వివాహిత అనుమానాస్పద మృతి
మరో ఘటనలో భార్యపై
కత్తితో దాడి చేసిన భర్త
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఘటనలు
ఆర్థిక సమస్యలా, కుటుంబ కలహాలా?
నవతెలంగాణ-అశ్వారావుపేట/ మధిర
కుటుంబ కలహాలతో మహిళలపై దాడి ఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలకలం రేపాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందగా, ఖమ్మం జిల్లాలో భార్యపై భర్త కత్తితో దాడిచేయగా, ఆమె అపస్మారకస్ధితిలోకి వెళ్లిన ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన ముదిగొండ వెంకటేశ్వరరావు కూతురు లక్ష్మీ ప్రసన్న (33)కు 10 సంవత్సరాల క్రితం అదే మండలం ఖాన్‌ఖాన్ పేటకి చెందిన పూల నరేష్ బాబుతో వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి మూడేండ్ల పాప ఉంది. కాగా, ఆ దంపతుల మధ్య గొడవల కారణంగా మూడేండ్ల క్రితం వారి స్వగ్రామం నుంచి అశ్వారావుపేటకి వచ్చి నరేష్ బాబు సోదరి దాసరి విజయలక్ష్మి ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 23న లక్ష్మి ప్రసన్న ఇంట్లో పనిచేస్తుండగా జారిపడి నుదుటికి, గవదకు గాయాలయ్యాయి. వెంటనే ఏపీలోని రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. ఈ విషయాన్ని నరేష్ బాబు లక్ష్మిప్రసన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్‌కి వెళ్లి చూడగా తమ కూతురు వెంటిలేటర్‌పై ఉండటం చూసి ఖంగుతిన్నారు. అలాగే, ఆమె ఒంటిపై మానిన గాయాలనూ గమనించారు. కాగా, ఆమె చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు భర్త నరేష్ బాబు, అతని బంధువులు మరో ఇద్దరిపై అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మృతురాలు తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్‌హెచ్‌ఓ ఎస్‌ఐ యయాతి రాజు తెలిపారు.
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు గ్రామంలోని బీసీ కాలనీలో ఉంటున్న చిల్ల సూర్యనారాయణ ప్రయివేట్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల నేపథ్యంలో సూర్యానారాయణ, భార్య సాయి నాగలక్ష్మి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరూ ఘర్షణపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన సూర్యనారాయణ కత్తితో నాగలక్ష్మిపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు కేకలు వేసుకుంటూ ఇంట్లో నుంచి రోడ్డుపైకి వచ్చి కింద పడిపోయింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మధిర రూరల్ ఎస్‌ఐ లక్ష్మీ భార్గవి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ నిర్వహించారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సూర్యనారాయణ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉండగా ప్రస్తుతం నాగలక్ష్మి గర్భవతిగా ఉన్నట్టు సమాచారం.
ఖమ్మంలో కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES