నవతెలంగాణ – హైదరాబాద్: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో యూపీ వారియర్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శనివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌లో కెప్టెన్ మెగ్ లానింగ్ (70), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (61) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, అనంతరం బౌలర్లు కట్టుదిట్టంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ముంబై జట్టులో అమేలియా కెర్, అమన్‌జోత్ కౌర్ చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేదనలో ముంబై టాప్ ఆర్డర్ విఫలమవడంతో 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అమేలియా కెర్ (28 బంతుల్లో 49 నాటౌట్), అమన్‌జోత్ కౌర్ (24 బంతుల్లో 41) ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించి పోరాడారు.
అయితే, వీరిద్దరి పోరాటం జట్టును గెలిపించడానికి సరిపోలేదు. యూపీ బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు సమష్టిగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కిరణ్ నవగిరె (0) డకౌట్ అయినా, కెప్టెన్ మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ ముంబై బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ రెండో వికెట్‌కు 119 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. లానింగ్ 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, లిచ్‌ఫీల్డ్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ మూడు వికెట్లు పడగొట్టింది.


