ప్రయోగాత్మకంగా అమలు..
యాప్ పనితీరు పట్ల రైతుల సంతృప్తి
రెండ్రోజుల్లోనే 60,510 యూరియా బస్తాలు బుకింగ్
త్వరలో అన్ని జిల్లాల్లో అమలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయశాఖ ద్వారా ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామనీ, లక్ష మందికిపైగా రైతులు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రెండ్రోజుల్లోనే 60,510 యూరియా బస్తాలు బుక్ చేసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 897, జనగామ జిల్లాలో 5150, మహబూబ్ నగర్ 3741, నల్లగొండ 3618, పెద్దపల్లి జిల్లాలో 6289 మొత్తం 19,695 మంది రైతులు ఈ యాప్ ద్వారా యూరియాను తమ సమీప డీలర్ దగ్గర బుక్ చేసుకున్నారని వివరించారు. 217 మంది కౌలు రైతులు కూడా 678 యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారని తెలిపారు. తొలిరోజు ఎదురైన సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించామని పేర్కొన్నారు. రైతులు కూడా ఈ యాప్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారనీ, వారికి వారి ఊరిలో ఏ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుస్తుందనీ, తద్వారా వారు బుక్ చేసుకొని నచ్చిన సమయంలో షాప్ వద్దకు వెళ్లి ఓటీపీ చూపించి కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. యాప్‌ను మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రైతునేస్తం కార్యక్రమంలో కూడా రైతులకు యాప్‌పై గల సందేహాలను నివృత్తి చేశామని చెప్పారు. రబీ సీజన్‌కుగానూ రాష్ట్రానికి ఇప్పటికే 5.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందనీ, యూరియా వినియోగం అధికంగా ఉండే జనవరి, ఫిబ్రవరి నెలలకుగానూ సరిపడా యూరియాను ముందస్తుగానే తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఐదు జిల్లాల్లో యూరియా యాప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



