సామాజిక, ఆర్థిక కోణంలో సాంకేతిక పరిష్కారాలు అన్వేషించాలి : ఆర్కిటెక్ట్‌ల సదస్సులో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
శరవేగంగా పెరుగుతున్న నగరీకరణ ప్రక్రియను ఒక సమస్యగా కాకుండా దేశాభివృద్ధికి ఒక అవకాశంగా చూడాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. అధిక జనాభా, పర్యావరణ సమస్యలు, కాలుష్య నియంత్రణ, వేగంగా పెరుగుతున్న నగరీకరణ వంటి సవాళ్లను ఎదుర్కోడానికి ఆర్కిటెక్ట్‌లు తమ సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆలోచనలు చేయాలని తెలిపారు. వీటికి సామాజిక, ఆర్థిక కోణంలో సాంకేతిక పరిష్కారాలను అన్వేషించాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత ‘ఆర్కిటెక్చర్ రికనెక్ట్ సమ్మిట్’లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మన దేశంలో అత్యధిక జనాభా ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి ఉందని, దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే దేశ స్థూల సంపద (జీడీపీ) పెరగాలని చెప్పారు. చైనా లాగా పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చి, వ్యవసాయ రంగం నుంచి వీలైనంత మందిని పారిశ్రామిక రంగానికి మళ్లిస్తే నగరీకరణ ప్రక్రియలో భాగంగా మన దేశాభివృద్ధి మరింత శీఘ్రతరం అవుతుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ గొప్ప ప్రజా రవాణా వ్యవస్థగా అంత్యంత ఆదరణ పొందడానికి అనేక కొత్త ఆవిష్కరణలే కారణమని అన్నారు. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ సమస్యకు మంచి ప్రజా రవాణా వ్యవస్థే సరైన పరిష్కారమని చెప్పారు. ప్రస్తుతమున్న సాంకేతిక, డిజిటల్ వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగిం చుకుంటూనే, సంప్రదాయంగా వస్తున్న సహజసిద్ధమైన భవన నిర్మాణ సూత్రాలను జోడించి, ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడంలో ఆర్కిటెక్ట్‌లు తగు మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. నగరాల్లో ఎక్కువగా ఉన్న పేదరికం, సరైన గృహ సదుపాయాలు లేకపోవడం, ఆహ్లాదకరమైన బహిరంగ ప్రదేశాలు లేకపోవడం వల్ల నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. అందువల్ల గృహ నిర్మాణ రంగం అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదనీటి ముంపు వంటి విపరీత పరిస్థితులను నగరాలు చవిచూస్తున్నాయని, వీటికి ఆర్కిటెక్ట్‌లు తగు పరిష్కార మార్గాలు ఆన్వేషించాలని తెలిపారు. వర్షపు నీటిని పొదుపు చేయడంలో సింగపూర్ చేపట్టిన చర్యలను ప్రస్తావిస్తూ, భూగర్భ నీటి స్థాయిని పెంచేలా తగు మార్గాలను అన్వేషించాలని, వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే నిర్మాణాలు తమ ప్రాజెక్టులలో అంతర్భాగం కావాలన్నారు.
రవాణా ఆధారిత అభివృద్ధిపై ప్రత్యేక ఆలోచనలు చేయాలని, అందుకు అనుగుణంగా నగరాల్లో మెట్రో మార్గాల వెంబడి బహుళ అంతస్తుల నివాస గృహాలను, కమర్షియల్ కాంప్లెక్స్‌లను, విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలని మెట్రో ఎండీ సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రధానంగా కర్బన ఉద్గారాలను తగ్గించడం ముఖ్యమని, హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థలో అటువంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. తాము చేపట్టిన ఇంధన పొదుపు, పర్యావరణహిత చర్యల వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను పొందడమే ఇందుకు తార్కాణమని చెప్పారు. హైదరాబాద్ మెట్రో ఎంతో ఆదరణకు నోచుకోవడానికి సుఖవంతమైన ప్రయాణం, ఇంధన పొదుపు, మహిళలకు తగు ప్రాధాన్యతను ఇవ్వడం ప్రధాన కారణమని తెలిపారు. ఈ సందర్బంగా వివిధ ఆర్కిటెక్ట్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సందర్శించారు.