బిఆర్ఎస్ నాయకులు ఉపకృష్ణ డిమాండ్
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా సరఫరా యాప్‌ను తక్షణమే రద్దు చేసి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు, రైతు మిత్ర సంఘాల ద్వారా నేరుగా యూరియా అందించాలని భారత్ రాష్ట్ర సమితి నాయకుడు ఉప్పు కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వరి నాట్లు వేసి రెండు నెలలు గడిచినా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. చాలా మంది రైతుల వద్ద స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం, ఇంటర్నెట్ సమస్యలు ఉండటం, ఆధార్ నంబర్-ఫోన్ నంబర్ లింక్ సమస్యలు, పాస్‌బుక్ నంబర్ నమోదు వంటి ప్రక్రియలు రైతులకు భారంగా మారాయని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సిగ్నల్ కూడా సరిగా లేని పరిస్థితుల్లో యాప్ డౌన్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. రైతులకు యూరియా అందించే విషయంలో ఆన్‌లైన్ విధానాన్ని నిలిపివేసి, ఆఫ్‌లైన్ పద్ధతిలో నేరుగా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం వల్ల యూరియా సరైన రీతిలో రైతులకు చేరడం లేదని, బ్లాక్ మార్కెట్‌కు మళ్లే అవకాశాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం వైపు నెట్టే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని ఉప్పు కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



