నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఎంపీ రాహుల్ గాంధీ, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి దినేశ్ మధ్యలో మాట్లాడడంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి తాను అధ్యక్షత వహిస్తున్నానని, సమావేశంలో ఏదైనా మాట్లాడాలనుకుంటే ముందు అనుమతి కోరాలని రాహుల్ గాంధీ సూచించారు.
దీంతో మంత్రి దినేశ్ స్పందిస్తూ.. లోక్ సభలో మీరు స్పీకర్ మాటను మన్నిస్తున్నారా? ఇప్పుడు మీ మాటను నేనెందుకు మన్నించాలని ప్రశ్నించారు. ఈ మేరకు జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిశా సమావేశంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుండగా మంత్రి దినేశ్ మధ్యలో కల్పించుకుని మాట్లాడడంతో రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా సభ అధ్యక్షుడి అనుమతి కోరాలని హితవు పలికారు. దీంతో రాహుల్ గాంధీ, దినేశ్ ల మధ్య వాగ్వాదం జరిగింది.