రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో జరగబోయే ఎన్నికల్లో ఆధిక్యం సాధించేందుకు పాలక, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గడిచిన పన్నెండేళ్లలో దాదాపు పదేళ్లు బీఆర్‌ఎస్ పాలించగా, ప్రస్తుతం రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. పదేళ్ల పాలనను రెండేళ్ల పాలనతో పోల్చలేము. కానీ, ఈ రెండు ప్రభుత్వాల పాలనా దిశను పరిశీలిస్తే ఒకే విధమైన ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. పట్టణ స్థానిక సంస్థలకు తగిన నిధులు కేటాయించకపోవడం, స్వయం పాలనకు అవసరమైన అధికారాలు ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వమే అన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మున్సిపాలిటీలు ‘ఉత్సవ విగ్రహాలుగా’ మారిపోయాయి. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర బడ్జెట్‌లో మున్సిపల్ శాఖకు కేటాయింపులు సగటున ఐదు శాతం మాత్రమే కాగా, వాస్తవ ఖర్చు రెండు శాతానికి పరిమితమైంది.
రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా యాభై శాతానికి చేరుతున్నప్పటికీ, నిధుల కేటాయింపులో మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. పట్టణ జనాభా పెరుగుదల తమ అభివృద్ధి ఫలితమేనని గత పాలకులు చెప్పుకున్నప్పటికీ, ఆ పట్టణాల అవసరాలకు సరిపడా నిధులివ్వలేదు. అప్పులు చేసి అభివృద్ధి చేసుకోవాలని జిహెచ్‌ఎంసీకి కేటీఆర్ సూచనలిచ్చారు. ఫలితంగా ఒకప్పుడు రిజర్వ్ నిధులతో కళకళలాడిన జిహెచ్‌ఎంసీ, నేడు వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర బడ్జెట్ ఏడాదికేడాది భారీగా పెరిగినా,మున్సిపల్ శాఖకు కేటాయింపులు శాతంలో చూస్తే చాలా తక్కువగానే కొనసాగాయి. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, కేటాయించిన నిధులను కూడా పూర్తి స్థాయి లో ఖర్చు చేయకపోవడం. ఇది పట్టణ స్థానిక సంస్థల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనం. దీన్నిబట్టి రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా దాదాపు యాభై శాతానికి చేరుకున్నప్పటికీ, పట్టణాలకు సంబంధించిన మున్సిపల్ శాఖకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రకటనలెక్కువ..ఫలితాలు తక్కువ
కాంగ్రెస్ పాలనలో మున్సిపల్ శాఖకు నిధుల కేటాయింపులు పెరిగినప్పటికీ, వాటి వాస్తవ వినియోగంపై ఇంకా స్పష్టమైన లెక్కలు రావాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు, పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అనేక ప్రకటనలు చేసింది. మూసీనది అభివృద్ధి, మెట్రో రైల్ రెండోదశ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ వంటి ప్రతిపాదనలు వెలువడ్డాయి.రాష్ట్రంలో 26 అర్బన్ డెవలప్మెంట్ అథరిటీలను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని ఎనభై శాతం ప్రాంతాన్ని వీటి పరిధిలోకి తీసుకొచ్చారు. ఇది ప్రణాళికాబద్ధ అభివృద్ధి కోసమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ ప్రయత్నాలు ఎక్కువగా కాగితాలకే పరిమితమయ్యాయి.
‘తెలంగాణ రైజింగ్-2047’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికను ప్రకటించింది. ఔటర్‌రింగ్ రోడ్డులోపల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ(సియుఆర్‌ఈ), ఔటర్‌రింగ్ రోడ్డుకు-రీజినల్ రింగ్‌రోడ్డుకు మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజినల్ ఎకానమీ (పియుఆర్‌ఈ), మిగిలిన ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చరల్ రీజినల్ ఎకానమీ (ఆర్‌ఎఆర్‌ఈ)గా విభజించింది.ఈ ప్రణాళికకు ముందు అధికార యంత్రాంగం సమీక్షలు నిర్వహించినట్టు చెప్పినా, వాటికి సంబంధించిన నివేదికలను ప్రజల ముందుకు తీసుకురాలేదు. ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండానే ఈ ప్రణాళిక రూపొందించింది వాస్తవం. చేసింది ఆన్‌లైన్ సర్వే మాత్రమే, ఇది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించదు. మొత్తం ప్రణాళిక కన్సల్టెంట్ల కనుసన్నల్లోనే ఇది రూపొందినట్టుగా కనిపిస్తోంది.
ఫ్యూచర్ సిటీ, మూసీప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్?
భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రకటన. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథరిటీ (ఎఫ్‌సిడిఎ) ఏర్పాటు చేసి, లక్షల ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్ కిందకు తీసుకొచ్చింది. పారిశ్రామిక క్లస్టర్లు, మెట్రో కనెక్టివిటీ, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, భారీ రహదారుల పేరుతో భూసేకరణ జరుగుతోంది.కానీ, ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా పెట్టుబడుల ఆకర్షణ, రియల్ ఎస్టేట్ అభివృద్ధి లక్ష్యంగానే కనిపిస్తోంది. రైతుల నుండి సేకరించిన భూములపై ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాల భూములను చౌకగా కట్టబెట్టే ప్రయత్నమే ప్రధానంగా కనిపిస్తున్నది. మూసీనది పునరుద్ధరణకు ఎవరికీ అభ్యంతరం లేదు. కాలుష్య నివారణను అందరూ కోరుకుంటున్నారు.
కానీ,ఈ ప్రాజెక్ట్ పేరుతో నది పరిసరాల్లోని మురికివాడలను తొలగించడం, పేదల ఇళ్లను కూల్చివేయడం, సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్, టూరిజం ప్రాజెక్టులకు భూములు అప్పగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పేదలకు ప్రత్యామ్నాయ నివాసాలపై ప్రభుత్వం చెప్పే హామీలపై ప్రజలకు విశ్వాసం లేదు.పట్టణ అభివృద్ధి విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. స్మార్ట్ సిటీస్, అమృత్, అమృత్-2.0 వంటి పథకాల ద్వారా నిధులు పొందాలంటే రాష్ట్రాలు తప్పనిసరిగా ‘పట్టణ సంస్కరణలు’ అమలు చేయాలని షరతులు విధిస్తోంది. ఈ సంస్కరణల అసలు లక్ష్యం పట్టణ సేవలను క్రమంగా ప్రయివేటీకరించడం, ప్రజలపై పన్నులు, చార్జీలు పెంచడం, స్థానిక సంస్థలను మార్కెట్ ఆధారిత వ్యవస్థలుగా మార్చడమే.
మౌలిక వసతుల సంక్షోభం
ఇటీవల కురిసిన వర్షాలు పట్టణాల్లోని మౌలిక వసతుల లోపాలను బయటపెట్టాయి. డ్రెయినేజీ వ్యవస్థల వైఫల్యం వల్ల నగరాలు, పట్టణాలు నీటమునిగాయి. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పాలనా వైఫల్యం. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల హామీ పూర్తిగా అమలు కాలేదు. కట్టిన ఇళ్లను కూడా అన్ని అర్హులకు కేటాయించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టణాల్లో పరిమితంగానే ఉంది. రేషన్ కార్డుల పంపిణీ జరిగినా, అర్హులందరికీ అందలేదు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న మురికివాడలు, గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలు, క్రమబద్ధీకరణపై ప్రభుత్వ స్పందన దాదాపు కనిపించడం లేదు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, ఉచిత గ్యాస్ సిలిండర్లు కొంతమేర ఉపశమనం కలిగించినప్పటికీ, బస్సుల సంఖ్య పెరగకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. పారిశుధ్యం, కాలుష్యం, అధ్వాన్నపు రోడ్లు, వీధి దీపాల సమస్యలు పట్టణ ప్రజల జీవితాన్ని నిత్య సమస్యలుగా మార్చేశాయి. మురికి వాడల గుర్తింపు, అప్‌గ్రేడేషన్ అంశం ప్రభుత్వ అజెండాలోనే లేకుండా పోయింది.
అవినీతి, నేరాలు, భయభ్రాంతి
మౌలిక వసతుల సంక్షోభంతో పాటు పట్టణాల్లో మరో తీవ్రమైన సమస్య వేళ్లూనుకుంటోంది-అధికార యంత్రాంగంలో అవినీతి. చిన్న పనికైనా లంచం తప్పని పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడిని పీల్చి పిప్పి చేస్తున్న వ్యవస్థగా పాలన మారిపోయింది. పట్టణాల్లో భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయి. అధికారుల మౌన సహకారంతోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు కొత్తవి కావు. నేరాలు పెరుగుతున్నాయి. మహిళలపై లైంగికదాడులు, వేధింపులు ఆందోళన కలిగించే స్థాయికి చేరాయి. రాత్రి వేళ పట్టణాల్లో భద్రత అనేది మాటలకే పరిమితమైంది.ఇదే సమయంలో గంజాయి, డ్రగ్స్ వాడకం పట్టణ యువతను, విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విద్యా సంస్థల చుట్టూ డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోంది.రాజకీయాల్లో డబ్బు, నేరస్తుల ప్రాబల్యం పెరుగుతోంది. ఇది పక్కదారి రాజకీయాల వల్ల కాదు- ప్రధాన రాజకీయ పార్టీలే ఈ ధోరణిని ప్రోత్సహిస్తున్నాయి. టిక్కెట్ల నుంచి పదవుల వరకు డబ్బు, బలం కీలకంగా మారినప్పుడు పాలన ఎలా ప్రజల పక్షాన ఉంటుంది?
నిజమైన పరిష్కారమేమిటి?
తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలకు కావాల్సింది నిధులు,అధికారాలు, స్వయం పాలన. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ -మూడు పార్టీలు స్థానిక సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చేశాయి. రాజ్యాంగంలోని 74వ సవరణ కాగితాల్లో కాకుండా నేలమీద అమలవ్వాలి. నిధులు లేని స్థానిక సంస్థలు, అధికారాలు లేని ప్రజాప్రతినిధులు ఇవి ప్రజాస్వామ్యానికి అవమానం తప్ప అభివృద్ధి కాదు. కేంద్రం-రాష్ట్రం ఎవరిదైనా సరే, పట్టణాల మీద నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజలు, ప్రజాప్రతినిధులు కేంద్రబిందువుగా మారాలి. కేరళ మాదిరిగా నిజమైన వికేంద్రీకరణ చేపట్టకపోతే, పట్టణ ఎన్నికలు కూడా ఒక రాజకీయ ఉత్సవంగానే మిగులుతాయి.

ఎం.శ్రీనివాస్ 9490098661



