– ఏజెన్సీ ప్రాంతంలో దందా
– కోరమాండల్ నుంచి నేరుగా జీరో సరుకు?
– ఆంధ్రప్రదేశ్ నుంచీ దిగుమతి
– బస్తా రూ.500 వరకూ విక్రయం
– ఖాతాదారులకు మాత్రమే
– డీలర్ల అమ్మకాలు
– కొన్నిచోట్ల పరిపతి ఉన్న రైతులకే పీఏసీఎస్‌ల పంపిణీ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి : యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు. ఎక్కడ చూసినా బారులు తీరి ఉంటున్నారు. వ్యవసాయ పనులు పక్కనబెట్టి క్యూలైన్‌లో పొద్దస్తమానం నిల్చుంటున్నారు. రైతుల ఇబ్బందులను డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.270 విలువ చేసే 45 కేజీల యూరియా బస్తాను కొన్నిచోట్ల రూ.500కి పైగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా యూరియా బ్లాక్ దందా కొనసాగుతోంది. ఎక్కడైతే పురుగుమందుల దుకాణదారులు, డీలర్లకు రైతులు ఖాతాలు పెడుతుంటారో, అటువంటి చోట రూ.500కు పైగా బస్తాను విక్రయిస్తున్నారు. కొందరు డీలర్లు ఎరువుల బస్తాల కోసం ‘క్యాష్ అండ్ క్యారీ’ అని షరతు పెడుతున్నారు.
కోరమాండల్ ఫ్యాక్టరీల నుంచే జీరో సరుకు?
కోరమాండల్ ఫ్యాక్టరీల నుంచి నేరుగా జీరో సరుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతోందని స్థానిక రైతులు చెబుతున్నారు. ఆళ్లపల్లి, గుండాల, కరకగూడెంతో పాటు పలు మండలాలకు మూడు రోజులకో లారీ చొప్పున గుట్టుచప్పుడు కాకుండా యూరియా వస్తోంది. ఒక్కో లారీలో 450కి పైగా బస్తాలు ఉంటున్నాయి. ఇలా వచ్చిన యూరియాను బ్లాక్‌లో రూ.500కు దుకాణాదారులు విక్రయిస్తున్నారని సమాచారం. కొద్దిరోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇలా యూరియా రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు సరఫరా అయినట్టు సమాచారం. ఆ రాష్ట్రంలోనూ యూరియాపై గట్టి నియంత్రణ ఏర్పాటు కావటంతో ప్రస్తుతం రవాణా నిలిచినట్టు సరిహద్దు రైతులు చెబుతున్నారు. ఇలా బ్లాక్‌లో తీసుకున్న రైతులు యూరియా వివరాల వరకు వెల్లడిస్తున్నారు తప్ప, తమ పేర్లు, ఇతర వివరాలు బయటకు చెప్పొద్దని కోరుతున్నారు.
డీబీటీ మిషన్‌లో నమోదు లేకుండా విక్రయాలు
బ్లాక్‌లో అధిక ధర వెచ్చించైనా రైతులు యూరి యాను కొనుగోలు చేస్తున్నారు. ఫెర్టిలైజర్ దుకాణాల్లో సరుకు అన్‌లోడ్ చేసి, వివరాలు డీబీటీ మిషన్‌లో నమోదు చేయకముందే ఆటోలు, ట్రాక్టర్లు, జీపుల్లోకి యూరియా బస్తాలను ఎక్కిస్తుండటం గమనార్హం. అన్‌లోడ్ చేసుకుని డీబీటీ మిషన్‌లో నమోదు చేసిన అనంతరం రైతు ఆధార్‌కార్డు, పాస్‌బుక్ జిరాక్స్‌తో పాటు వేలిముద్ర తీసుకొన్న తర్వాత బస్తా రూ.267 చొప్పున విక్రయించాలి. కానీ యూరియాకు ప్రస్తుతం ఉన్న డిమాండ్, రైతుల అవసరాన్ని గుర్తెరిగి ఫర్టిలైజర్స్ దుకాణదారులు రూ.500కు పైగా ధరకు విక్రయిస్తున్నారు. స్థానిక వ్యవసాయశాఖ అధికారులకు ఈ విషయం తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వ్యవసాయాధికారులు దాడులు నిర్వహించి జీరో యూరియా సరఫరా చేస్తున్న లారీలను సీజ్ చేస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.
పరపతి ఉన్న రైతులకే పీఏసీఎస్‌ల అమ్మకం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా కొన్ని ప్రాంతాల్లో పరపతి ఉన్న రైతులకు మాత్రమే యూరియా అందుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో పేద, సన్నకారు రైతులు, ముఖ్యంగా పోడు రైతులు ఎక్కువగా ప్రయివేటు డీలర్ల వద్దనే యూరియా కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వందల ఎకరాలు సేద్యం చేస్తున్న రైతులు మాత్రం పీఏసీఎస్‌ల నుంచి యూరియాను తీసుకెళ్తున్నారని సమాచారం. వరి నాట్లు ముమ్మరం కావటంతో యూరియాకు అధిక డిమాండ్ ఏర్పడింది. పీఏసీఎస్‌లలో ఒక్కొక్కరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో ధరతో నిమిత్తం లేకుండా రైతులు ప్రయివేటుగా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
అరకొర సరఫరాతో సమస్యలు
కేంద్రప్రభుత్వం యూరియాను అరకొరగా సరఫరా చేస్తుండటం వల్లనే రైతన్నలపై భారం పడుతోంది. రాష్ట్రానికి ఈ వానాకాలానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఆగస్టు 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 5.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. ఇంకా 2.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి అందకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
బ్లాక్‌లో యూరియా..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES