుడు ఉన్నారు.
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించండి
– ధాన్యం తడవకుండా చూడండి
– వర్షాలపై సీఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిం చాలని సీఎస్‌ రామకృష్ణారావును సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందంటూ వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలనీ, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించా లని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలనీ, ట్రాఫిక్‌ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం తెలిపారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, హైడ్రా, ట్రాఫిక్‌, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -