నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
మొదటిసారి జిల్లా అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి విచ్చేసిన ఇంచార్జ్ మంత్రి దనసరి సీతక్క కి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ శాలువాతో సత్కారించి పూల బుకేతో స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్బన్ నియోజకవర్గంలో గత 11 ఏళ్ల నుండి ఒక్క ఇళ్ళు కూడా గరిబోనికి లబ్దిచేకురాలేదని అన్నారు.
మొదటి విడతలోనే అర్బన్ నియోజకవర్గనికి 3500 ఇండ్లు పూర్తి చేయాలనీ, జాగా లేని పేదలకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు. గత సంవత్సరం హౌసింగ్ మినిస్టర్ ఇదే కలెక్టరేట్లో సమీక్షా నిర్వహించి దసరాకే ఇండ్లు మంజూరు చేస్తామని, ఇప్పటికి అతి, గతి లేదన్నారు. మూడు నెలలో ప్రభుత్వం చొరవ తీసుకొని 3500 ఇందిరమ్మ ఇండ్ల భర్తీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరమ్మత్తులు చేసిలబ్దిదారులకు పంపిణి చేయకపోతే ప్రజల తరుపున ఉద్యమం చేపడతాం అన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్షకు పునుకుంటాం అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం అవుతుందన్నారు. రోజుకి 2 వేల మంది వస్తున్నా ఆస్పత్రిలో లిఫ్టులు పనిచేయడం లేదని, స్కానింగ్ యంత్రాలు సరిగా పనిచేయడం లేదని, వైద్యుల కొరత, వివిధ సమస్యల వలయంగా మారిన సివిల్ ఆస్పత్రిపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలన్నారు. అర్బన్ నియోజకవర్గం పలు సమస్యల పైన ఇంచార్జ్ మంత్రికి వినతిపత్రం అందజేశారు.