Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇంటి నుంచే యూరియా బుకింగ్‌

ఇంటి నుంచే యూరియా బుకింగ్‌

- Advertisement -

ఈ నెల 20 నుంచి అమల్లోకి ప్రత్యేక మొబైల్‌ యాప్‌
యూరియా అధిక వినియోగం, పంట అవశేషాల కాల్పివేత నష్టాలపై అవగాహన కల్పించాలి : రబీ ముందస్తు ప్రణాళికపై అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రైతులు యూరియా కోసం సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే అవసరమైన యూరియాను ఇంటి నుంచే బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని రైతులకు కల్పిస్తూ త్వరలో ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను తీసుకురాబోతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నెల 20 నుంచి ఎరువుల మొబైల్‌ యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రబీ ముందస్తు ప్రణాళికపై రాష్ట్ర, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అధిక యూరియా వినియోగం వల్ల జరిగే అనర్థాలపైనా, పంట కోత తర్వాత అవశేషాలను కాల్చివేయడం పర్యావరణానికి జరిగే నష్టాలపైనా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎరువుల యాప్‌ ద్వారా రైతులు తమకు సమీపంలోని డీలర్‌ వద్దతో పాటు జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్‌ లభ్యతను తెలుసుకోవచ్చునని తెలిపారు.

తమకు అనుకూలమైన ఏ డీలర్‌ నుంచైనా ముందుగా బుక్‌ చేసి కొనుగోలు చేసుకునే అవకాశం ఈ యాప్‌ ద్వారా లభించనుందన్నారు. అవసరమైతే, యూరియా బుకింగ్‌ కోసం రైతులు తమ పరిధిలోని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి సేవలను కూడా వినియోగించుకోవచ్చని సూచించారు. యూరియా కావాల్సిన రైతు మొబైల్‌ యాప్‌లో బుక్‌ చేసుకోవాలన్నారు. బుకింగ్‌ ఐడీని, బుక్‌ చేసిన పరిమాణాన్ని ధ్రువీకరించిన తర్వాతనే డీలర్లు యూరియా విక్రయిస్తారని తెలిపారు. బుకింగ్‌లో సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్‌ నెంబర్లను కూడా కేటాయిస్తామన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా, పంట పండించే రైతులకు మాత్రమే యూరియా అందించాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను తీసుకురాబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని మంత్రి మరోసారి గుర్తుచేశారు.

యాప్‌లోని అంశాలిలా…
రైతులు/ సిటిజన్‌, అధికారులు, డీలర్ల కోసం వేర్వేరు లాగిన్లు.
మొబైల్‌ నెంబర్‌, ఓటీపీ ద్వారా లాగిన్‌ అయ్యే అవకాశం.
లాగిన్‌ అవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో కనిపిస్తుంది.
లాగిన్‌ అయిన రైతులు తమ జిల్లాను ఎంపిక చేయగానే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా బ్యాగులు కనిపిస్తాయి.
పాస్‌ బుక్‌ నెంబర్‌ను ఎంట్రీ చేసి ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే విషయాన్ని నమోదు చేయాలి.

వారు సాగు చేసే ఎకరాలను బట్టి వారికి అవసరమయ్యే యూరియా బ్యాగులు యాప్‌లో కనిపిస్తాయి.
అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో ఒకటి నుంచి నాలుగు దశల్లో అందేలా వివరాలు కనిపిస్తాయి.
పాస్‌ బుక్‌లు లేని రైతులు వారి పట్టా పాస్‌ బుక్‌ దగ్గర ఆధార్‌ సెలెక్ట్‌ చేసుకొని, ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి ఒటీపీ కన్ఫర్మేషన్‌ చేసుకున్న తర్వాత వివరాలు నింపాలి.
కౌలు రైతులైతే వారి పేరు, తండ్రి పేరు, ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఓటీపీ కన్ఫర్మేషన్‌ అయిన తర్వాత భూ యజమాని పట్టా పాస్‌ బుక్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే యజమాని మొబైల్‌ నెంబర్‌తో ఓటీపీ వ్యాలిడేషన్‌ తర్వాత కౌలురైతులు వివరాలు నమోదు చేయాలి.
డీలర్లు వారి మొబైల్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ అయి రోజువారీ స్టాక్‌ను, అమ్మకం వివరాలను నింపాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -