Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రణాళిక లేకనే యూరియా కొరత

ప్రణాళిక లేకనే యూరియా కొరత

- Advertisement -

రైతుల ఇబ్బందులు తొలగించాలి

– విషజ్వరాలను అరికట్టాలి
– బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : విలేకర్ల సమావేశంలో జూలకంటి

నవతెలంగాణ – మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం, రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరముండగా.. కేంద్ర ప్రభుత్వం 9.8 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే కేటాయించిందన్నారు. ఇందులో ఇప్పటి వరకు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియానే అందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు తప్ప దేశ ప్రజల అభివృద్ధి పట్టదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను రాజకీయ కక్షతో పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బఫర్‌ స్టాక్‌ నిల్వ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు యూరియా కొరత ఏర్పడిందని, దీని వల్ల రైతులు రోజుల తరబడి కార్యాలయాల ఎదుట లైన్‌లో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన యూరియా తెప్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అనేక ఇండ్లు కూలి నిరాశ్రయులయ్యారని తెలిపారు. విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి జ్వరాల బారినపడి పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైద్య సేవలు సరిగా అందక సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య బృందాలను పంపించి వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాల్లో పాలకవర్గాలు లేక పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని, వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు.
నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రోజురోజుకూ సాగు తగ్గిపోతోందని చెప్పారు. ప్రభుత్వం బత్తాయి పంటకు ధర కల్పించకపోవడం, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. బత్తాయి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవి నాయక్‌, వన్‌ టౌన్‌, టూ టౌన్‌ కార్యదర్శలు డా.మల్లు గౌతమ్‌ రెడ్డి, బావాండ్ల పాండు, నాయకులు రేమిడాల పరుశురాములు, నాయకులు అప్పారావు, నగేష్‌ ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad