– యాసంగిలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి
– 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సర్కార్ రెడీ
– 127 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
– 8,381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యాసంగిలో పండిన పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15,000 కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం దిగుబడిలో ఖరీఫ్ సీజన్‌లో యావత్ భారతదేశంలోనే రికార్డ్ సృష్టించిన తెలంగాణా రాష్ట్రం రబీ సీజన్‌లోనూ అదే రికార్డ్ సృష్టించబోతుందని ఆయన పేర్కొన్నారు. యాసంగిలో రాష్ట్ర రైతాంగం 54.89 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకుగాను ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకున్నట్టు ఆయన ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలోని పౌర సరఫరాల శాఖ కేంద్ర కార్యాలయం నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖ రూపొందించిన విధి విధానాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి.ఎస్.చౌహన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సునిశితమైందనీ, రానున్న 20 రోజులు అత్యంత కీలకమైనవనీ, ఈ సమయంలో కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడినట్టు కలెక్టర్ల దృష్టికి వస్తే సత్వరమే చర్యలు తీసుకోవడంతో పాటు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్.చౌహన్‌ను సంప్రదించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు మద్దతు ధరను రైతుల ఖాతాలో జమ చేయడంతో పాటు సన్నాలకందించే బోనస్ చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కొనుగోళ్లకుగాను ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,381 కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు 13.71 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. మరో 3.79 కోట్ల గోనె సంచులు సమీకరిస్తున్నట్టు మంత్రి వివరించారు. అయితే తేమ శాతాన్ని పరిశీలించిన మీదటనే రైతులకు గోనె సంచులు పంపిణీ చేయాలని ఆయన సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు గోదాములు అందుబాటులో లేని చోట్ల నేరుగా రైస్ మిల్లులకు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మధ్యంతర గోదాముల వసతి ఉన్న చోట కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఆయా గోదాములకు తరలించాలన్నారు. అవసరమని భావించిన ప్రాంతాల్లో ఇప్పటికే పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిలువ ఉంచే సామర్థ్యం కలిగిన గోదాములను కేటాయించినట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే 29 లక్షల మెట్రిక్ టన్నులకుపై బడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందనీ, సుమారు 2.55 లక్షల మంది రైతుల నుంచి 19.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం అందించే మద్దతు ధర ప్రకారం రూ.4,545.72 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ. 2,289 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని ఆయన తెలిపారు. సన్నాలకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ మొత్తం రూ. 444.20 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమౌతుందన్నారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు రైతాంగానికి తెలియజెప్పేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాల్లో ప్రతి రోజు ఉదయం వాతావరణ సమాచారాన్ని వివరిస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా ఎండ వేడిమికి ఇబ్బంది పడే రైతులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందు బాటులో ఉంచామన్నారు. తేమ శాతాన్ని తెలియజెప్పే డయ్యర్లను కొనుగోలు చేసిన కరీంనగర్ కలెక్టర్‌ను అభి నందించారు. మిగిలిన జిల్లాల్లో కుడా ఇది అమలు చేయా లని సూచించారు. దీంతో ధాన్యం నాణ్యతతో పాటు త్వరిత గతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు వీలుగా వాహనాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొను గోలు చేసిన ధాన్యాన్ని కేటాయించేందుకు 1,579 రైస్ మిల్లులను సీఎంఆర్ నిమిత్తం గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆయా రైస్ మిల్లులకు కేటాయించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన
కొత్తగా మంజూరు చేయనున్న తెల్ల రేషన్‌కార్డుల కోసం లబ్దిదారులు పెట్టుకున్న దరఖాస్తులను సునిశితంగా పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరిశీలన పూర్తి అయిన వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రబీ ధాన్యం కొనుగోలుకు రూ.15వేల కోట్లు
- Advertisement -