ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, కలెక్టర్…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో పద్మ విభీషణ్ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి కాంస్య విగ్రహాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెలీకంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు లతో కలిసి ఆవిష్కరించారు.
బొల్లేపల్లి గ్రామ ముద్దుబిడ్డ, రావి గోపాల్ రెడ్డి, రమనమ్మ పుణ్య దంపతులకు సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని, తన ఇరవయ్యేళ్ల వయసులో నుంచి ప్రజా జీవితాన్ని ప్రారంభించిన గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి అని భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కొనియాడారు. భువనగిరి యంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అత్యున్నత విలువలతో ప్రజా ప్రతినిధిగా రెండు సార్లు ఎంపీగా, ఒకసారి యమ్మెల్యేగా ఎన్నికయిన రానారె నీ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నెలికంటి సత్యం, సంస్థ అద్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాసు మాట్లాడుతూ బొల్లేపల్లి గ్రామంలో పుట్టి, భారత దేశ మొట్టమొదటి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారని అన్నారు.
నెహ్రూ సూచనల మేరకు 1952 సంవత్సరంలో మొదట అడుగు పెట్టి ప్రారంభించిన జాతీయ స్థాయి అత్యున్నత నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బొల్లేపల్లి గ్రామానికి గర్వకారణమని, వారి గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రానారె ఆశయాలకు అనుగుణంగా నేటి యువతకు తెలియడానికి, రానారె గుర్తుగా, వారి నిస్వార్థ ప్రజా సేవా తత్పరత గుణం నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేఖా బాబు రావ్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు , సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, మాజీ యమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావులు పాల్గొన్నారు.