– మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ
– ట్యాంక్‌బండ్ వద్ద విగ్రహ నిర్మాణ పనుల పరిశీలన
నవతెలంగాణ – బంజారాహిల్స్
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఐమాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న లేక్‌వ్యూ పార్క్ వద్ద ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్టు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తెలిపారు. విగ్రహాల నిర్మాణ పురోగతిని మంగళవారం వారు పరిశీలించారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి ఫూలే విగ్రహావిష్కరణ ప్రారంభం, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రెండ్రోజుల ముందే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభ ప్రాంగణంలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్‌ను ‘మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్’గా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. సుమారు రూ.4 కోట్లతో ఈ విగ్రహాలు నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజల్లో వారి జీవన సందేశం, సంస్కరణలను గుర్తు చేసేలా విగ్రహాలను రూపొందించినట్టు చెప్పారు. మహిళా విద్య, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఫూలే దంపతుల కృషి ప్రేరణగా నిలుస్తుందన్నారు.
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ జిల్లా అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అదే రోజు ఉదయం గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం సభలో పాల్గొనాలని చెప్పారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇందిరాగాంధీ, బి.ఆర్. అంబేద్కర్, పివి.నరసింహారావు విగ్రహాలు ఉన్నాయని, మహనీయుల జీవిత చరిత్రను కొత్త తరానికి పరిచయం చేసే ప్రదేశంగా ఇది నిలుస్తుందని అన్నారు. ఈ మార్గానికి ‘పూలే మార్గ్’గా పేరు పెట్టాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కలెక్టర్ హరిచందన దాసరి, కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హెచ్. బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
11న ఫూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



