రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్…
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందనపై అసంతృప్తి
సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేస్తుంది?
దేశ ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాలి : లోక్‌సభలో విపక్ష పార్టీల డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటులో ఇండిగో సంక్షోభంపై దుమారం చెలరేగింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు సభను వాకౌట్ చేశాయి. ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యలతో విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ లేవనెత్తిన ప్రశ్నకు ఇండిగో సంక్షోభంపై కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ‘ఇండిగో సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. దీనిపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాం. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాం. సమస్య పరిష్కారానికి వెంటనే అప్రమత్తం చేశాం. ఇండిగో సంక్షోభానికి దాని సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలోని సమస్యలే కారణం. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌డీటీఎల్) నియమాలతో ఎలాంటి సమస్యలూ లేవు. అందరితో చర్చించాకే ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను రూపొందించాం. నెల వరకూ సజావుగానే విమాన సర్వీసులు నడిచాయి. డిసెంబర్ 1న జరిగిన సమావేశంలోనూ ఇండిగో ఎలాంటి సమస్యనూ లేవనెత్తలేదు. డిసెంబర్ 3 నుంచే సమస్య మొదలైంది. ఇండిగో విమానాల రద్దు, ఆలస్యం కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం” అని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో టికెట్ ధరలు పెంచకుండా పరిమితి విధించినట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. టికెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. వీలైనన్ని ఎక్కువ విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇండిగో సంక్షోభం కారణంగా 5,86,700 విమాన టికెట్లు రద్దు అయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ గందరగోళం నడుమ సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లోక్‌సభలోనూ ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ఇండిగో సమస్యపై ప్రభుత్వం ఏం చేస్తుందో దేశ ప్రజలకు చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు… ఇండిగో సంక్షోభంపై ప్రకటన చేయనున్నట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మంగళవారం ఆ ప్రకటన ఉంటుందన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గగోరు మాట్లాడారు. పౌర విమానయాన శాఖ ఇండిగో సంక్షోభం గురించి వివరించాలన్నారు.
చాలా రోజుల నుంచి విమానాశ్రయాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డయాలసిస్ పేషెంట్లు, పెండ్లిళ్లకు వెళ్లేవారు, వృద్ధులు.. ఎంతో మంది విమానాశ్రయాల్లో చిక్కుకుపోతున్నట్టు చెప్పారు. హవాయి చెప్పులు ధరించేవాళ్లు కూడా విమానాల్లో వెళ్తున్నారని అంటారనీ, కానీ ఇప్పుడు విమాన టికెట్ ధరలు టికెట్‌పై 20 వేలు పెరిగినట్టు ఆయన తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో కాఫీ రూ.250కి అమ్ముతున్నారని, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఆయన అన్నారు. అయితే ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ఆయన అడిగారు.
ఇండిగో సంక్షోభంపై రచ్చ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



