125 రోజుల పనికి అవసరం రూ.3 లక్షల కోట్లు
కేంద్రం కేటాయింపులు రూ.95 వేల కోట్లే
అవి పాత బకాయిలకే సరిపోవంటున్న నిపుణులు
హక్కు పోయే.. కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధాపడాల్సిందే
నేడు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఇందిరా పార్కు వద్ద ధర్నా
కేంద్రంలోని మోడీ సర్కారు ఉపాధి హామీ చట్టానికి ఉరేసింది. 125 రోజులకు పనిదినాలను పెంచామని గొప్పలకు పోతూ ఉన్న పనిని ఊడపీకే పనిని మొదలుపెట్టింది. కేంద్రం చెప్పినట్టు 125 రోజుల పని కల్పించాలంటే కేంద్ర బడ్జెట్‌లో కనీసం రూ.3 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉండగా దాన్ని కేవలం రూ.95 వేల కోట్లకే పరిమితం చేసింది. అందులో ఎన్ని ఖర్చుపెడుతుందనే విషయం మోడీ సర్కారుకే తెలియాలి. ప్రస్తుత కేటాయింపులు కూలీల పాత బకాయిలు చెల్లించడానికే సరిపోవనే విషయాన్ని నిపుణులు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. నరేగా చట్ట పరిరక్షణ కోసం దేశవ్యాప్త పిలుపులో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టనున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ భారతంలో కుల, మత, లింగబేధం లేకుండా అన్ని రకాల ప్రజలకు వారి జీవన హక్కులను బలోపేతం చేయటానికి వామపక్ష పార్టీల ఒత్తిడి మేరకు 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (నరేగా) యూపీఏ-1 ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టం ద్వారా కోట్లాది మంది కూలీలకు స్వగ్రామంలోనే ఉపాధి లభించింది. ఆకలి బాధలు, వలసలు తగ్గాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. మహిళల ఆర్థిక గౌరవాన్ని బలోపేతం చేసింది. 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ దాని ప్రభావం గ్రామీణ భారతంపై పెద్దగా పడలేదు.
కరువుల్లోనూ, కరోనా సమయంలోనూ గ్రామీణ ప్రజలను ‘ఉపాధి’ ఆదుకుంది. దళితులు 18.63శాతం, గిరిజనులు 17.32శాతం ఉపాధి పొందుతున్నారు. అలాంటి చట్టానికి మోడీ సర్కారు పదేండ్లుగా తూట్లు పొడుస్తూ వచ్చి ఇప్పుడు ఆ చట్ట మౌలిక స్వరూపాన్నే మార్చేసింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయించాలనే దానికి తిలోదకాలిచ్చి 40 శాతం రాష్ట్రాలు భరించాలనే నిబంధనను మోడీ సర్కారు తీసుకొచ్చింది. కేటాయింపులు క్రమంగా తగ్గించి నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నది.
కొత్త చట్టంతో కుచ్చుటోపి..
ఈ చట్టంలో ఉపాధి హక్కుకు గ్యారంటీ లేదు. కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పనులు, పనిదినాలుంటాయి. ఇక నుంచి రాష్ట్రాలు 40శాతం భరించాలి. అనేక రాష్ట్రాలు ఇప్పుడున్న పది శాతాన్నే భరించలేకపోతున్నాయి. ఓ పక్క కేంద్రం 125 రోజుల పనిదినాలు కల్పిస్తామని చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను ఖర్చుపెడితేనే కేంద్రం తన వాటా 60 శాతాన్ని విడుదల చేస్తుందనే మెలికను మోడీ సర్కారు పెట్టి కూర్చున్నది. ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకున్న విషయం విదితమే. ఇలాంటి సమయంలో రాష్ట్రాలు 40 శాతాన్ని ఎలా భరిస్తాయనేది కేంద్రమే చెప్పాలి.
ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో కుటుంబానికి 100 రోజులు పనిదినాలు గ్యారంటీ కల్పించాల్సి ఉండగా అందుతున్న పనిదినాలు 50 మాత్రమే. చట్ట ప్రకారం పని కల్పించాల్సిన రోజులకు నిరుద్యోగ భతి ఇవ్వాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వం దీన్ని ఎక్కడా అమలు జరపలేదు. భూస్వాములు, పెత్తందార్ల ఒత్తిళ్లకు తలొగ్గి క్రమంగా ఈ చట్టానికి పాతరేసింది. ఇప్పటి వరకూ హక్కుగా ఉన్న ఈ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరకడమే కాకుండా వ్యవసాయ వేతనాల స్థిరీకరణకు కూడా కొంతవరకు తోడ్పడింది. వలసలు కొంతవరకు ఆగాయి. కేంద్రం నిర్ణయంతో మళ్లీ గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రారంభమయ్యే ప్రమాదముంది.
రాష్ట్రంలో తగ్గిన పనిదినాలు
కేంద్రం నిధుల కోత ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తున్నది.. గతేడాది రాష్ట్రంలో 12.5 కోట్ల పని దినాలు కల్పించగా ఈ ఏడాది కేవలం 7.5 కోట్ల పని దినాలకే పరిమితమైంది. రాష్ట్రంలో 57.46 లక్షల జాబుకార్డులున్నాయి. 1.21కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. 2025-26లో మన రాష్ట్రానికి కేంద్రం నుంచి కేవలం రూ.1774 కోట్లు వచ్చాయి. 90శాతం నిధులు ఖర్చు పెట్టాల్సిన సమయంలోనే ఈ విధంగా తగ్గించి ఇచ్చిన కేంద్రం ఇప్పుడు పనిదినాలు పెంచి అవసరమైన వారందరికీ ఉపాధి హామీని ఇస్తుందంటే ఎలా నమ్మాలని ఉపాధి హామీ కూలీలు ప్రశ్నిస్తున్నారు.పైగా అనేక షరతులతో నిర్వీర్యం చేస్తున్న విషయం తెలిసిందే.
నేడు ఇందిరా పార్కు వద్ద ధర్నా : జి నాగయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు
దేశంలో జాబుకార్డులున్న వారికి 125 రోజుల పనిదినాలు కల్పించాలంటే కనీసం రూ.3 లక్షల కోట్లు కావాలి. నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని నిధులు ఏ మాత్రం సరిపోవు. చట్టం పేరు మార్చడం దుర్మార్గం. ఇక నుంచి కూలీలకు కష్టాలు తప్పవు. ఇది పూర్తిగా గ్రామీణ ధనవంతులకు, పట్టణ ప్రాంత కార్పొరేట్లకు ఉపయోగపడే చర్య. పట్టణాలకు వలసలు పెరుగుతాయి.
ఇప్పటికే గ్రామీణ పేదలకు సరైన వైద్య సౌకర్యాలు లేవు. విద్యా అందుబాటులో లేదు. పేదరికం పెరుగుతుంది. ఆకలి చావులు పెరుగుతాయి. పెరుగుతున్న ధరలను తట్టుకోవటం కష్టమవుతుంది. ఉపాధి హామీని కుదించిన సమయంలో బేరసారాల హక్కు కోల్పోతారు. ఈ నేపథ్యంలోనే నరేగా చట్టాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నాం. వీబీ జీ రామ్ జీని ఉపసంహారించుకునే వరకు పోరాటాలు చేస్తాం. దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించబోతున్నాం.



